మన ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హోషేయ 14:6వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును'' ప్రకారము ఎవరిని గురించి ఈ వచనములో చెప్పబడియున్నది? ఇశ్రాయేలీయుల ప్రజలను గురించి ఈ వచనములో ఎంతో అద్భుతముగా వివరించబడియున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 135:4వ వచనమును చూచినట్లయితే, "యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను'' అని చెప్పబడిన ప్రకారము అవును, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు చేత ఏర్పరచుకొనబడినటువంటివారు. ఇంకను ఆయన తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. అందుకు బైబిల్ నుండి యెషయా 44:21వ వచనములో మనము చూచినట్లయితే, "యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను'' అని చెప్పబడిన ప్రకారము ఇదియే కదా! ఇశ్రాయేలీయుల ప్రజలను గురించి ప్రభువు ఇలాగున అంటున్నాడు.
అదేవిధముగా, నా ప్రియమైనవారలారా, మన ప్రభువైన యేసయ్యను మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించినప్పుడు, మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఇంకను బైబిల్ నుండి యెషయా 48:17వ వచనములో చూచినట్లయితే, "నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును'' అని చెప్పబడిన ప్రకారము పాతనిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏవిధంగా ఏర్పరచుకొనబడియున్నారనియు, పిలువబడియున్నారు, ప్రేమించబడియున్నారు అని మనము చూడగలుగుతాము. అందుకే ప్రభువు అంటున్నాడు, "నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.'' ఆలాగుననే, నేటికిని కూడా, బైబిల్ నుండి నూతన నిబంధన గ్రంథములో గలతీయులకు 2:20వ వచనములో అపొస్తలుడైన పౌలు రచించిన రీతిగానే మనము కూడా అదే దీవెనను పొందుకుందాము.
నా ప్రియులారా, ప్రభువుతో మనము అటువంటి అన్యోన్య నడవడిని ఎలా కలిగియుండగలుగుతాము? మనము బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడి యున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ప్రభువు మీ కొరకు అనేకమైన ఆశీర్వాదములను సిద్ధపరచియున్నాడు. కనుకనే, మీ జీవితమును మీరు ప్రభువునకు సమర్పించుకొనియున్నారా? యేసయ్యను మీ రక్షకునిగా మీరు అంగీకరించియున్నారా? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు కడగబడియున్నారా? నా ప్రియులారా, ఇప్పుడు కూడా మిమ్మును మీరు ప్రభువు హస్తాలకు సమస్తమును సమర్పించి, మీ జీవితములను అర్పించిన యెడల ప్రభువు మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ వైపు చూస్తున్న మా హృదయ వాంఛలను ఎరిగియున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా యొక్క హృదయము నీ యెదుట తెరువబడిన పుస్తకము వలె ఉన్నది, రక్షణ లేని మాకు రక్షణను దయచేయుము. యేసయ్యా, మా జీవితమును నీ రక్తము ద్వారా కడగబడి, ఇప్పుడే మాకు రక్షణను అనుగ్రహించి, మేము నీ బిడ్డలనుగా మార్చి, మమ్మును దీవించి, మిగిలిన ఆశీర్వాదములన్నిటిని మాకు దయచేయుము. దేవా, నీతో అన్యోన్య సహవాసము కలిగియుండు కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును నీ స్వకీయ ధనముగా ఎంచుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా తల్లి గర్భంలో నీవు మమ్మును రూపొందించియున్నందునకై నీకు వందనములు. ప్రభువా, నీవు మమ్మును ఎన్నటికిని మరచిపోజాలవని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము వెళ్ళవలసిన మార్గంలో మమ్మును మరియు క్రీస్తుతో సిలువ వేయబడటానికి మాకు సహాయం చేయుము, తద్వారా ఇక మేము జీవించను, కానీ మాలో నివసించువాడు క్రీస్తు. దేవా, నీ విలువైన రక్తంతో మమ్మును కడిగి, మమ్మును నీకు సమీపముగా తీసుకొనివచ్చునట్లుగా కృపను దయచేయుము. యేసయ్యా, మేము నీతో సన్నిహిత సహవాసం కలిగి ఉండే ఆశీర్వాదం మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


