నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 54:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు...'' ప్రకారం మీరు వృద్ధి చెంది ప్రతి ఆశీర్వాదమును పొందుకోవాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అనేక ఫర్యాయములు బంధించబడియున్నట్లుగాను మరియు ఆశీర్వాదములలో వృద్ధిపొందలేకపోవుచున్నట్లుగాను మనము గమనించగలము. అయితే, బైబిల్ నుండి కీర్తనలు 116:16వ వచనములో చూచినట్లయితే, కీర్తనాకారుడు ఈలాగున మొఱ్ఱపెట్టుచున్నాడు, "యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై యున్నాను, నీవు నాకట్లు విప్పియున్నావు'' ప్రకారము ఈ లోకములో అనేక సంకెళ్లు మనలను బంధించివేస్తాయి. అవి, పాపపు సంకెళ్లు, రోగమను సంకెళ్లు, అపవాది యొక్క అణిచివేత సంకెళ్లు, దుష్టప్రజల యొక్క సంకెళ్లు, నష్టములను, అపజయములను, బలహీనతలు అను సంకెళ్లతో మనము బంధింపబడినప్పటికిని, దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " నీవు నా సేవకునికి, నీ సంకెళ్ల నుండి నేను నిన్ను విడిపించెదను'' అని చెబుతున్నాడు. ఆయన మన సంకెళ్లను బ్రద్ధలు చేయుటకు సమర్థుడై యున్నాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి. నేడు మీ సంకెళ్లు ఏవైనప్పటికిని, మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన బాహుబలము మీ మీదికి వచ్చినప్పుడు, మీ యొక్క ప్రతి సంకెళ్లు బ్రద్ధలు చేయబడతాయి మరియు ఆశీర్వాదపు ద్వారములు మీ కొరకు తెరవబడతాయి.
బైబిల్ నుండి యిర్మీయా 30:18-20వ వచనములలో మనము చూచినట్లయితే, "యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను. వారి కుమారులు మునుపటివలె నుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారినందరిని శిక్షించెదను'' అని వాక్యము తెలియజేయుచున్నది. నేడు ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమై యున్నది. దేవుడు ఈలాగున మీ కొరకు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇందుకొరకై బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 7:13వ వచనములో చూచినట్లయితే, " ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును'' అని ప్రభువు సెలవిచ్చుచున్న ప్రకారముగానే, ఆయన మిమ్మును ప్రేమించి, మిమ్మును దీవించి, విస్తరింపజేస్తాడు. ఎందుకంటే, మీరు ఆయనను ప్రేమించుచున్నారు, గనుకనే, ఆయన మిమ్మును ఉన్నతముగా హెచ్చించును. తద్వారా, మీరు ఆయనను ప్రేమించి, ఆయన నామాన్ని ఘనపరచుట ద్వారా ఆయన మీ యొక్క ప్రతి బంధకాల నుండి మిమ్మును పైకి లేవనెత్తుతాడు. కనుకనే, మీరు భయపడకండి.
కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు మీరు మీ జీవితములో చూచుచున్న కార్యములను బట్టి నిరుత్సాహపడకండి. దేవుడు పునరుద్ధరణ, వృద్ధిపొందించుట మరియు విస్తరింపజేయు దేవుడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కుడి మరియు ఎడమ వైపుకు విస్తరించునట్లుగా చేస్తాడు. మిమ్మల్ని వెనుకకు లాగుతున్న ప్రతి సంకెళ్లను ఆయన బ్రద్ధలు చేస్తాడు మరియు మీ కుటుంబం, భవిష్యత్తు, పరిచర్య మరియు ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని వృద్ధిపొందింపజేస్తాడు. కనుకనే, ఆయన వాక్యాన్ని నమ్మండి మరియు విశ్వాసంతో ప్రార్థించండి, ఎందుకంటే, ప్రభువు తన వాగ్దానాలను నెరవేర్చడానికి నమ్మదగినవాడై యున్నాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును విస్తరించి, వృద్ధి పొందింపజేసి, దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా పట్ల నీకున్న ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మమ్మును ప్రేమించి, మా జీవితములో మమ్మును ఆశీర్వదించి, వృద్ధి చేస్తానని నీవు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. ప్రభువా, మా పాపపు సంకెళ్లు, రోగమను సంకెళ్లు, అపవాది యొక్క అణిచివేత సంకెళ్లు, దుష్టప్రజల యొక్క సంకెళ్లు, నష్టములను, అపజయములను, బలహీనతలు అను సంకెళ్లతో మేము బంధించబడియున్నాము. కానీ, మా యొక్క ప్రతి బంధన సంకెళ్లను తెంచి, మమ్మును విడిపించుము. దేవా, నీ యొక్క అనుగ్రహంతో మమ్మును కుడి మరియు ఎడమ వైపుకు విస్తరించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని మరియు మా భవిష్యత్తును ఒక రాజభవనంలా పునరుద్ధరించుము. దేవా, మమ్మును నీ యొక్క ప్రేమ యందు స్థిరపరచుము మరియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లుగా, నీ యొక్క కృతజ్ఞతాస్తుతులతో మా ఇంటిని నింపుము. ప్రభువా, మేము సరియైన మార్గములో నడుచునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము అన్ని వైపుల వర్థిల్లునట్లుగా నీ యొక్క దీవెనలతో మమ్మును మరియు మా కుటుంబమును మరియు మేము కలిగియున్న యావత్తు నింపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.