నా ప్రియ స్నేహితులారా, ఈరోజు బైబిల్ నుండి విలువైన వాగ్దానముగా అపొస్తలుల కార్యములు 18:10 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నేను నీకు తోడై యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు...'' అని ప్రభువు పౌలుతో చెప్పాడు. ఇది ఎంతటి ఆదరణకరమైన వాగ్దానము కదా! దేవుడు మరల మరల చెబుతున్నాడు, "నేను నీకు తోడైయున్నాను.'' అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు, ఎవరూ మనకు విరోధంగా నిలబడలేరు. ఆయన మనలను కాపాడుతాడు, తన సన్నిధితో మన చుట్టూ ఆవరించి ఉంటాడు మరియు హాని నుండి మనలను కాపాడి సంరక్షిస్తాడు. కొన్నిసార్లు ప్రజలు మనకు విరోధంగా లేస్తారని లేదా మన గురించి చెడుగా మాట్లాడతారని మనం భయపడవచ్చును. కానీ ప్రభువు, 'భయపడకు' అని చెబుతున్నాడు. ఆయన యెహోషువతో ఉన్నట్లుగానే, నేడు మనతో కూడా ఉన్నాడు. కనుకనే, మనము దేనికిని భయపడనవసరము లేదు. అందుకే బైబిల్ నుండి యెహోషువ 3:7వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను'' అన్న వచనము ప్రకారము నేడు మనలను అందరి యెదుట గొప్ప చేయుటకు ఆయన మన పట్ల వాంఛ కలిగియున్నాడు. కనుకనే, అదే దేవుడు నేడు మిమ్మును కూడా పైకి లేవనెత్తి ప్రజల యెదుట ఘనపరుస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ మార్గాలను వర్ధిల్లజేస్తాడు మరియు మీ జీవితాన్ని తన శక్తికి సాక్ష్యంగా మారుస్తాడు.
కాబట్టి, నా ప్రియులారా, మీరు దేవుని ప్రణాళికను అనుసరించినప్పుడు, వ్యతిరేకత లేదా నిరుత్సాహం యొక్క క్షణాలను మీరు ఎదుర్కొంటుండవచ్చును. అయినప్పటికి దేవుడు మిమ్మల్ని కాపాడతానని మరియు భద్రపరుస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. మీ ఆత్మకు హాని కలిగించడానికి ఆయన ఎవరినీ ఎన్నటికిని అనుమతించడు. ఆలాగుననే, నిర్గమకాండము 23:27-30వ వచనములలో ప్రకటింపబడినట్లుగానే, "నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుట నుండి పారిపోవునట్లు చేసెదను. మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుట నుండి వెళ్లగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ యెదుట నుండి వెళ్లగొట్టెదను'' ప్రకారము ప్రభువు స్వయంగా మీకు ముందుగా వెళ్తాడు, మీ యుద్ధాలను ఆయనే జరిగిస్తాడు మరియు మీ మార్గంలో అడ్డంకులను తొలగిస్తాడు. ఒకప్పుడు మిమ్మును వ్యతిరేకించిన ప్రజలు మీ జీవితంపై దేవుని అనుగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, మీరు ఆయనకు చెందినవారు కాబట్టి ఆయన వారి హృదయాలలో మీ పట్ల భయాన్ని కూడా పుట్టిస్తాడు. యెహోవా మిమ్మల్ని వృద్ధిపొందింపజేస్తాడు, ఆయన వాగ్దానం చేసిన దేశాన్ని మీకు ఇస్తాడు మరియు మీ భూభాగాన్ని విస్తరింపజేస్తాడు. అందుకే బైబిల్ నుండి జెకర్యా 2:5వ వచనములో చెప్పబడినట్లుగానే, " నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మిమ్మును అగ్ని ప్రాకారమువలె చుట్టుముట్టి, అన్ని వైపుల నుండి మిమ్మును కాపాడును మరియు ఆయన మహిమ మీ ద్వారా ప్రకాశించునట్లుగా చేయును.
అవును నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మీకు సహాయకుడు మరియు రక్షకుడు అని ఆయన యెహోషువ 1:5వ వచనములో ఇలాగున అంటున్నాడు, " నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీయెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును'' అని చెప్పబడిన ప్రకారము ఈ వాగ్దానాన్ని ఈ రోజే నమ్మండి. దేవుడు ప్రతి కాలంలోనూ, ప్రతి యుద్ధంలోనూ, ప్రతి పనిలోనూ మీతో కూడా ఉన్నాడు. కనుకనే, ధైర్యంగా ముందుకు సాగండి. మీ పనిని మరియు పరిచర్యను ఆనందంగా చేయండి. ఎవరూ మూసివేయలేని తలుపులను ప్రభువు తెరుస్తాడు. ఆయన హృదయాలను మృదువుగా చేసి, మీకు తన కటాక్షమును అనుగ్రహించి, మీ స్వరం వినిపించేలా చేస్తాడు. కనుకనే, బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 34:12వ వచనములో చూచినట్లయితే, " ఆ బాహుబలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు'' అని మోషేను గురించి చెప్పినట్లుగానే, మిమ్మును చూచువారు వారు మీరు దేవునితో నడుస్తున్నారని తెలుసుకుంటారు. అవును, నా ప్రియులారా, మీరు ఆయన ప్రియమైన బిడ్డలుగాను మరియు ఆయన సన్నిధి మిమ్మల్ని ఇతరులందరి నుండి ప్రత్యేకపరుస్తుంది. కనుకనే, నా ప్రియులారా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు ఎల్లప్పుడు మాతో ఉంటావని నీ వాగ్దానానికై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ సన్నిధిలో నడవడానికి మమ్మును ధైర్యముతోను మరియు విశ్వాసంతోను నింపుము. దేవా, శత్రువు యొక్క ప్రతి హాని మరియు దాడి నుండి మమ్మును రక్షించుము. ప్రభువా, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్థిల్లకుండా చేయుము. దేవా, నీ యొక్క అగ్ని ప్రాకారములతోను మరియు మహిమతో మమ్మును చుట్టుముట్టుము. తండ్రి, మనుష్యుల దృష్టిలో మాకు నీ కృపను మరియు మా హృదయంలో సమాధానమును దయచేయుము. దేవా, మేము ముందుకు సాగిపోవడానికి మరియు జీవితములో నడవడానికి నీవు మా పట్ల ఉద్దేశించిన ప్రతి ద్వారములను తెరవుము. యేసయ్యా, మాకు విరోధముగా వచ్చువారు మా జీవితంపై నీ యొక్క ఆశీర్వాదపు హస్తాన్ని చూచునట్లుగా నీకృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు మాతో ఉన్నావని ఇతరులు గుర్తెరుగునట్లుగా మమ్మును ప్రజల యెదుట హెచ్చించుము. దేవా, మమ్మును ఫలించువారలనుగా చేయుము మరియు నీ మహిమ కొరకు మా సరిహద్దులను విస్తరింపజేయుము. ప్రభువా, మోషే వలె నీ ప్రకాశము మా ముఖము మీద ప్రకాశించునట్లుగాను, అది చూచినవారు నీవు మాతో కూడా ఉన్నావని గుర్తించునట్లుగా మాకు సహాయము చేయుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


