నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 41:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు'' ప్రకారము యథార్థత దేవుని యొక్క స్వభావమై యున్నది. యథార్థత అనేది దేవుని స్వభావమే. అంటే దేవుని యెదుట మరియు మనుష్యుల యెదుట యథార్థవంతుడుగాను, సత్యవంతుడుగాను మరియు నిజాయితీపరుడు అని అర్థం. మనం యథార్థతతో నడిచినప్పుడు, ప్రభువు మనలను తన చేతితో పట్టుకుని తన సన్నిధికి దగ్గరగా ఉంచుతాడు. అంధకారముతో నిండియున్న ఈ లోకములో యథార్థత వెలుగువలె ప్రకాశిస్తుంది. కాబట్టి, ఇతరులు మన జీవితాల ద్వారా దేవుని సన్నిధిని అనుభవించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణమైన యథార్థతతో కూడిన జీవితాన్ని గడిపాడు. ఆయన సత్యమునే బోధించాడు, ప్రేమలో నడిచాడు మరియు తండ్రి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మనం కూడా అదే మార్గంలో నడిచినప్పుడు, దేవుడు మన రక్షకుడు మరియు మార్గదర్శిగా ఉంటాడు. యథార్థత అంటే కేవలం మంచి ప్రవర్తన మాత్రమేకాదు; అది మనలోని క్రీస్తు నీతి అను గుణాతిశయము యొక్క ప్రతిబింబముగా ఉంటుంది. కనుకనే, మనము యథార్థతగా నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనలను ఉన్నతంగా లేవనెత్తుతాడు.
ఆలాగుననే, బైబిల్ నుండి సామెతలు 20:7వ వచనములో ఇలాగున చెబుతుంది, " యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు'' అను ఈ వచనమునకు అర్థం యథార్థత మనకు మాత్రమే కాదు, మన భవిష్యత్‌లో మన తరాలకు కూడా వెంబడిస్తాయి. ఒక తండ్రి లేదా తల్లి యథార్థతలోను, నీతిలోను మరియు పవిత్రతలోను నడిచినప్పుడు, ఆ యథార్థత యొక్క ఆశీర్వాదాలు వారి పిల్లలను వెంబడిస్తాయి. ఎవరూ చూడనప్పుడు కూడా యథార్థంగాను, నీతి జీవిస్తూ, తమ మాటను పాటించుచున్న వారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రభువు స్వయంగా యథార్థ గుణాతిశయముగల దేవుడు. ఆయన తన మాటను ఎప్పుడూ మార్చడు, తాను మాట తప్పని దేవుడు. ఆయన తన వాగ్దానాన్ని ఉల్లంఘించడు. మనం ఆయనను విడిచి దూరంగా వెళ్లి, ఒంటరి ఉన్నప్పుడును, విఫలమైనప్పుడు కూడా ఆయన మనలను ప్రేమిస్తాడు మరియు మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సహాయం చేయడానికి నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే, ఆయన నమ్మదగినవాడు. కనుకనే, మన జీవితాలలో ఈ గుణాన్ని ప్రతిబింబించినప్పుడు, మన మాట 'అవును' అంటే 'అవును' అని మరియు మన మాట 'కాదు' అంటే 'కాదు' అని అర్థం అయినప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసనను వెదజల్లువారముగా ఉంటాము.
నా ప్రియ స్నేహితులారా, యథార్థత యొక్క ఆశీర్వాదాలు శక్తివంతమైనవి. సామెతలు 11:3 ఇలా చెబుతుంది, "కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును'' ప్రకారము మనం యథార్థంగా నడిచినప్పుడు, దేవుడే మన నిర్ణయాలను నడిపిస్తాడు మరియు ప్రమాదం నుండి మనలను కాపాడి సంరక్షిస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 3:16వ వచనములో మనకు ఈలాగు తెలియజేయుచున్నది, "అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్‌ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు'' ప్రకారము సత్‌ప్రవర్తనగల మనస్సాక్షితో నడిచే వారు ఘనపరచబడతారు మరియు వారిపై తప్పుగా నిందలు వేయువారు సిగ్గుపడతారు. బైబిల్‌లో యూదా ఇస్కారియోతు, యేసును అప్పగించినప్పుడు కూడా, అతనిలో యథార్థత లేకపోవడం వలన అతనికి తీవ్ర అవమానాన్ని కలిగించినది. కానీ, యథార్థతతో నడిచేవారు స్థిరంగా మరియు బలంగా నిలబడతారు. అలాంటి వారు ఎలా ఉంటారని మనము ఫిలిప్పీయులకు 4:8 వ వచనములో మనకు గుర్తు చేయుచున్నది. ఆ వచనములో, " మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి'' ప్రకారము యథార్థంగాను, సత్‌ప్రవర్తన తోను, పవిత్రంగాను, మనోహరమైన మరియు ఖ్యాతిగలవాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారని మనకు గుర్తు చేయుచున్నది. అయితే, నా ప్రియులారా, దేవుడు మనలో, సత్‌ప్రవర్తన మరియు యథార్ధమైన మనస్సాక్షి కలిగి ఉండాలని, నీతి మరియు పవిత్రతతో ప్రకాశించాలని మన పట్ల కోరుకుంటున్నాడు. మన గృహములు, పిల్లలు మరియు భవిష్యత్తు ఆయన ఆశీర్వాదాలతో నిండి ఉండేలా, ఆయన యథార్థతతో మనలను నింపమని దేవుని అడుగుదాం. ఆలాగున ఉండుటకు నేడు మన హృదయాలను మరియు జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు పరిపూర్ణమైన యథార్థత కలిగిన దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యెదుట మరియు మనుష్యుల యెదుట యథార్థంగాను మరియు నిర్దోషులముగాను నడుచుకొనుటకు మాకు సహాయం చేయుము. దేవా, మా మాటలు సత్యంగాను, మా క్రియలు పవిత్రంగాను మరియు హృదయం యథార్ధంగాను ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితం నుండి ప్రతి అబద్ధం, గర్వం మరియు మోసాన్ని తొలగించుము. యేసయ్యా, నీ ఆత్మ మమ్మును నీతి మార్గంలో నడిపించునట్లుగా కృపను మాకు దయచేయుము. దేవా, మా కుటుంబాన్ని మరియు మా పిల్లలను యథార్థతగల హృదయములో ప్రకాశించునట్లుగాను మరియు ఫలించునట్లుగాను మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, ప్రతి అవమానము నుండి మమ్మల్ని రక్షించుము మరియు అందరి యెదుట ఘనతగా జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితాలు ప్రతిరోజూ క్రీస్తు సత్యాన్ని మరియు ప్రేమను ప్రతిబింబించునట్లుగాను మాకు అటువంటి హృదయమును దయచేయుము. యేసయ్యా, నీ వంటి స్వభావమును కలిగి మేము జీవించునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మేము ఎప్పటికి మీ సన్నిధిచేత నడిపించబడునట్లుగాను, డతాము, సమర్థించబడునట్లుగాను మరియు ఆశీర్వదింపబడునట్లుగాను మమ్మును మార్చుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


