నా ప్రియులారా, ప్రభువు మిమ్మును విమోచించి తన సొత్తైన ప్రజలుగా కాపాడియున్నాడు. ఆయన మిమ్మును అపవాది చేతిలో నుండియు, పాపములో నుండియు, దుష్టులైన మోసగాళ్ళలో నుండియు విమోచించెను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:1వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు '' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మిమ్మును తన సొత్తుగా పిలిచియున్నాడు. చూడండి, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! మీ హృదయమును కలవరపడనీయ్యకండి. అందుకే ప్రభువు ఇలాగున అంటున్నాడు: " నీవు నా బిడ్డవు. నేను నిన్ను విమోచించియున్నాను. నీవు నాకు చెందినవాడవు (నా దానవు). నిన్ను ఎవరి చేతిలోనూ లేదా ఏ సమస్య చేతిలోనూ నేను విడిచిపెట్టను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను, నిన్ను నా సొత్తుగా ఉంచుకొనియున్నాను, ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూచుకుంటాను'' అని సెలవిచ్చుచున్నాడు.
నా ప్రియులారా, ఈ రోజు, ప్రభువు మీకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించబోవుచున్నాడని మీరు విశ్వసించి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి మరియు ఆయన ఆశీర్వాదమును అనుభవించండి. ప్రభువు ద్వారా విమోచించబడుట అనగా ఏమిటి? అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:7వ వచనములో చూచినట్లయితే, " దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధము లకు క్షమాపణ మనకు కలిగియున్నది'' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనము విమోచించబడియున్నాము. అవును, నా ప్రియులారా, మనము పాపములో జీవించినట్లయితే, అపవాది ప్రభావనమునకు లోనవుతాము. కానీ ప్రభువు మనలను పాపము నుండి విడిపించి, తన బిడ్డలుగా మారుస్తాడు. పాపము ఎరుగని యేసు మన కోసం సిలువపై తనను తాను అప్పగించుకొనియున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము మనలను సమస్త పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేస్తాడు.
నా ప్రియులారా, కనుకనే, మనము యేసు ప్రభువునకు లోబడి, "ప్రభువా, నీ రక్తంతో మా పాపములను కడుగుము. మా ఆలోచనలను, క్రియలను కడిగి పవిత్రపరచుము. మా పాపపు అలవాట్లను మా నుండి తొలగించుము'' అని ప్రార్థించినప్పుడు, ఆయన మనలను తన రక్తము ద్వారా కడిగి రూపాంతరపరుస్తాడు. పాపము యొక్క ప్రభావము మరియు స్వభావము కూడా అదృశ్యమవుతాయి మరియు యేసు యొక్క స్వరూపము, స్వభావము మరియు పరిశుద్ధత మన జీవితములను నింపడము ప్రారంభిస్తాయి. అయితే, మన శరీరములు దేవునికి ఆలయంగా మార్చబడతాయి మరియు మన జీవితములు రూపాంతరపరచబడతాయి. కనుకనే, "మీరు నోరు తెరచి ఇలాగున చెప్పండి: " ప్రభువా, మమ్మును విమోచించుము. నీ బిడ్డగా మమ్మును విమోచించుము. నీ సొత్తుగా మమ్మును విమోచించుము. అడుగు ప్రతి వారు కూడా పొందుకుంటారు. యేసు నామములో అడగండి. ఆయన మిమ్మును విమోచించి, తన బిడ్డగా మారుస్తాడు.
విమోచనము ద్వారా మనము పొందబోయే ఆశీర్వాదములు: మొట్టమొదటగా, మీరు శాపం నుండి విమోచించబడ్డారు: మనము అపవాది మరియు పాపము యొక్క ప్రభావములో జీవించినప్పుడు, అది మన జీవితములలోనికి శాపమును తీసుకొని వస్తుంది. డబ్బు, కోరికలు, శరీరేచ్ఛ మరియు ఇతర పాపపు విషయాలు శాపములుగా మారవచ్చును. కానీ, ప్రభువు తన పిల్లలను శాపము నుండి విమోచిస్తాడు. ఇందును గురించి మనము బైబిల్ నుండి గలతీయులకు 3:13వ వచనములో చదవగలము. ఆ వచనము, " ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను'' అని చెప్పబడినట్లుగానే, క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విడిపించియున్నాడు.
రెండవదిగా, ప్రభువు మీకు జ్ఞానమును, నీతిని మరియు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు: అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 1:30-31వ వచనములలో చూచినట్లయితే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను'' అని చెప్పబడినట్లుగానే, కీస్తు మనకు జ్ఞానముగాను, నీతిగా, పరిశుద్ధతగా మరియు విమోచనముగా ఉన్నాడు. మరణమునకు దారితీసిన మార్గములలో జీవించడానికి బదులుగా, ప్రభువు యొక్క విమోచన ద్వారా మనము జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను మరియు నిరీక్షణను పొందుకుంటాము.
