నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున మీకందరికి శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 4:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయ చేసెను'' అని చెప్పబడినట్లుగానే, నేడు దేవుడు మీరు చేయుచున్న మనవులను ఆలకించి, మీరు ఏమైతే మనవి చేసియున్నారో వాటన్నిటిని దేవుడు మీకు నేడు దయచేస్తాడు. నా ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన వచనము ఉన్నది. అదేమనగా, "ప్రభువును అడగండి, ఆయనను మీరు ఏది అడిగినను, ఆయన మీకు అనుగ్రహిస్తాడు'' అని వ్రాయబడియున్నట్లుగానే, మీరు ప్రభువును అడగండి, మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు.

బైబిల్ గ్రంథములో, మనము యబ్బేజు దేవునికి మొఱ్ఱపెట్టి, ఇక్కడ ఎన్నో విషయాలను అడిగినట్లుగా చూడగలము. యబ్బేజు, 'తండ్రీ, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించెను. ' ఇవన్నియు కూడా అతని యొక్క ప్రార్థనా మనవులు. అదేవిధముగానే, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా మీ హృదయములో ఉన్నదంతయు ప్రభువు యొద్ద కుమ్మరించవచ్చును, మీరు ఆయనతో మాట్లాడవచ్చును. మీరు ఆయనతో నడవవచ్చును. యబ్బేజు ప్రార్థించిన రీతిగానే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి అత్యధికముగా ఇచ్చి, అతని యొక్క సరిహద్దులను విశాలపరచెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 121:7 వచనమును చదివినట్లయితే, "ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును'' అని చెప్పబడినట్లుగానే, మీరు యబ్బేజువలె ప్రార్థించినప్పుడు, ఆయన మీకు ఎటువంటి అపాయము రాకుండా మిమ్మును మరియు మీ ప్రాణమును కాపాడును. నా ప్రియ స్నేహితులారా, ఈ లోకము కీడుతోను, చెడుతోను నిండియున్నది. ఈ భువిపైన ఎవ్వరిని కూడా మనము నమ్మలేము. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనకాల ఇంకొకలాగున మాట్లాడే ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. ఇది దుష్టత్వముతో నిండియున్నటువంటి లోకము. అయితే, మీరు యబ్బేజు వలె దేవునితో అన్యోన్యసహవాసము కలిగియుండడము నేర్చుకున్నప్పుడు నిశ్చయముగా, మీ సరిహద్దులు విశాలపరచబడతాయి.

నా ప్రియులారా, తండ్రి వైపు మనము ఎలా చూడాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఆయన ఆశీర్వాదములను ఎలా పొందుకోవాలనియు యేసయ్యా మనకు స్వయంగా నేర్పించియున్నాడు. నా స్నేహితులారా, దేవుని వాక్యమును తరచుగా చదివే అలవాటు మీకు ఉన్నదా? ప్రభువు వైపు ప్రార్థన ద్వారా చూచే అలవాటు మీకున్నదా? మీరు ఆ విధంగా, చేసినప్పుడు యబ్బేజు వలె మీరు కూడా ఆశీర్వదింపబడతారు. బైబిల్‌లో, కీర్తనాకారుడైన దావీదు యథార్థముగా ప్రభువును వెదకువాడుగా ఉండియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 63:1వ వచనములో మనము చూచినట్లయితే, "దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును'' అని చెప్పబడినట్లుగానే, దావీదు ఉదయకాలమున మరియు అనేకసార్లు అతడు ప్రభువును వెదకియున్నాడు అని వ్రాయబడియున్నది. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 55:17వ వచనములో చూచినట్లయితే, "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును'' అని చెప్పబడినట్లుగానే, అతడు ఎల్లవేళల ప్రభువును వెదకియున్నాడు. ఆలాగుననే, మీరు కూడా ప్రభువును ఎల్లవేళల వెదకండి.

నా జీవితములో కూడా, నేను ఎన్నో కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, నేను ఎంతో యథార్థముగా ప్రభువును వెదకియున్నాను. అంతమాత్రమే కాదు, యబ్బేజు వలె దేవునితో అన్యోన్యసహవాసమును కలిగియుండుటకు నేర్చుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా నన్నును మరియు నా కుటుంబమును దీవించియున్నాడు. ఆలాగుననే, నా యొక్క సరిహద్దులను విశాలపరచియున్నాడు. అవును, నా ప్రియులారా, నేడు మీరు కూడా యబ్బేజువలె దేవునితో అన్యోన్యసహవాసము కలిగియుండడము నేర్చుకున్నప్పుడు అద్భుత రీతిగా, మీరు కూడా యబ్బేజువలె దీవించబడతారు. కనుకనే, మీ సరిహద్దులు విశాలపరచబడునట్లుగా, ఇప్పుడే మీరు కూడా యబ్బేజు వలె ప్రార్థించి, దీవెనలు పొందుకొనండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమును బట్టి, నీకు వందనములు. దేవా, నీ యొక్క ప్రభావముతో నీవు మా యొద్దకు దిగివచ్చునట్లుగానే, యబ్బేజు నీవైపు చూచి, ప్రార్థించి, ఆశీర్వాదమును పొందుకున్నట్లుగానే, మేము కూడా నీ వైపు చూచి, ప్రార్థించి, నీ యొద్ద ఆశీర్వాదములను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా సమస్యలన్నిటిని తొలగించి వేయబడునట్లుగా, మేము యథార్ధముగా ప్రార్థించునట్లుగా, మా మీద నీ హస్తము దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి నీవు మమ్మును విడిపించుము. యేసయ్యా, నీ సమాధానమును మాకు ఇచ్చి, నేడే మా సరిహద్దులను విశాలపరచుము. దేవా, అత్యధికమైన ఆశీర్వాదములను మేము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, దావీదు వలె ఎల్లవేళల మేము ప్రార్థించునట్లుగా మాకు నీకృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను తీసివేసి, మా మీద నీ యొక్క బలమైన హస్తమును ఉంచండి. ప్రభువా, ప్రతి కష్టము, భయము మరియు ఇబ్బంది నుండి మమ్మును విడిపించుము. దేవా, నీ వాక్యము నీ యొక్క శాంతిని మరియు సమృద్ధియైన ఆశీర్వాదలను అనుభవించునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్యమును చదవడానికి, నిన్ను శ్రద్ధగా వెదకడానికి మరియు ప్రతిరోజు నీతో సన్నిహితంగా నడవడానికి సహాయము చేయుము. దేవా, మా సమస్త కీడుల నుండి కాపాడి, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మమ్మును నడిపించుమని యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.