నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 17:15వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రభువు యెదుట నీతిగల జీవితమును కలిగియుండవలెను. అప్పుడు మనము అన్యోన్యసహవాసమును కలిగియుంటాము. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 5:8వ వచనములో చూచినట్లయితే, "హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు'' అని చెప్పబడినట్లుగానే, మీరు శుద్ధమైన హృదయమును కలిగియుండవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అవును, మనము దేవుని మార్గమును, దేవుని వాక్యమును వెంబడించువారలనుగా ఉండవలెను. అప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధానమును ఎల్లవేళల కూడా మీ చెంతనే కలిగియుంటారు.

అందుకే యేస్యయా, ఇలాగున అన్నాడు, "నేను నా తండ్రియు ఏకమై యున్నాము'' అని చెప్పబడినది. ఆయన ఆ విధంగా ఏలాగున చెప్పగలిగెను అని మనము చూచినట్లయితే, ఆయన తండ్రిని ఎంతో నమ్మకముగా వెంబడించాడు గనుకనే, ఆయనతో ఏకముకాగలిగాడు. ఆయన ఎలాగున తండ్రితో సహవాసమును కలిగియున్నాడని మనము చూచినట్లయితే, యేసయ్య వేకువ జాముననే తండ్రిని వెదకియున్నాడు. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 1:35వ వచనములో చూచినట్లయితే, "ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను'' అని చెప్పబడినట్లగానే, ఆయన పెందలకడనే లేచి, దేవునికి ప్రార్థించియున్నాడు. ఇంకను, బైబిల్ నుండి లూకా సువార్త 6:12వ వచనములో చూచినట్లయితే, "ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన రాత్రంతయు ప్రార్థించియున్నాడు. ఇంకను, బైబిల్ నుండి మత్తయి 14:23వ వచనములో చెప్పబడినట్లుగానే, "ఆయన ఆ జనసమూహములను పంపి వేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ యెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన సాయంకాలమున తండ్రితో గడిపియున్నాడు. కనుకనే, తండ్రితో సహవాసము కలిగియుండెను. కనుకనే, బైబిల్ నుండి యోహాను 14:23వ వచనములో చూచినట్లయితే, "యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అని చెప్పబడినట్లుగానే, యేసయ్యా, తండ్రి మార్గములను వెంబడించాడు గనుకనే, ఆయన తండ్రితో సహవాసమును కలిగియున్నాడు. నా ప్రియులారా, ఆలాగుననే, మనము కూడా ఆయన మార్గములను వెంబడించినప్పుడు ఆయన మనతో కూడా సహవాసము చేయును.

బైబిల్ నుండి భక్తుడైన దావీదు దేవుని యొక్క మార్గములను వెంబడించి యున్నాడు. అంతమాత్రమే కాదు, ఎంతో జాగ్రత్తగా ప్రభువును వెదకియున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 63:1వ వచనములో చూచినట్లయితే, "దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును'' అని చెప్పబడినట్లుగానే, దావీదు కూడా వేకువనే వెదకియున్నాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 55:17వ వచనములో చూచినట్లయితే, "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును'' అని చెప్పబడినట్లుగానే, అందిమధ్యసంధ్య మూడు వేళలలో దావీదు దేవునిని వెదకియున్నాడు. అతడు సాధారణమైన ఒక గొఱ్ఱెల కాపరి మాత్రమే. అయినప్పటికిని ప్రభువు అతనిని సమృద్ధిగా దీవించాడు. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:30-31 వ వచనములలో చూచినట్లయితే, "అతని సమాధి నేటి వరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తన క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లి పోలేదని యు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.'' అవును, దేవుడు దావీదును ప్రవక్తగా వాడుకున్నాడని మనము చదువగలుగుతాము. దావీదు ప్రభువునకు సమీపముగా ఉన్న ఒక ప్రవక్త. నా ప్రియ స్నేహితులారా, మనము ప్రతిరోజు ప్రార్థనా జీవితమును కలిగియుండవలెను. ఉదయము మొదలుకొని, రాత్రి వరకు ప్రభువుతో సన్నిహిత సంబంధమును కలిగియుండవలెను. అప్పుడు యేసు ప్రభువువలె అన్ని పనులను చేయగలుగుతాము. దావీదు ప్రార్థించుట ద్వారా దేవునితో సన్నిహిత సంబంధమును కలిగియున్నాడు. దేవుడు అతనిని ఎంతో శక్తివంతంగా వాడుకున్నాడు. అదేవిధంగా, నా ప్రియులారా, మనము కూడా ప్రార్థనా జీవితమును క్రమముగా అలవర్చుకుని, ఉదయం నుండి రాత్రి వరకు దేవునితో సన్నిహిత సహవాసమును కలిగియుండునట్లుగా కొనసాగించవలెను.

