నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 32:41వ వచనమును మనకు ఇవ్వబడినది. ఆ వచనము, "వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించు చున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను'' అని చెప్పబడినట్లుగా వాగ్దానము చేసిన విధంగానే, ప్రభువు ఆవిధంగా ఆయన చేసిన వాగ్దానములన్నిటిని నెరవేరుస్తాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 85:12వ వచనములో చూచినట్లయితే, "యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మనకు ఉత్తమమైనదానిని అనుగ్రహించుటకు మన పట్ల కోరుచున్నాడు. ఆలాగుననే, కీర్తనలు 34:10వ వచనములో చూచినట్లయితే, "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పూర్ణ హృదయముతో ప్రభువును వెదకినట్లయితే, నిశ్చయముగా మీకు ఏ మేలు కొదువై యుండదు.

మా బిడ్డలకు నేర్పించినటువంటి ఒక చక్కని పాట ఉన్నది. 'ఉదయమున ఆయనను వెదకవలెను, మధ్యాహ్నమందు ఆయనను వెదకవలెనని మరియు ఎల్లవేళల మనము ఆయనను వెదకవలెను' అని మేము వారికి నేర్పించాము. ఆలాగుననే, దావీదు దైవజనుడై ఉంటున్నాడు. దావీదు ఎంతో జాగ్రత్తగా దేవుని వెదకాడు. అతడు ఉదయ కాలమున, మధ్యాహ్నమున మరియు రాత్రి సమయములలో దేవుని వెదకాడు. అన్నివేళల ప్రభువును అతడు గట్టిగా హత్తుకొనియున్నాడు. కనుకనే, దావీదు జీవితమంతా ప్రభువు అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు ఒక గొఱ్ఱెల కాపరిగా ఉండెను. కానీ, ప్రభువు అతనిని సమృద్ధిగా దీవించాడు. ఇంకను రాజుగా అతనిని ఉన్నత స్థానమునకు పైకి లేవనెత్తి హెచ్చించాడు. అవును, ఎంతగొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా! ఇంకను కీర్తనలు 34:10వ వచనములో పైన చెప్పబడినట్లుగానే, "యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండ దు'' అని వాక్యము అంటున్నది. ఇంకను దావీదు దేవునిని తన కాపరిగా వెదకియున్నాడు. ఇంకను కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని అన్నాడు. బైబిల్ నుండి కీర్తనలు 34:6వ వచనములో చూచినట్లయితే, "ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను'' అని చెప్పబడినట్లుగానే మనము దీనులమై ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, నిశ్చయముగా ఆయన మన మనవిని ఆలకించును.

నా ప్రియులారా, ఈ లోకములో మనము అనేక శ్రమలను ఎదుర్కొన్నప్పు డు, ప్రభువు వైపు మాత్రమే మనము చూడాలి దేవుని బిడ్డలారా. దావీదు వలె మీరు కూడా యేసయ్యను గట్టిగా హత్తుకొని ఉండాలి. సమస్య ఏదైనప్పటికిని కూడా మీ జీవితములో నుండి సులభముగా అది తొలగింపబడుతుంది. అందుకే బైబిల్ నుండి ఎజ్రా 8:22వ వచనములో చూచినట్లయితే, "మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును...'' అని వ్రాయబడినట్లుగానే, మన జీవితాలను మనము ఒకసారి పరీక్షించుకొనెదము. అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్ణ హృదయముతో ప్రభువును వెదకుచున్నామా? దేవుని వాక్యమును చదవడానికి ఎంత సమయమును వెచ్చించుచున్నాము. దేవుని సమయమును వెదకడానికి ఎంత సమయమును వెచ్చించుచున్నాము. ప్రభువు యొద్దకు వెళ్లి, మొఱ్ఱపెట్టుచున్నామా? లేదా? మనుష్యులను మనము ఆధారము చేసుకొనుచున్నామా? అని ఒక్కసారి మనలను మనము పరీక్షించుకొనవలెను. నా ప్రియులారా, మనుష్యుల యొద్దకు వెళ్లకండి, ఎటువంటి స్థితిలోనైనను సరే, దేవుని యొద్దకు మాత్రమే వెళ్లాలి. ప్రభువు మీకు అద్భుతమైన విధానములో సమస్తమును మీ పట్ల జరిగిస్తాడు. ఆవిధంగానే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకుందామా? ఆలాగైతే, నేడు మీరు దావీదు వలె ఎల్లవేళల మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీకు ఎటువంటి మేలును కొదువకాకుండా చేసి, నేటి వాగ్దానము నుండి మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితాలను ఇప్పుడే చూచుచున్నావు, కనుకనే, ప్రార్థించుచున్న మా వైపు చూచి, మా మొఱ్ఱలను ఆలకించి, మా అసరతలన్నిటిని తీర్చుము. ప్రభువా, మేము నీ మేలులతోను కృపలతోను నింపబడునట్లుగా కృపను దయచేయుము. దేవా, మాకు మేలు చేస్తావని వాగ్దానం చేసినందుకు నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలోని ప్రతి క్షణంలో మిమ్మును వెదకడానికి మాకు నేర్పుము. దేవా, దావీదు వలె మిమ్మును హత్తుకొనునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మేము నీ నుండి మమ్మును దూరం చేయు ప్రతి ఆటంకమును తొలగించుము. ప్రభువా, నీ సన్నిధి కొరకు మా హృదయాన్ని ఎంతో తృష్ణతో నింపుము. దేవా, మేము నిన్ను వెదకుచున్నప్పుడు ఏ మేలు కొదువై ఉండకుండా చేయుము. ప్రభువా, దావీదు వలె నీవు మా కాపరిగా ఉండి, మమ్మును ఎల్లప్పుడూ నడిపించుము. దేవా, మా జీవితములను సంపూర్ణముగా నీ హస్తములకు అప్పగించుకొనుచున్నాము. కనుకనే, దావీదు వలె నీవు మమ్మును హెచ్చించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.