నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఎంతో విశ్వాసంతో మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ లోకములో ఉన్న తండ్రులు ఇవ్వగలిగిన దానికంటెను దేవుడు ఎల్లప్పుడు ఎంతో శ్రేష్ఠమైన దానిని మాత్రమే మనకు అత్యధికముగా అనుగ్రహిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 7:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును'' అని చెప్పబడిన ప్రకారము ఈ రోజు ఆయన యొద్ద నుండి శ్రేష్ఠమైన యీవులను పొందుకొనండి. ప్రభువు మనకు సెలవిచ్చుచున్నది కూడా ఇదియే. నాకు ఒక స్నేహితుడు కలడు, అతనికి బర్గర్లంటే చాలా ఇష్టం. మేము బయటకు వెళ్లినప్పుడు, మేమిద్దరము కలిసి బర్గర్ తినేవారము. అతడు ఆ బర్గర్‌ను తిని రుచి చూసి, 'ఓహ్, ఇది అంత బాగోలేదు, దీనిలో అది లేదు, ఇందులో ఇది లేదు ' అని చెబుతుంటాడు. మేము మూడు నాలుగు దుకాణములలో ప్రయత్నిస్తాము. కానీ, అతనికి ఏదియు కూడా నచ్చదు. అంతటితో అతను ఆగకుండా, 'లేదు, మంచి బర్గర్ దొరుకు వరకు, ప్రతిఒక్కొక్క దుకాణమునకు వెళ్తాను,' అని చెప్పి, ఆలాగున మంచి బర్గర్ దొరికే వరకు అన్ని దుకాణములకు వెళ్లేవాడు.

ఈలాగున ఉండగా, ఎన్నో నెలల తర్వాత, మాకు అతని నుండి ఒక వార్త వచ్చినది. ఆకస్మాత్తుగా, అతను ఇలా అన్నాడు: 'ఓహ్, నేను ఎంతో మంచి బర్గర్‌ను కనుగొన్నాను! అది చాలా బాగుంది! అది ఎంతో మంచి రుచిగా ఉన్నది!' అని చెప్పాడు. అయితే, 'అది ఎక్కడ ఉన్నదని మాత్రం నేను నీకు చెప్పను. నీవే దానిని స్వయంగా వెదకి కనుగొను' అని చెప్పాడు. కానీ, చివరకు ఆ బర్గర్‌ను కనుగొన్నందుకు అతను ఎంతగానో ఆనందించాడు. తన మనస్సుకు నచ్చిన బర్గర్ దొరుకు వరకు అతడు అంతగా వెదక గలిగినట్లయితే, మన ప్రభువైన యేసు మనకు అతి శ్రేష్టమైన దానినే అనుగ్రహించునని విశ్వసించుచూ, మనం కోరుకొనుచున్న వాటి కొరకు ఆయనను ఇంక ఎంత ఎక్కువగా ఆయనను అడగాలి మరియు ప్రార్థించాలి కదా! సాధారణగా, మానవులమైన మనము మంచిది దొరకాలని, ఒక చోట నుండి మరొక చోటికిని వెదుక్కుంటూ, ప్రతి ఒక్క చోటికి తిరగలిగినట్లయితే, మనకు మంచి యీవుల నిచ్చు దేవుని కొరకు మనం ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటూ, ప్రతిరోజు ఇంకను ఎక్కువగా ఆయనను అడగగలిగినట్లయితే, నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించలేడా? తప్పకుండా ఆయన మన ప్రార్థనలకు జవాబును దయచేస్తాడు.

నా ప్రియులారా, ప్రభువు మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇలాగున అంటున్నాడు: 'అడుగుడి మీకు ఇయ్యబడును, నన్ను వెదకుడి మీకు దొరుకును.' కనుకనే, నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలమైన మనం, ఆయనను వెదకుతూ, ఆయనపై ఆధారపడాలి. ప్రభువు మాత్రమే మన పట్ల అద్భుతాలను జరిగించుచూ, మనకు కావలసినవన్నియు సమకూరుస్తాడు. కాబట్టి, కేవలం మీరు, ' నేను ఎంతో కష్టపడి పని చేయుచున్నాను కనుకనే, దాని మీద ఆధారపడి, నాకు ఉత్తమమైన ప్రతిఫలము వస్తాయని మాత్రమే నమ్మకండి.' పరిచర్యలో మీ వాక్చాతుర్యమును బట్టి దాని మీద ఆధారపడకండి. కేవలం, మీ యొక్క నైపుణ్యము మాత్రమే మీకు గొప్ప విజయాన్ని చేకూరుస్తుందని భావించకండి. నా ప్రియులారా, దేవుని బిడ్డలకు, కేవలం ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములు మాత్రమే. కేవలం ఆయన దయచేయుట ద్వారా మరియు కేవలం ఆయన అద్భుతాలు చేయుట ద్వారా మాత్రమే మనకు ద్వారములు తెరువబడుచున్నవి; అలాగే మన జీవితంలో ఉత్తమమైన మంచి యీవులను దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. కనుకనే, నేడు నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువు మీద ఆధారపడండి, ఆయనను ఆవేదనలో కూడా ఎంతో జాగ్రత్తగా వేడుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఆయనను కనుగొంటారు. కాబట్టి, ఇప్పుడు మీరు ఆయనను అడుగుతారా? ఆలాగైతే, నేటి వాగ్దానము నుండి నిశ్చయముగా మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము నిన్ను వెంబడించాలనే మనసుతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. కనుకనే, నీ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, నిన్ను అడుగుటకును, నిన్ను వెదకుటకును మరియు నిన్ను పూర్ణహృదయముతో నమ్ముటకు మాకు నేర్పించుము. దేవా, మా సొంత బలం మీద ఆధారపడి, మేము చేయు ప్రతి పనిలో సందే హమును తొలగించుము. ప్రభువా, నీవు ఎల్లప్పుడు శ్రేష్ఠమైనదానిని మాత్రమే అనుగ్రహిస్తావని నమ్ముటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ కొరకు వేచి ఉండటానికిని, నిన్ను వెదకడానికి మాకు ఓర్పును, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండుటకు విశ్వాసమును అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితంలో నీవు మాత్రమే సరైన ద్వారములను తెరువగలవని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితాలను నీకు సమర్పించుకొనుచున్నాము, మా సమస్యల నుండి మాకు పరిష్కారమును దయచేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదముల మరియు అద్భుతముల మార్గములో మమ్మును నడిపించుము. దేవా, మేము సంపూర్ణంగా నీ మీద ఆధారపడునట్లుగా ఎన్నుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.