నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 6:8వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు'' అన్న వచనము ప్రకారము ప్రతి ఒక్కరూ చేయు ఏ మంచి పనికైనా ప్రభువు వారికి ప్రతిఫలమిస్తాడు. ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని ఆయన సేవ చేయడానికి పిలుచుచున్నాడు. ఇది ఒక గొప్ప కృప. మనకు లౌకిక కార్యములు మరియు కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికిని, వాటితో కూడా ఆయనను సేవించమని మరియు ఆయనకు పరిచర్య చేయవలెనని ప్రభువు మనలను పిలుచుచున్నాడు. అందుకే బైబిల్‌లో, "కోత విస్తారము కానీ, పనివారు కొద్దిమంది '' అని చెప్పబడినట్లుగానే, దేవుని సేవ విస్తారముగా ఉన్నప్పటికిని, పనివారు ఎంతో తక్కువ మందిగా ఉన్నారు. యేసు ప్రజలకు జీవమును అనుగ్రహించడానికి తన ప్రాణమును అర్పించి, ఆయన మూడవ దినమున తిరిగి లేచియున్నాడు. మరియు ఆయన పొందిన గాయములను అలాగే ఉన్నప్పటికిని, ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన ప్రజలకు ఆశీర్వాదములను అనుగ్రహించాలని కోరుకున్నాడు. ఆయన, ' నాకు నీవు కావాలి' అని అంటున్నాడు. అవును, నా ప్రియులారా, యేసు అనుగ్రహించిన ప్రేమను గురించి ప్రజలకు తెలియజేయడానికి మరియు అవసరంలో ఉన్నవారికి నిరీక్షణను కలిగించడానికి మనము పిలువబడియున్నాము.

నా ప్రియులారా, ప్రభువుకు సేవ చేయడము అనగా, యేసు ప్రేమను గురించి ప్రజలకు తెలియజేయడము మాత్రమే. కనుకనే, కష్టాలలో ఉన్నవారికి, యేసు వారిని ప్రేమించుచున్నాడనియు మరియు వారు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదనియు మనము చెప్పగలము. వారు ఆయనను అడిగినప్పుడు ఆయన వారికి సహాయము చేస్తాడు. ఇంటి నుండి పారిపోవలెననియు లేదా తమ భర్తలను విడిచిపెట్టవలెనని శోధనకు లోనయ్యేవారిని, భయముతో జీవించకుండా, యేసు, 'అటువంటి వారిని తన యొద్దకు రమ్మని' మనలను ప్రోత్సహించుచున్నాడు. అందుకే ఆయన ఇలాగున అంటున్నాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని చెప్పబడినట్లుగానే, మీ భారములను మీరు మోయకుండా, మీ భారములన్నిటిని ఆయన మీద మోపినప్పుడు, నిశ్చయముగా మీకు విశ్రాంతి కలుగుతుంది.

