హలో నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములను తెలియజేయుచూ, మిమ్మును పలకరించుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 5:1వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీసు ్తద్వారా దేవునితో సమాధానము కలిగియుందము'' అని చెప్పబడినట్లుగానే, మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనము విశ్వాసమును కలిగియుండాలి. అవును, నా ప్రియులారా, ఇది ఎంతో గొప్ప వాగ్దానవచనమైయున్నది కదా! దేవుడు తనతో మనము సమాధానమును కలిగియుండాలని మన పట్ల ఆశించుచున్నాడు. తన సమాధానమును మీకివ్వాలని అనుకుంటున్నాడు. ఈ వచనమును మనము జ్ఞాపకము చేసుకంటున్నప్పుడు, నాకు ఒక చిన్న కథ జ్ఞాపకమునకు వచ్చినది. ఒక అబ్బాయి తన యింటి లోపల ఒక బంతితో ఆడుకోవాలని అనుకున్నాడు. అయితే, యింటి లోపల బంతితో ఆడుకున్నట్లయితే, ఏదైన వస్తువు పగిలిపోతుంది అని ఆ పిల్లవానితో తన తండ్రి చెప్పాడు. కాబట్టి, బయట మాత్రమే బంతితో ఆడుకోవాలని చెప్పాడు. ఒకానొక రోజు తన తండ్రి ఇంటిలో లేని సమయములో, ఆ బాబు యింటి లోపల బంతితో ఆడుకున్నాడు. కానీ, ఆ బంతి గోడకు కొట్టుకొని, యింటి లోపల ఉన్నటువంటి చక్కని గాజు కుండిని తగిలి అది పగిలిపోయినది. నేల మీద ఆ పగిలిపోయిన ముక్కలను చూచినప్పుడు ఆ పిల్లవాడు ఎంతగానో భయపడ్డాడు. అయ్యో, ఏ వస్తువును పగిలిపోకుండ ఉండాలని మా తండ్రిగారు బంతితో ఇంటిలో ఆడుకోకూడదని చెప్పారు. అయితే, ఇప్పుడు ఈ గాజు పాత్ర పగిలిపోయినది. మా నాన్నగారు వచ్చి, నన్ను తిడుతాడు, కేకలు పెడతాడు అని ఆలాగున అనుకొని, ఆ పిల్లవాడు ఎంతో భయపడి, నేల మీద పడియున్న పగిలిపోయిన ముక్కలన్నిటిని తీసి ఒక్కొక్కదానినిగా అతికించడము ప్రారంభించాడు. అయితే, ఏదియు కూడా పనిచేయలేదు.
కానీ, అప్పుడు ఆ పిల్లవాడు, ఇక నేనేమి చేయలేను. కనుకనే, ఇంక ఈ విషయమును నేను మా తండ్రితో చెప్పాలి అని తన హృదయములో తలంచాడు. కానీ, తన తండ్రి ఉద్యోగము నుండి యింటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ యింటిలో పడియున్న గాజు ముక్కలను చూచి, ఆ గాజు పాత్ర పగిలిపోయి ఉండుట గమనించాడు. తన కుమారుని యొద్దకు వెళ్లినప్పుడు, ఆ కుమారుడు తన తండ్రిని చూచి, 'నాన్నగారు నన్ను క్షమించండి, నేను ఈ గాజు పాత్రను పగులగొట్టాను. కనుకనే, నా మీద కోప పడకండి' అని చెప్పాడు. వెంటనే, ఆ తండ్రి మోకరించి ఈలాగున చెప్పాడు, ' నా కుమారుడా, నీవు నాతో నిజము చెప్పినందుకు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. నా యొద్ద నీవు ఆ విషయమును దాచిపెట్టలేదు. ఈ గాజు పాత్రకంటె ముఖ్యముగా నువ్వు నాకు ఎంతో ప్రాముఖ్యము అని చెప్పి ఆ కుమారుని హత్తుకున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మన జీవితములో కూడా దేవుడు ఖచ్చితముగా ఇది చేయకూడదు అని చెప్పిన ఏదైన ఒక విషయమును మనము చేసియుండవచ్చును. అయ్యో, ఇందును బట్టి, ప్రభువు నన్ను ఎన్నటికిని క్షమించడు అని అనుకుంటున్నారేమో? ఆయన యొద్దకు తిరిగి వెళ్లడానికి పాత్రులము కాదు అని మీరు తలంచుచున్నారేమో? కాబట్టి, ఆయన దూరముగా ఉండాలని మీరు అనుకుంటున్నారేమో? మా మీద ఆయన కోపముగా ఉంటాడేమో అని అనుకుని, మనలో మనలను దాచుకుంటూ ఉంటాము.
