నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మన చేయి పట్టుకొని నిరీక్షణతో మనలను నడిపించబోవుచున్నాడు. ఎందుకనగా, ఆయన మీకు ఎంతో సమీపముగా ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 17:8వ వచనములో చూచినట్లయితే, "వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు'' అని చెప్పబడిన ప్రకారముగా, జలముల యొద్ద నాటబడిన చెట్టు అది ఫలించక మానదు. ఆమేన్! ఆ రీతిగానే ప్రభువు మన శరీరమును, మన జీవితమును బలపరుస్తాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంతో నిమ్మళముగా ఉంటుంది. ఎందుకంటే, దానికి సమస్తమును సమకూడి ఉంటాయి. ఆ నీటి ప్రవాహం మధ్యలో ఆ చెట్టు వర్ధిల్లుతూ, ఎంతో అందంగా ఉండడము మీరు చూడగలరు. అందుకే, మనం బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు, మన జీవితాలు కూడా ఎంతో నిమ్మళముగాను, నెమ్మదితో నిండిపోతాయి.

నా ప్రియులారా, మన మనస్సు సమాధానముతో నింపబడినప్పుడు, అలాగే వాక్యాన్ని గ్రహించడానికి మరియు మన జీవితాల విషయంలో దేవుని వాక్యం ఆధారంగా ఆలోచించడానికి మనకు స్పష్టత కనుపరచబడుతుంది. లేకపోయినట్లయితే, ఎల్లప్పుడు మనం ఉద్రిక్తంగా, భయంతో, ఒత్తిడితో ఉండునట్లుగా కనిపిస్తాము. కనీసం దేవుని యొక్క సన్నిధిని కూడా మనము అనుభవించలేము. అయితే, ఈ సమాధానము మనలను దేవుని వాక్యాన్ని మరియు దేవుని ప్రణాళికను స్వీకరించేలా నడిపించుచున్నది. కాబట్టి రెండవదిగా, అది మనలను దేవుని వాక్యం నుండి పోషణను పొందునట్లుగా నడిపిస్తుంది. నీటిలోని పోషకాల ద్వారా వృక్షం ఎలా పోషింపబడుతుందో, ఆలాగుననే ఆయన కూడా తన యొక్క పోషణతో మనలను పోషిస్తాడు. ఆ వాక్యం మనలో జీవమును, మనకు నిరీక్షణను కలుగజేయుచున్నది.

అంతమాత్రమే కాదు, నా ప్రియులారా, ఈ వచనములో చెప్పబడినట్లుగానే, ఆ దినమున ఆ వాక్యం మన పక్షమున కార్యము జరిగించుచున్నప్పుడు, మనం ఫలించడంలో తప్పక ఓటమిని పొందుకొనము. ఒక గొప్ప శాస్త్రవేత్తయైన ఐజాక్ న్యూటన్‌ను, తన ఆవిష్కరణలు మరియు పరిశోధనల వెనుక ఉన్న రహస్యం గురించి అడిగినప్పుడు, ఆయన ఇలా చెప్పారు: తాను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు, తన అమ్మమ్మ తనకు ఒక విషయమును నేర్పించెననియు, ఆ విషయాన్నే తాను నేటికీ అనుసరించుచున్నాడని స్పష్టముగా తెలియజేసియున్నాడు. అదేమనగా, ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడం మరియు ఆ వాక్యమును ధ్యానించడము. దేవుని యొక్క వాక్యమును మరియు ఆ మాటలను ధ్యానించుచూ, తాను ఇప్పటికిని వాటిని పాటించుచూనే ఉన్నాడని ఆయన తన జీవితములో తాను అనుభూతి చెందిన సత్యమును తెలియజేశారు. అది ఆయన జీవితంలో ఒకదాని వెంబడి ఒకటిగా ఎన్నో ఆశీర్వాదాలను తీసుకువచ్చినది. నా ప్రియులారా, నేడు మనం కూడా జలముల యొద్ద నాటబడిన అటువంటి చెట్టువలె మార్చబడినట్లయితే, నిశ్చయముగా, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. కనుకనే, చింతించకండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరములు కలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా చేయి పట్టుకొని మమ్మును నడిపించుచున్నందుకు నీకు వందనములు. దేవా, మేము జలముల యొద్ద నాటబడిన చెట్టువలె, నీ వాక్యంలో మేము లోతుగా నాటబడునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా హృదయాన్ని, మనస్సును నీ పరిపూర్ణ సమాధానముతో నింపి, నీ సన్నిధిని మేము అనుభూతి చెందుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో నుండి ప్రతి భయమును, గందర గోళాన్ని తొలగించి, ప్రతిదినం నీ సత్యంతో మమ్మును పోషించి, మా ఆత్మను బలపరచుము. యేసయ్యా, నీ వాక్యం మాలో జీవమును మరియు నిరీక్షణను, స్పష్టతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, ప్రతిరోజు మేము నీ వాక్యమును ధ్యానించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితంలోని అన్నికాలములలోను మేము ఫలించునట్లుగా జలముల యొద్ద నాటబడిన చెట్టువలె మమ్మును మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.