నా ప్రియులారా, ఇతరులకు సేవాపరిచర్య చేయడం మరియు వారికి ఆయనను గురించి తెలియజేయడము. తద్వారా, మనమందరము కలిసి సేవా పరిచర్యలో ప్రభువు బిడ్డలుగా మార్చబడుచున్నాము. కష్టాలలో ఉన్నవారు, సంతానము లేనివారు మరియు వృద్ధాప్యములో ఒంటరిగా విడిచిపెట్టబడిన వారివంటివారు మరియు ఎంతో మంది అవసరతలో ఉన్నవారికి మనము సహాయమందించుటకు మనము వారి యొద్దకు వెళ్లి, వారికి సహాయము చేసినప్పుడు, ఇంకను యేసు ప్రేమను గురించి వారికి తెలియజేయుచూ, వారికి నిరీక్షణను అందించగలము. వారిని ప్రేమించువారు ఒకరు ఉన్నారని వారికి నిరూపించగలము. మరియు వారికి కూడా నిరీక్షణ ఉందని మనము నిజముగా చెప్పగలము. ఆలాగుననే, ప్రజలను ప్రేమించడానికి మరియు వారిని ఆయన వైపు నడిపించడానికి యేసు పిలుచుచున్నాడు పరిచర్య కూడా ఇక్కడ ఉన్నది. కనుకనే, మీరు ఇక్కడకు వచ్చి, అనేకులకు సేవలను అందించవచ్చును. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియ స్నేహితులారా, మనము ఇతరులకు సేవ చేయడానికి మరియు వారికి ఆశీర్వాదాలు చేకూర్చడానికి మనము సమయమును వెచ్చించినప్పుడు, ప్రభువు మన జీవితములోని కార్యములన్నిటిని ఆయనే జాగ్రత్త వహిస్తాడు. అంతమాత్రమే కాదు, యేసు నామమున మనము ఇతరులకు సేవ చేయుచూ, వారికి సహాయపడినప్పుడు, ప్రభువు మన సేవకు తగిన ప్రతిఫలమును మనకు దయచేస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 2:6వ వచనములో చూచినట్లయితే, "ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ప్రతి ఒక్కరికి వారి క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 3:23-24వ వచనములలో, " ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు'' అని చెప్పబడినట్లుగా, ప్రభువు స్వాస్థ్యమనే ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు మరియు ఆయన బిడ్డలుగా సమస్తమును స్వతంత్రించుకునే మార్గమును మనకు కల్పించుచున్నాడు.

రెండవదిగా, ప్రభువు మనకు జీవకిరీటమును పొందుకొనునట్లుగా కృపను చూపుతాడు. అందుకే బైబిల్ నుండి యాకోబు 1:12వ వచనము చూచినట్లయితే, "శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును'' అని చెప్పబడినట్లుగానే, కనుకనే, శోధనను సహించి, శోధనకు నిలిచినవారు ధన్యులుగా పిలువబడుచున్నారు. అలాంటి వారికి, అనగా, తనను ప్రేమించువారికి ప్రభువు వాగ్దానము చేసినట్లుగానే, జీవకిరీటము లభిస్తుందని మనకు తెలియజేయుచున్నది. అవును, నా ప్రియులారా, ప్రభువును సేవించడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రజలకు సేవను కొనసాగిస్తూనే, మనము శ్రమలను మరియు కష్టాలను పదేపదే అధిగమించవలెను. మనము ఆ కష్టాలను అధిగమించి, ప్రభువును విశ్వాసంతో సేవించినప్పుడు, ఆయన మనకు జీవకిరీటమును అనుగ్రహిస్తాడు.

మూడవదిగా, సంపద, ఘనత మరియు జీవమును మనకు ఇవ్వబడుచున్నవి. అవును, మనము ప్రభువును సేవించి, దేవుని యందు భయభక్తులతో పరిశుద్ధతమైన జీవితములను జీవితములను జీవించినప్పుడు, ప్రజలు మన జీవితాలను చూసి ప్రభువును వెంబడిస్తారు, అప్పుడు మనము ఆయనను సేవించుచున్నాము అని మనము గుర్తించగలము. అందుకే బైబిల్ నుండి సామెతలు 22:4వ వచనములో చూచినట్లయితే, "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును'' అని చెప్పబడినట్లుగానే, విధేయత మరియు దేవుని యందు భయభక్తులు కలిగియున్నప్పుడు, మనకు సంపద, ఘనత మరియు జీవము ప్రతిఫలముగా వచ్చును. కనుకనే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియుండుటకు నేర్చుకొనండి. ఘనతను పొందుకొనండి.