అయితే, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యొద్దకు వెళ్లి మన హృదయములో ఉన్నవాటన్నిటిని చెప్పాలి అని ఆయన మన పట్ల ఆశించుచున్నాడు. ఇంకను మనము చేసిన తప్పులన్నిటిని కూడా ఒప్పుకోవాలి? అని మన పట్ల కోరుచున్నాడు. మనము ఆలాగున చేసి, క్షమించమని ఆయనను కోరినప్పుడు, ఆయన మనలను హత్తుకొని తిరిగి తన యొద్దకు చేరదీసుకుంటా డు. సమాధానమైన సంబంధమును ఆయనతో మనము కలిగియుంటాము. దేవుడు మనలను ఎప్పుడు తిరిగి చేరదీస్తాడు అను విషయమును గుర్తించి, సమాధానమును కలిగియుండండి. ప్రభువు యొద్ద నుండి సమస్తమును దాచిపెట్టడానికి అవసరము లేదు. ఆయన సమస్తమును తెలుసు. కనుకనే, ఆయనను విశ్వసించండి, ఆయన చెప్పినవి చేయండి, అప్పుడు ఆయనతో చక్కని సంబంధమును మనము కలిగియుంటాము. నా ప్రియులారా, ఈ రోజు మీరు ప్రభువును విశ్వసించండి, ఆయన ఎల్లప్పుడు తండ్రిగా మీకు తోడుగా ఉంటాడు. అంతమాత్రమే కాదు, మీరు ఆయనతో సమాధానమును కలిగియుంటారు. ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి, దేవునికి వందనములు చెల్లించండి. మనము విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంకను దేవునితో సమాధానమును కలిగియున్నాము. ఈ అద్భుతమైన వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, ఈ అద్భుతమైన వాగ్దానమునకై నీకు వందనములు. దేవా, మేము విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడియున్నందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము విఫలమైనప్పుడు కూడా మమ్మును ప్రేమించినందుకు నీకు వందనములు. దేవా, నీవు మమ్మును తృణీకరించకుండా కనికరముతో కౌగలిగించు కున్నందుకు నీకు వందనములు. ప్రభువా, మేము నిన్ను ఎల్లప్పుడు విశ్వసించుచున్నాము, కనుకనే, నీ యొద్ద నుండి ఏదియు దాచుకోవలసిన అవసరము లేదు, ఎల్లప్పుడు నిన్ను విశ్వసించే కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పటికిని, మేము ఏమి చేసినప్పటికిని, నీవు ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి, నీ చిత్తమును అనుసరించే కృపను మరియు నీ మాటలకు అనుసారముగా ఉండే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునే కృపనిమ్ము. ప్రభువా, మమ్మును దీవించి, మాకు నీ యొక్క సమాధానమునిచ్చి, నీవు మాకు తోడుగా ఉన్నావని మేము గుర్తెరుగునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మాకు ఎల్లప్పుడూ ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు నీకు వందనములు. ప్రభువా, మా భయం మరియు సిగ్గుతో నీ నుండి దాచుకోవడానికి మేము ప్రయత్నించిన సమయమును బట్టి మమ్మును క్షమించుము. ప్రభువా, నీతితోను మరియు విశ్వాసంతో ధైర్యంగా నీ సన్నిధిలోనికి రావడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క శాంతి మా హృదయమును నింపి, మాలోని ప్రతి అపరాధభావమును తొలగించునట్లుగా చేయుము. దేవా, మేము నీతో సన్నిహితంగా నడవడానికి మరియు నీ స్వరానికి విధేయత చూపడానికి మాకు నేర్పించుము. ప్రభువా, ప్రతిరోజు మేము నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


