నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 30:11,12వ వచనములను తీసుకొనబడినది. ఆ వచనము, "నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు మరియు నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోష వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు'' అని భక్తుడు అంటున్నాడు. గోనెపట్ట అనగా, బాధ మరియు విలాపమునకు సూచనగా ఉన్నటువంటి ఒక గరుకైనటువంటి వస్త్రమై ఉంటున్నది. గోనెపట్టకు బదులుగా ప్రభువు మనకు నూతనమైన వస్త్రములను అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, సంతోష వస్త్రములను ఆయన మనకు ఇస్తాడు. మన దేవుడు రూపాంతరము కలుగజేయడములో విశిష్టత కలిగియున్నాడు. మనము కోల్పోయిన వాటన్నిటిని మన దేవుడు తిరిగి మనలను పునరుద్ధీకరించు దేవుడై యున్నాడు.
బైబిల్లో యోబును బంధకములలో నుండి విడిపించి, రెండంతలుగా ప్రభువు అతనిని దీవించాడు. యోబు ఎంతో బాధ, తీవ్రమైన వేదనలలో ఉన్నాడు. అయితే, అంతమునందు ప్రభువు అన్నిటిని అతనికి రెండంతలుగా అనుగ్రహించి దీవించియున్నాడు. కాబట్టి, మీరు శ్రమ నొందుతూ ఉన్నప్పుడు, 'ప్రభువా, నాకు ఈ శ్రమలు మంచి కొరకు కలుగజేసియున్నావు' అని ప్రభువుతో చెప్పండి. అందుకే బైబిల్ నుండి యోబు 1:21వ వచనములో చూచినట్లయితే, "నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక'' అని యోబు భక్తుడు తెలియజేసియున్నాడు. అందుకే, బైబిల్ నుండి లూకా సువార్త 6:21వ వచనములో చూచినట్లయితే, "ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, ఈ రోజు మీరు ఏడుస్తూ బాధపడుచుండవచ్చును. అయితే, నిరంతరము ఈలాగుననే ఉంటాము అని లేదండి. అన్నియు కూడా మనకు తిరిగి అనుగ్రహించబడతాయి. అప్పుడు మనము సంతోషముతో నవ్వుతాము. ప్రభువు మన నోటిని నవ్వుతో నింపబోవుచున్నాడు. అదేవిధముగా, ప్రభువు యోబునకు చేసియున్నాడు. దుఃఖము వేదన నుండి సంతోష సంభరములుగా యోబు యొక్క పరిస్థితిని ప్రభువు మార్చివేసియున్నాడు.
పాతనిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులు వారి బంధకములలో నుండి బయటకు వచ్చినప్పుడు అదే చెప్పియున్నారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 126:1-3వ వచనములలో చూచినట్లయితే, "సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, మనము కలకనిన వారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఇశ్రాయేలీయులను చెర నుండి వారిని విడిపించినప్పుడు అది వారికి ఒక కల వలె ఉండియున్నది. అప్పుడు, యెహోవా వీరికి కొరకు గొప్ప కార్యములు చేసెనని వారి చుట్టు ఉన్న అన్యజనులందరు చెప్పుకొనిరి. ఇంకను, కీర్తనలు 126:3వ వచనములో చూచినట్లయితే, "యెహోవా మన కొరకు గొప్పకార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితులమైతిమి'' అని ఇశ్రాయేలీయులు చెప్పుకున్నారు.
ఆలాగుననే, అక్టోబర్ 6వ తేదీన ఒకానొక ఉపవాస కూడికలలో నేను వాక్యమును బోధించుచున్నప్పుడు, నేను వాక్యమును బోధించి, ప్రజలందరికి ప్రార్థన చేసిన తర్వాత, చివరిలో ఒక సహోదరి, నా యొద్దకు వచ్చి, ఎంతగానో విలపించుచుండెను. నా జీవితములో నాకు అనేకమైన అప్పులు ఉన్నవని తను చెప్పినది. నాకు ఏమి చేయాలో తెలియడము లేదు, తను నేల మీద క్రింద పడిపోయి ఏడుస్తూ ఉన్నది. ప్రజలు ఆమెను పట్టుకొని లేపడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ, ఆమె లేవలేదు. అయితే, నేను ఈలాగున అన్నాను, 'ఆమెను ఆలాగున విడిచిపెట్టండి. తను ప్రభువు యెదుట తన హృదయమంతటిని కుమ్మరించియున్నది.' అప్పుడు నేను నా చేతులను ఆమె మీద ఉంచి, ఆమె కొరకు ప్రార్థించియున్నాను. ఆ రోజు నేను, "ప్రభువు మీ యొక్క కార్యములన్నిటిని కూడా చక్కపరుస్తాడు'' అని వాక్యమును బోధించియున్నాను. ఆ సహోదరి జీవితములో కూడా ప్రభువు పరిస్థితులన్నిటిని చక్కపరుస్తాడు అని నేను అప్పుడు విశ్వసించాను. ఇంకను సీషా ద్వారా సహాయము చేయమని మా సిబ్బందితో నేను చెప్పియున్నాను. అయితే, ప్రభువు ఆమెను గురించి అన్నిటిని చూసుకుని, తన పరిస్థితులను చక్కపరుస్తాడు అని నేను విశ్వసించియున్నాను.
అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖించుచున్నారా? మీ ఆస్తులు, సంపద లేదా జీవనోపాధిని కోల్పోయి నందున మీ హృదయము భారముగా ఉన్నది చింతించుచున్నారా? మీరు ఆర్థికపరంగాను, అప్పులు, నిరుద్యోగం లేదా జీవిత భాగస్వామి లేదా గర్భఫలము కొరకు బాధపడుచూ, సతమతమవుచున్నారా? అయితే, నిరుత్సాహ పడకండి. నా ప్రియులారా, నేడు మీ యొక్క ప్రతి భారమును ప్రభువు సన్నిధికి సమర్పించండి. ఎందుకంటే, ఆయన మిమ్మల్ని ఓదార్చగలడు, బలపరచగలడు మరియు మీ జీవితమును పునరుద్ధరించగలడు. ఆయన తన పరిపూర్ణ చిత్తానుసారంగా మిమ్మును ముందుకు నడిపిస్తాడని మరియు మీ అవసరతలను తీరుస్తాడని ఆయనను నమ్మండి. యోబు జీవితమును పునరుద్ధరణతో నింపిన ప్రభువు, మీ జీవితంలోనికి కూడా ఒక నూతన ఆరంభమును తీసుకొని వస్తాడు. ఇంకను నేడు మీ దుఃఖమంతటిని సంతోషముగా మారుస్తాడు. ప్రభువు మీ యొక్క గోనెపట్టను తొలగించి, నూతన వస్త్రమైన సంతోష వస్త్రములను మీకు ధరింపజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా దుఃఖమంతయు సంతోషముగా మార్చుము. ప్రభువా, నీ హస్తము మా మీదికి దిగివచ్చి, మమ్మును ఆదరించునట్లుగా చేయుము. దేవా, ఇకమీదట మా జీవితములో ఏడ్వడము మరియు విలపించడము, బాధపడడము ఇక ఉండకుండ చేయుము. ప్రభువా, మాకున్నటువంటి గోనెపట్టలను తొలగించి, సంతోషవస్త్రములను మాకు ధరింపజేయుము. దేవా, మేము పోగొట్టుకున్నటువంటి ప్రియులను బట్టి మేము విలపించుచుండగా, నీవు మమ్మును ఆదరించి, మేము కోల్పోయిన సమస్తమును నీవు మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా యొక్క ఆస్తిని మరియు సంపదను పోగొట్టుకొనియున్న మేము కోల్పోయినవన్నియు తిరిగి మా యొద్దకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మాకు మంచి ఉద్యోగమును, కోల్పోయిన ధనము తిరిగి మాకు వచ్చునట్లుగాను, నూతన వ్యాపారమును మాకు దయచేయుము. దేవా, నూతన జీవిత భాగస్వామిని మాకు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మాకు గర్భఫలమును దయచేయుము. దేవా, మేము కోల్పోయిన సమస్తమును రెండంతలుగా మాకు తిరిగి కలుగజేయుము. యేసయ్యా, నీ యొక్క సమృద్ధిని మా మీదికి దిగివచ్చునట్లుగాను, మా కుటుంబాలలోను మరియు మా జీవితాలలో ఇక ఏడ్పు మరియు లేమి ఉండకుండా, సమస్తమైన ఆశీర్వాదములతో మమ్మును దీవించుము. దేవా, మా దుఃఖమంతటిని తొలగించి, మా నోటిని నవ్వుతోను మరియు సంతోషముతోను నింపుము. ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములను ఇప్పుడే మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


