నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరియు ఈ రోజున మీకు శుభములను తెలియజేయుటకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:29వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు సమస్యలను అధిగమించుటకు ఇబ్బంది పడుచున్నారా? ఆర్థికపరమైనటువంటి సౌలభ్యము కొరకు ప్రభువు వైపు చూస్తున్నారా? దీర్ఘకాలముగా ఏదైనా ఉద్యోగము మరియు సంతానము కావాలని ప్రయత్నించుచున్నారా? దీర్ఘకాలముగా పదోన్నతి కొరకు వేచియున్నారా? మీ కుటుంబములో అనేకమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారా? లేదా ఏమి అర్థముకాకుండా, మీరు మీ భవిష్యత్తును ఎదుర్కొంటున్నారా? అయితే, మీరు దేనిని గురించి చింతించకండి.
నా ప్రియులారా, కానీ, ఈ రోజు దావీదు భక్తుడు అన్నరీతిగా, మీ మార్గములో మీకు ఎదురగుచున్న ప్రతి అడ్డంకులను కూడా దేవుని సహాయము వలన మీరు జయించగలుగుతారు. అవును, దేవుడు దావీదు రాజుకు తన శత్రువులందరిపైన జయమిచ్చునప్పుడు, ఈ యొక్క మాటను పాటగా పాడియున్నాడు, "నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును'' అని దావీదు భక్తుడు పాడియున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు దేవుని సహాయము వలన మీకు ఎదురగుచున్న అడ్డంకులన్నిటిని మీరు జయించగలుగుతారు.
బైబిల్ గ్రంథములో చూచినట్లయితే, యేసు యొక్క శిష్యులు పడవలో దాటుచున్నప్పుడు, ఒక గొప్ప తుఫాను ఆ సముద్రములో ఎదురైనది. వారందరు కూడా మునిగిపోతామని భయపడ్డారు. అయితే, ఆకస్మాత్తుగా, ఒకరు నీటి మీద నడుచుకుంటూ రావడము చూశారు. నీటి మీద నడుచుచున్నది యేసయ్య అని వారు గుర్తెరిగినప్పుడు, పేతురు కూడా పడవ నుండి సముద్రములో నడవాలని ప్రయత్నించాడు. అవును, పేతురు యేసయ్య ముఖమును చూస్తూ ఆయన వైపు నడుచుచుండెను. అయితే, ఆకస్మాత్తుగా తన చుట్టు ఉన్న తుఫానును, ఎగసి పడుచున్న అలలను చూచినప్పుడు అతడు మునిగిపోవడము ప్రారంభించాడు. అప్పుడు వెంటనే, యేసయ్య వచ్చి, పేతురు యొక్క చేయిని పట్టుకొని, పైకి లేపి, సముద్రములో నుండి కాపాడాడు.
అదేవిధముగా, నా ప్రియులారా, మన దేవుడు మన సమస్యల నుండి విడిపిస్తాడు అను ఒక గొప్ప విశ్వాసమును కలిగియుంటాము. మనము ప్రభువు యొక్క ముఖమును చూస్తూ నడుస్తాము. అయితే, సమస్యలు ఎదురైనప్పుడు, మన దృష్టి సమస్యల వైపు మరల్చబడుతుంది. మన గురించి మాట్లాడుకుంటున్న ప్రజల వైపు మన దృష్టి మరలుతుంది. 'అయ్యో, నేను ఈ సమస్య నుండి విడుదల పొందకపోయినట్లయితే, ఏమైపోతాము' అని అనుకుంటాము. అయితే, ఒకవేళ మాకు ఈలాగున జరిగినట్లయితే, ఏమైపోతామును అని అనుకుంటాము. మేము ఒకవేళ, ఓటమిని పొందుకుంటామే మో? మేము చనిపోతామేమో,' అని అనుకుంటాము. ఈలాగునే, భయముతో మన హృదయము నిండిపోతుంది. తద్వారా, మనము మునిగిపోవుటకు ప్రారంభిస్తాము. అయితే, యేసయ్య, మన యొద్దకు వచ్చి, గట్టిగా మనలను పట్టుకొని, మన సమస్యల నుండి బయటకు తీసుకొని వస్తాడు. దావీదు వలె మనము కూడా ఈలాగున చెప్పగలుగుతాము. యేసయ్యా, మనలను విడుదల చేసినప్పుడు, "నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును'' అని చెప్పగలము. నా ప్రియులారా, ఈ రోజు మీ కనులను, మీ దృష్టిని యేసయ్య మీద ఉంచండి. ఆయనే మీ బలముగా ఉన్నాడు. మేము సమస్యలలో మునిగిపోవుచున్నాము అని ఈ రోజు మీరు అంటున్నారా? అయితే, యేసయ్య మిమ్మును నిశ్చయముగా, విడుదల చేస్తాడు. దావీదు రాజు పాడి, దేవునిని స్తుతించినట్లుగానే, మీరు కూడా ఆలాగుననే, పాడి, ఆయనను స్తుతించెదరు. కాబట్టి, నా ప్రియులారా, మీరు దేవునిని విశ్వసించండి. అప్పుడు మీరు దేవుని యొక్క అద్భుతములను చూచెదరు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే మా బలము మరియు మా విమోచకుడవు. ప్రభువా, మా జీవితములో ఉన్న ప్రతి ఆటంకమును అధిగమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి సమస్య నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, ఈ రోజు మేము ఎదుర్కొంటున్న సమస్యల నుండి, శ్రమల నుండి మమ్మును విడిపించుము. దేవా, మా కుటుంబ సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించి, మా కుటుంబములో సమాధానమును అనుగ్రహించుము. ప్రభువా, మేము పనిచేయు స్థలములో ఉన్న ప్రతి కష్టమును తొలగించుము. దేవా, మమ్మును ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుము మరియు మా ఆర్థిక అవసరాలన్నింటిని తీర్చుము. ప్రభువా, మా భవిష్యత్తును, మా చదువులను మరియు మేము చేయు ప్రతి ప్రయత్నములను ఆశీర్వదించుము. దేవా, మా ఉద్యోగములో మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించి, సమాధానమును కలుగజేయుము. యేసయ్యా, మా జీవితములో నీవు మమ్మును పైకి లేవనెత్తి, మా మీద నీ యొక్క బలమైన హస్తమును చాపి, మా యొక్క ప్రతి తుఫాను నుండి మమ్మును రక్షించుము మరియు మా శరీరమును స్వస్థపరచుము. దేవా, మా యొక్క ఆర్థికపరమైన దీవెనలను మాకు దయచేసి, మా భవిష్యత్తును ఆశీర్వదించుము. ప్రభువా, మా దృష్టిని నీ మీదనే ఉంచునట్లుగా చేయుము. దేవా, మేము భయమునకు ఎన్నడూ లోనుకాకుండా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ అద్భుతమైన శక్తి ద్వారా మేము అభివృద్ధి చెందడానికి మరియు ప్రతి సవాలును అధిగమించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