నాల్గవదిగా, ప్రభువు సేవా పరిచర్య కొరకు మరియు ఆయన నామ మహిమ కొరకు మనము ఇచ్చినప్పుడు, యేసు నామమున దేవుని సేవకులకు సహాయమును అందించినప్పుడు, యేసు నామమున పేదవారిని ఆదరించినప్పుడు, అలాగే ఇతరులకు సహాయము చేయడానికి మరియు వారు ప్రభువుకు ఇష్టమైన జీవితమును గడుపుతూ దేవుని బిడ్డలుగా మార్చబడునట్లుగా, దైవ మార్గములో నడిపించడానికి మనము ధనమును మరియు సమయమును వెచ్చించినప్పుడు, ఇవన్నియు ప్రభువునకు మనము జరిగించు సేవాపరిచర్యగా మారుతాయి. అందుకే బైబిల్ నుండి లూకా 6:38వ వచనములో చూచినట్లయితే, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను '' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని పని కొరకు ఇచ్చినప్పుడు మనకు తిరిగి ఇవ్వబడుతుంది. ప్రజలు మన ఒడిలో నిండు కొలతతో అణచి, కుదిలించి, దిగజారునట్లు పైకి పొర్లునంతగా ఇస్తారని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఆలాగుననే, ప్రభువు మీకు ఆ విధంగానే జరిగిస్తాడు. అప్పుడు ఆశీర్వాదములు అణచి, కుదిలించి, దిగజారునట్లు మీ ఒడిలోసమృద్ధిగా పొంగిపొర్లునంతగా మనకు అనుగ్రహించబడతాయి.

నా ప్రియులారా, చివరిగా, ఆయనను విశ్వాసంతో సేవ చేయువారి మీదికి ఈ ఆశీర్వాదములను కుమ్మరించడానికి ప్రభువు సమర్థుడు. ఆయన సమృద్ధిని, మహిమను, ఘనతను, దైవీకమైన సన్నిధిని మరియు అభివృద్ధిని అనుగ్రహించగలడు. అంతమాత్రమే కాదు, మనము పరలోకమును చేరుకుని, జీవకిరీటాన్ని పొందునట్లుగా శ్రమలలో ఆయన మనలను బలపరస్తాడు. యేసు పవిత్రతను మన జీవితముల ద్వారా ప్రతిబింబించు పరిశుద్ధమైన జీవితములను గడపడానికి మరియు సాక్షులుగా ప్రభువునకు సేవ చేయడానికి ఆయన మనకు అటువంటి కృపను దయచేస్తాడు. కావుననే, నా ప్రియులారా, మనము యథార్ధమైన మరియు పూర్ణ హృదయముతో ప్రభువునకు సేవను చేసినప్పుడు, ప్రభువు మన సేవకు ప్రతిఫలమిస్తాడు, పరలోక మరియు మహిమాన్వితమైన ప్రతిఫలమును మనకు అనుగ్రహిస్తాడు మరియు తనను నమ్మకంగా సేవ చేయువారినందరిని ఆయన అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువైన యేసూ, మేము నీకు సేవ చేయడానికి మమ్మును పిలిచినందుకు నీకు వందనములు. దేవా, కనికరముతో ప్రజలకు సేవ చేయడానికి మరియు నీ ప్రేమను పంచుకోవడానికి మాకు పరిపూర్ణమైన హృదయమును దయచేయుము. ప్రభువా, బాధలలో ఉన్న వారిని, సంతానములేనివారిని, విడిచిపెట్టబడినవారిని మరియు నిరీక్షణ లేనివారిని ప్రోత్సహించడానికి మాకు సహాయం చేయుము. దేవా, కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి నిరీక్షణను కలిగించడానికి మమ్మును నీ సేవలో బలముగా వాడుకొనుము. ప్రభువా, ఇతరుల కొరకు ప్రార్థించడానికి మరియు నీ పరిచర్యకు సహాయము అందించడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధనను అధిగమించడానికి మరియు నీకు సాక్షులుగా పరిశుద్ధమైన జీవితమును గడపడానికి మమ్మును నీ శక్తితో బలపరచుము. యేసయ్యా, మా జీవితములోను, చదువులలోను మరియు పనిలోను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మాకు కావలసిన జ్ఞానము, తెలివి మరియు గ్రహించేశక్తిని అనుగ్రహించుము. దేవా, మా సేవను ఆశీర్వదించి, నీవు చేసిన వాగ్దానము బట్టి, మేము మంచి కార్యములను జరిగించి, దానికి తగిన ప్రతిఫలమును మేము పొందుకొనునట్లుగా, నీ యొక్క మహిమ కొరకు మమ్మును వాడుకొనుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.