మూడవదిగా, ప్రభువు మిమ్మును బాధ మరియు శ్రమల నుండి విడిపించుచున్నాడు: తన ప్రాణాన్ని సమస్త శ్రమల నుండి ప్రభువు విడిపించాడని దావీదు ప్రకటించిన విషయమును మనము 1 రాజులు 1:29-30వ వచనములలో చదవగలము. ఆ వచనములు, " అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చు దునని చెప్పగా'' అని చెప్పబడినట్లుగానే, సకలమైన ఉపద్రవములలో నుండి మనలను దేవుడు విడిపిస్తాడు. అదేవిధంగా, ప్రభువు మిమ్మల్ని శ్రమలకు దూరంగా ఉంచి, విడిపించగలడు. మీకు వ్యతిరేకంగా అన్యాయమైన లేదా దోషారోపణ క్రియలు జరిగినప్పుడు కూడా, ఆయన తన విమోచన ద్వారా మిమ్మును రక్షించి కాపాడగలడు.
నాలుగవదిగా, మీరు పరలోకమునకు చేరుకునేలా ఆయన మిమ్మును తాను విమోచించబడిన బిడ్డగా మారుస్తాడు: మనము యోబును చూడగలము. అందుకే బైబిల్ నుండి యోబు 19:25-27వ వచనములలో చూచినట్లయితే, "అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి'' అన్న వచనముల ప్రకారము తన విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయనను తానే స్వయంగా తన కళ్లతో చూచెదనని యోబు ప్రకటించియున్నాడు.
నా ప్రియులారా, ప్రభువు నేడు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించి, మీరు పరలోకమునకు చేరునంతవరకు మిమ్మును ఆయన విమోచించబడిన బిడ్డలుగా మీరు కాపాడబడుదురు గాక. కాబట్టి, యేసు బిడ్డలుగా సంతోషంతో జీవించండి. పరిశుద్ధతలో జీవించండి, జ్ఞానము మరియు మహిమతో నింపబడండి, శాపముల నుండి విడుదల పొందండి మరియు పరలోక నిరీక్షణతో జీవించండి. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యొక్క విమోచన ఆశీర్వాదము మీద కుమ్మరించును గాక. ఒకవేళ, మా కుటుంబ జీవితములోను మరియు మా వ్యక్తిగత జీవితములో ఎన్నో శాపములను ఎదుర్కొంటున్నాము, మా పాపములు మమ్మును వెంబడించుచున్నవని తలంచుచుండవచ్చును. అయితే, ఇప్పుడే మీ జీవితములను ఆయన చేతులకు అప్పగించినప్పుడు, నిశ్చయముగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు కడగబడి పవిత్రపరచబడతారు. కనుకనే, నేడు ఆయన ఇచ్చు ధన్యతను అనుభవించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మును విమోచించి, నీ సొంత బిడ్డగా పేరు పెట్టి పిలిచినందుకు నీకు వందనములు. దేవా, మా యొక్క పాపము, శాపములు, పాపపు అలవాట్లు, దురాశలు, తప్పుడు సంబంధములు, శ్రమ మరియు ప్రతి వేదన నుండి మమ్మును విమోచించుము. ప్రభువా, మా తలంపులను, క్రియలను కడిగి పరిశుద్ధపరచి, మమ్మును పవిత్రపరచి, నీ పరిశుద్ధ ఆలయముగా మమ్మును మార్చుము. దేవా, నీ యొక్క జ్ఞానము, నీతి, పరిశుద్ధతతోను మరియు పరలోక నిరీక్షణతోను మమ్మును నింపుము. యేసయ్యా, మమ్మును ప్రతి కీడు నుండి మరియు ప్రతి దుష్టక్రియల నుండి మమ్మును కాపాడుము. దేవా, మా కుటుంబమును విమోచించి, నీ మహిమ కొరకు మేము వర్ధిల్లునట్లుగా చేయుము. యేసయ్యా, నీకు విమోచించబడిన బిడ్డలుగా మేము జీవించి పరలోకమును చేరుకోవడానికి మాకు సహాయము చేయుము. దేవా, ఈ రోజు నీ ఆశీర్వాదము, మంచితనము, సమృద్ధి మరియు కృప మా మీద నిలిచియుండునట్లుగా చేసి, మా జీవితాలలో విడుదలను అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


