నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 36:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " ...పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను...'' అని సెలవిచ్చినట్లుగానే, ప్రభువు కోరిక మిమ్మల్ని రక్షించడమే కాదు, మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ మిమ్మల్ని ఆశీర్వదించడమే. ఆయన 3 యోహాను 2వ వచనములో ఇలాగున అంటున్నాడు," ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను'' ప్రకారం దేవుడు మిమ్మును వర్థిలింపజేయు దేవుడు. మీ ఆత్మ పరిశుద్ధతలో వర్ధిల్లాలని, మీ శరీరం ఆరోగ్యంతో వర్ధిల్లాలని మరియు మీ జీవితం సమృద్ధిగా వర్ధిల్లాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. నా ప్రియులారా, మీరు పాపం నుండి వేరుచేయబడి, యథార్థంగా నడిచినప్పుడు, మీ జీవితం ఆయన మేలులతో పొంగిపొర్లుతుంది. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 1:1-3వ వచనములలో ఈలాగున చెప్పబడియున్నది, "దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును'' ప్రకారం దేవుడు మీరు తగినకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మిమ్మును వర్థిల్లజేసి, మీరు చేయునదంతయు సఫలపరచును గాక.
ఇంకను బైబిల్ నుండి ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపు జీవితాన్ని చూడండి. అతను శోధనలను ఎదిరించి, దేవునికి నమ్మకంగా ఉండెను. అతని పరిశుద్ధత కారణంగా, ప్రభువు అతనిని మూడు విధాలుగా వర్ధిల్లజేశాడు: మొదటిది, ఆదికాండము 39:2వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను'' ప్రకారము దేవుడు యోసేపునకు తోడై యుండినందున అతడు వర్థిల్లెను. రెండవది, ఆదికాండము 39:4వ వచనంలో చూచినట్లయితే, "యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి కప్పగించెను '' ప్రకారం యోసేపు తన యజమాని దృష్టిలో అనుగ్రహం పొందాడు మరియు అతను కోరుకున్నదంతా అతనికి లభించింది. మూడవదిగా, ఆదికాండము 39:5వ వచనంలో చూచినట్లయితే, "అతడు తన యింటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణ కర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము యింటిలో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను '' ప్రకారం యోసేపు నిమిత్తం దేవుడు తన యజమాని ఇంటిని కూడా ఆశీర్వదించాడని చెప్పబడియున్నది. అదేవిధంగా, నా ప్రియులారా, నేడు మీరు కూడా యోసేపు వలె దేవుని ఘనపరచినప్పుడు, మీ చదువులు, వృత్తి మరియు కుటుంబం ఆశీర్వదించబడతాయి. మీ పదోన్నతి సరైన సమయంలో మీకు వస్తుంది. మీ కుటుంబం శాంతిసమాధానమును అనుభవిస్తుంది. ఇంకను నా ప్రియులారా, దేవునితో మీరు నమ్మకంగా నడవడం ద్వారా, మీ సహవాసం లేదా పరిచర్య వృద్ధి చెందుతుంది. ఇది పరిశుద్ధత, జ్ఞానం మరియు దేవుని అనుగ్రహం నుండి ప్రవహించే వర్థిల్లతయై యున్నది.
నా ప్రియులారా, ఈ ఆశీర్వాదంలో మనం ఎలా కొనసాగగలం? జవాబు చాలా సులభం: బైబిల్ నుండి కీర్తనలు 1:2వ వచనమును చూచినట్లయితే, " యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' ప్రకారము మీరు దేవుని వాక్యంలో అనుదినము ఆనందించుచూ మరియు ప్రతిరోజు దానిని మరువకుండా ధ్యానించినప్పుడు ఆయన వాక్యం మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది మరియు విజయం సాధించడానికి మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే, మీ దశమభాగాలు, కానుకలు మరియు ధారాళంగా ఇవ్వడం ద్వారా దేవుని రాజ్యంలోకి విత్తండి. అది మీ జీవితములో మిమ్మును విస్తరించునట్లుగా చేయును. కనుకనే, ప్రియులారా, బైబిల్ నుండి ఆదికాండము 26:12-13వ వచనములో ఇలాగున చెబుతుంది: " ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను'' ప్రకారము ఇస్సాకు ఆ దేశములో విత్తనమును విత్తాడు, దేవుడు అతనిని నూరురెట్లు ఆశీర్వదించాడు. చివరగా, బైబిల్ నుండి సామెతలు 16:3వ వచనమును చూచినట్లయితే, "నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును'' ప్రకారం మీ యొక్క ఉద్దేశములన్నిటిని ప్రభువుకు అప్పగించినప్పుడు, అవన్నియు దేవుడు మీ పట్ల సఫలపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీ భారాలను మీ తల మీద మోయకండి, కానీ ఆయన ప్రేమను నమ్మండి. మీరు విధేయత, విశ్వాసం మరియు దాతృత్వంతో నడుచుకున్నట్లయితే, మీరు మునుపటి కంటే అధికమైన మేలులను పొందుకొని, మీరు మీ జీవితములో వర్థిల్లుతారు. కనునకే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఈ నూతన మాసమంతయు దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము గల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును వర్థిల్లజేస్తానని నీవు ఇచ్చిన వాగ్దానానికై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మా ఆత్మను పరిశుద్ధతతోను మరియు సమాధానముతోను వర్ధిల్లింపజేయుము. దేవా, మా శరీరాన్ని బలం మరియు మంచి ఆరోగ్యంతో వృద్ధిపొందింపజేయుము. యేసయ్యా, మా కుటుంబాన్ని ఐక్యత మరియు ఆనందంతో వర్ధిల్లింపజేయుము. ప్రభువా, మా చదువులు, వృత్తి మరియు పరిచర్యను వర్ధిల్లజేయుము. దేవా, ఇస్సాకు వలె మా చేతుల కష్టార్జితమునకు తగిన ప్రతిఫలమును నూరంతలుగా దయచేయుము. యేసయ్యా, ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించుము. దేవా, నీ రాజ్యంలో నమ్మకంగా విత్తడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ఉద్దేశములు మరియు మా భారాలన్నింటిని నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, మా పనుల భారము నీ మీద నుంచుచున్నాము, కనుకనే, మా ఉద్దేశములు సఫలమగునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.