నా ప్రియులారా, ప్రభువును మనము గట్టిగా హత్తుకొని ఉండవలెను. ఆయన మార్గమును వెంబడించు కృపను పొందుకోవాలని దేవుని యొద్ద అడగవలెను. దావీదు భక్తుడు ఉన్న రీతిగానే, ప్రవక్తగా అతడు దీవించబడిన రీతిగానే, మనము కూడా ప్రభువును అడగవలెను. మీలో ఎందరు నాతో కలిసి ప్రార్థించబోవుచున్నారని మిమ్మును పరీక్షించుకొనవలెను. ఆలాగుననే, ప్రభువునకు మిమ్మును మీరు సమర్పించుకొని, రండి, మనము మోకరించి, ప్రభువు దీవెనలను పొందుకోవడానికి ఆయన సన్నిధిలో ప్రార్థించుదాము. నా ప్రియులారా, మీరు కూడా యేసు మరియు దావీదు మార్గములను అనుసరించినప్పుడు, మీ జీవితములు మరియు క్రియలు క్రీస్తు స్వభావమును ప్రతిబింబించును. మీరు మీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని హత్తుకుని, ఆయన మార్గములను విశ్వాసముతో అనుసరించడానికి కావలసిన కృపను ఆయనను అడిగినట్లయితే, ప్రభువు దావీదును ఉపయోగించుకున్నట్లుగానే, మనలను కూడా ఉన్నతంగా హెచ్చించి, తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. నా ప్రియులారా, ఆలాగుననే, మీ జీవితములను పరిశీలించుకొనండి, మీరు ప్రతి ఉదయం, సాయంత్రం మరియు మధ్యాహ్నం దేవునితో సమయం గడుపుచున్నారా? ఆయన సన్నిధి కొరకు మీరు నిజంగానే దాహముతో ఉన్నారా? అయితే, దేవుని యొద్దకు రండి, ప్రార్థనలో ప్రభువును వెదకండి, నీతియుక్తమైన జీవితమును గడపడానికి, ఆయనకు సమీపముగా ఉంటూ, ప్రతిరోజు ఆయన సన్నిధిని అనుభవించండి. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. తండ్రియైన దేవా, నీతో సహవాసమును కలిగియుండునట్లుగా మమ్మును మార్చుమని నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మేము నిజమైన దాహముతో నీ సన్నిధిని వెదకుటకు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మేము నిన్ను వెదకుటకును, మరియు నీకు సమీపముగా వచ్చుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, ఎల్లవేళల మేము నీతో మాట్లాడే వాంఛను మాకు కలిగించుము. దేవా, దావీదు వంటి జీవితమును మాకందరికి దయచేయుము. ప్రభువా, మేము నిన్ను చూచుటకు మాకు యథార్ధమైన హృదయమును దయచేయుము. దేవా, మేము దావీదు వలె నీతి మార్గంలో నడవడానికి మరియు నీకు సన్నిహితంగా ఉండుటకు మాకు శుద్ధ హృదయమును దయచేయుము. ప్రభువా, మేము నీ వాక్యమును ఎంతో నమ్మకముగా అనుసరించడానికి మరియు మా క్రియలన్నిటిలో నీ స్వభావమును ప్రతిబింబించునట్లుగా మాకు నేర్పించుము. దేవా, ప్రతిదినము మేము నీ యొక్క సన్నిధిని మేము అనుభవించునట్లుగా చేయుము. ప్రభువా, దావీదు వలె మమ్మును కూడా ఉన్నత స్థానమునకు హెచ్చింపబడనట్లుగాను, నీ మహిమ కొరకు మమ్మును ఉపయోగించుకొనుము. దేవా, మాకు క్రమబద్ధమైన ప్రార్థన జీవితమును మరియు అంతం వరకు నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.