నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:13వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి'' అని చెప్పబడినట్లుగానే, మీరు సత్యవాక్యమును, అనగా మీరు రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వసించినప్పుడు, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్రించబడియున్నారు. ఆలాగుననే, మీరు ప్రభువును నమ్మి, ఆయనను అనుసరించడము మొదలుపెట్టినప్పుడు ఆయన యందు నమ్మకము ఉంచినప్పుడు, ఆయన మీకు వాగ్దానము చేసినట్లుగానే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి, ఆయనను మీలో ఒక ముద్రగా ముద్రించియున్నాడు. ప్రభువు నేడు మీకు ఈ కృపను అనుగ్రహించును గాక. మీరు ఆయన ఆలయమనియు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారనియు అందరి యెదుట ప్రకటించుటకు ప్రభువు మీ మీద ఈ ముద్రను ముద్రించుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి!
నా ప్రియమైనవారలారా, అవును, దేవుడు తనను ఎరిగినవారిని తాను పరిశుద్ధాత్మతో ముద్రించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 2 తిమోతికి 2:19వ వచనములో మనము చదివినట్లయితే, "అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు తన వారిని ఎరుగును; క్రీస్తు నామమును అంగీకరించు ప్రతి ఒక్కరూ చెడుతనమును విడిచిపెట్టవలెను. ఈ ముద్ర దేనిని సూచించుచున్నది? ఇది దుష్టత్వమునకు, అన్యాయమునకు దూరముగా ఉండు జీవితమును, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితమును సూచించుచున్నది. పురుషుడైనా లేదా స్త్రీయైనా, ప్రభువు నామమును ధరించిన ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వమునకు దూరముగా ఉండుటకు పిలువబడియున్నారు. మనము అన్యాయమును ఆచరించకూడదు, అది మన జీవితములను శాసించునట్లుగా అనుమతించకూడదు. ప్రభువు నేడు మనకు ఇటువంటి కృపను అనుగ్రహించుచున్నాడు. పరిశుద్ధాత్మ ముద్ర సూచించునది కూడ ఇదియే. అందుకే ఆయన మనకు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించియున్నాడు. నా ప్రియులారా, మనము చివరికి మన పరలోక నివాసమునకు చేరుకునే వరకు, ప్రభువు స్వయముగా మనకు ముద్ర వేసి, మనలను కాపాడతాడు. అందుకే బైబిల్ నుండి ఎఫెసీయులకు 4:30వ వచనములో మనము ఇలాగున చదవగలము: " దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి; మీరు విడిపించబడు వరకు మీరు ఆయన ద్వారా ముద్రించబడ్డారు. మీరు పరలోకమును చేరుకునే క్షణము వరకు, ప్రభువు తన సన్నిధి ద్వారా మిమ్మును సురక్షితముగా కాపాడతాడు. ఆయన తన యొక్క సంపూర్ణమైన చిత్తమును మీరు నెరవేర్చునట్లుగా మిమ్మును కాపాడి సంరక్షిస్తాడు; అంతేకాక, ప్రతిరోజు ఆయన చిత్తానుసారముగా మనము ఈ లోకములో జీవించుటకు కావలసిన కృపను, బలమును ఆయన మనకు నిత్యము అనుగ్రహిస్తాడు.
ఆలాగుననే, నా ప్రియులారా, ఆయనను దుఃఖపరచని విధముగా జీవించడానికి ఆయన మీకు తన యొక్క కృపను అనుగ్రహించుచున్నాడు. మనము ప్రతిరోజు ఈ కృపను పొందుట కొరకు మనము ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడవలెను. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:26వ వచనములో చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగున ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, మన బలహీనతలో పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయుచున్నాడు. మన జీవితములలో దేవుని చిత్తము నెరవేరునట్లుగా, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆయన మనకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మనము తప్పులు చేసినప్పుడు, మన లోపములను ఎదుర్కొన్నప్పుడు, అలసిపోయినప్పుడు లేదా కలవరపరిచే ప్రశ్నలతో సతమతమవుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో మన కోసం విజ్ఞాపన చేయును. అప్పుడు, ప్రభువు మన మీద ముద్ర వేసినట్లుగా మన జీవితములలో స్పష్టమైన నిదర్శనం ప్రత్యక్షపరచబడుతుంది. పరిశుద్ధాత్మ ముద్ర మనలను దేవునికి చెందినవారినిగా గుర్తించుచున్నది. ఆయన ఆలయంగా మనము భద్రపరచబఈడతాము. పరలోకానికి చెందినవారలముగా మనము జీవనయాత్రను కొనసాగిస్తాము, ఒక రోజు మనము మన పరలోక నివాసమునకు చేరుకుంటాము.
అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:21వ వచనములో వ్రాయబడినట్లుగానే," మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే'' అని చెప్పబడినట్లుగానే, క్రీస్తునందు మనలను కూడా స్థిరపరచువాడు దేవుడే. ఆయన మనలను అభిషేకిస్తాడు. ప్రభువు మనలను క్రీస్తునందు స్థిరపరచి, తన ఉద్దేశములను నెరవేర్చడానికి ఈ లోకములో మనలను తన యొక్క ముద్రవేసి బద్రపరచియుంచియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు ఆయన మీకు ఇటువంటి కృపను అనుగ్రహించును గాక. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:22వ వచనములో చూచినట్లయితే, "ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన మీద ఆయన యాజమాన్యపు ముద్రను వేసి, రాబోయే దానిని నిశ్చయపరుస్తూ, మన హృదయములలో తన ఆత్మను ఒక ఉత్తరవాదిగా ఉంచియున్నాడు. నా స్నేహితులారా, ఆయన నేడు మిమ్మును తన సొంత బిడ్డలనుగా చేసి, మీ మీద తన ముద్రను వేసి, మిమ్మును నడిపిస్తాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:14 వ వచనములో చూచినట్లయితే, " దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు '' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆత్మచేత నడిపింపబడు వారందరు దేవుని పిల్లలుగా పిలువబడుచున్నారు.
అవును, నా ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ చేత మీరు నడిపింపబడినప్పుడు, మీరు కూడా దేవుని బిడ్డలే! దేవుడు మిమ్మును ఆయన సొంత బిడ్డలనుగా భద్రపరచి, కాపాడుతాడు. మీరు పరలోకమును చేరు వరకు, అనగా, మీ జీవితకాలమంతయు ఆయన మిమ్మును తన ముద్రతో భద్రపరచి, నడిపించవలెను. తద్వారా మీరు ఆయనను దుఃఖపరచకుండా ఉండవలెను. ఆయన మిమ్మును పరలోకమునకు చెందినవారిగా ఉంచవలెననియు, తన ఆత్మతో ఎల్లప్పుడు నింపాలని, మీ కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయాలని, తన మార్గములలో మిమ్మును నడిపించవలెనని, మిమ్మును బలపరచవలెననియు మరియు మిమ్మును కాపాడవలెనని మీ పట్ల కోరుకుంటున్నాను.కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ మీద కూడా దేవుడు ముద్రవేసి, భద్రపరచాలంటే, మీరు చేయవలసిందల్లా, మిమ్మును ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, తన ఆత్మను సంచకరువును మీ మీద వేసి, మిమ్మును తన ముద్రతో భద్రపరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మచేత మేము ముద్రించబడటానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. యేసయ్యా, ఇటువంటి కృపా వరములను మా జీవితంలో ఎల్లప్పుడు సమృద్ధిగా ప్రవహించునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మచేత ముద్రించబడి, నడిపించబడుటకు, నీ చిత్తమును నెరవేర్చుటకు, క్రీస్తులో మేము నీ పిల్లలముగా జీవించుటకు మరియు మేము పరలోక నివాసమునకు చేరుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము తప్పులు చేసినప్పుడు, మేము లోపములను ఎదుర్కొన్నప్పుడు, అలసిపోయినప్పుడు లేదా కలవరపరచే ప్రశ్నలతో సతమతమవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ మాలో ఉండి, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో మా కొరకు విజ్ఞాపన చేయవలెనని మేము కోరుచున్నాము. తండ్రీ, మేము ఎల్లప్పుడు నీకు చెందినవారముగా ఉంటూ, నీ ఆత్మ చేత నడిపించునట్లుగా నీవు మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి, నీవే మమ్మును అభిషేకించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


