నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆమోసు 3:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు'' అని చెప్పబడిన ప్రకారము అనేకమంది ప్రవక్తలు ఈ వరముతో ఆశీర్వదింపబడియుండి ఉన్నారు. ఇది ఎంతో గొప్ప వరమై ఉంటున్నది. అయితే, ఈ గొప్ప వరమును మనము ఏలాగున పొందుకొనగలము? ప్రభువుతో అన్యోన్యసహవాసమును మనము కలిగియుండాలి. కాబట్టి, మనము మన సమయమంతటిని యేసయ్యతో గడపాలి. ఎల్లప్పుడు ఆయనతో ప్రార్థనలో మాట్లాడుతూ, ఆయనతో సన్నిహితంగా నడవాలి.

ఆలాగుననే, మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, నా భర్తగారు ఎల్లప్పుడు ప్రభువుతో మాట్లాడుతూ, ఆయనతో నడవడము నేను చూస్తుంటాను. భార్యభర్తలుగా మేము కలిసి కూర్చుని ముచ్చట్లాడుతూ, మేము సమయమును ఎక్కువగా గడిపేవారము కాదు. ఆయన ఎల్లప్పుడు యేసయ్యతో సమయమును గడుపు చుండేవారు. ఇంకను ఆఫీసుకు వెళ్లి వచ్చి, ఆ తర్వాత, ప్రభువుతోనే ఎక్కువ సమయమును గడుపుతూ ఉండేవారు. అంతమాత్రమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లడానికి కూడా నేను వణికిపోతాను. ఏదైనా వివాహములో వర్తమానమును అందించాలనగా, ఎంతో సమయమును దేవుని సన్నిధిలో గడుపుచూ, దేవుని మాటలను పొందుకొను వరకు కూర్చుని ప్రార్థించేవారు. ఈలాగుననే, నిత్యము దేవునితో అన్యోన్యసహవాసమును కలిగియుండేవారు. అందుకే బైబిల్ గ్రంథములో అనేకమంది ఈ వరమును పొందుకొనియుండుట మనము చూడగలుగుతాము. అదేవిధముగానే, ప్రవక్తియైన దెబోరా కూడా ఈ వరమును పొందుకొనియుండెను. అందుకే బైబిల్ నుండి న్యాయాధిపతులు 4వ అధ్యాయములో మనము దెబోరాను గూర్చి చూడగలము. తనకు ఒక కుటుంబము ఉన్నది. అయిననూ, ' ఆమె ఒక కుటుంబాన్ని కలిగియుంటూ, దేవునితో అంత సమయమును గడుపుతూ, అంత గొప్ప వరమును కలిగియుండడము ఇది సాధ్యమేనా?' అని అనేకమంది ప్రశ్నించేవారు. మరి నా ప్రియులారా, దెబోరా మరియు మిర్యాము ఈ వరమును పొందుకున్నప్పుడు మీరు మరియు నేను ఎందుకు పొందుకొనకూడదు? మనము దేవునితో అన్యోన్య సహవాసమును కలిగియుండడమే చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే, మీరు దిగులుపడకండి.

నా ప్రియులారా, ఆలాగుననే, మీరు దేవుని వాక్యమును చదవడము, దేవుని వాగ్దానములను పొందుకొనడము మరియు మీరు దేవుని పట్ల ఎంత నమ్మకముగా ఉన్నారని ప్రభువు గమనించుచున్నాడు. ఆలాగుననే, భక్తుడైన మోషే ప్రభువునకు నమ్మకముగా ఉండేవాడు. ప్రభువు అతనిని ప్రవక్తగా వాడుకున్నాడు. తద్వారా, అతడు ఇశ్రాయేలీయులందరిని కూడా వాగ్దాన దేశమునకు తీసుకొని వచ్చునంతటి ఒక గొప్ప కృపను ప్రభువు అతనికి అనుగ్రహించాడు. అవును, నా ప్రియ సహోదరి, సహోదరులారా, మనము కూడా ప్రభువును అడగాలి. అందుకే బైబిల్ నుండి మత్తయి సువార్త 7:7వ వచనమును మనము చదివినట్లయితే, "అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును'' అని దేవుని వాక్యము చెప్పినట్లుగానే, ఇప్పుడు కూడా నా ప్రియమైన స్నేహితులారా, మనము ప్రభువును అడుగుదాము. ప్రభువు యెదుట మనము పరిశుద్ధ జీవితమును జీవించాలి. ఒక నిమిషమును కూడా మనము వృధా పోనియ్యకూడదు. ప్రభువుతో మనము అన్యోన్యసహవాసమును కలిగియుండాలి. ప్రభువుతో మాట్లాడుతూ, ఆయనతో నడి చేవారముగా మనము ఉండాలి. అటువంటి మహిమోన్నతమైన జీవితమును జీవించడానికి మీ మనస్సును సిద్ధపరచుకొనండి. ఇప్పుడే ప్రభువు మిమ్మును దీవించబోవుచున్నాడు. మిమ్మును ఒక ప్రవక్తగా మరియు ప్రవక్తినిగా మార్చబోవుచున్నాడు. మిమ్మును తన మహిమార్థమైన వాడుకుంటాడు. కనుకనే, నేడు మిమ్మును మీరు ఆయనకు సజీవంగా సమర్పించుకొనండి. కాబట్టి, ఆయనకు మిమ్మును మీరు సమర్పించుకొని, ప్రార్థనలో ఆయన వైపు చూడండి. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఇటువంటి ప్రవచన వరము కొరకు ఆశించుచున్న మా మీద నీ దృష్టిని ఉంచుము. యేస య్యా, 'అడుగుడి మీకియ్యబడును' అన్న వాగ్దానము ప్రకారము నేడు అట్టి వరమును అడుగుచున్న మాకు ఇప్పుడే దయచేయుము. ప్రభువా, నీ యొక్క మహిమార్ధమై మమ్మును వాడుకొనుము. యేసయ్యా, మా అవసరతలన్నిటిని తీర్చుము. యేసు ప్రభువా, మేము నీతో సన్నిహిత సహవాసాన్ని కోరుకుంటున్నాము. దేవా, నీతో నడవడానికి మరియు ప్రతిరోజు నీతో మాట్లాడటానికి మాకు నేర్పించుము. ప్రభువా, అన్నింటికంటే ఎక్కువగా నీ సన్నిధిని ప్రేమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ వాక్యాన్ని అనుసరించడంలో మమ్మును నమ్మకంగా మరియు నీ స్వరానికి విధేయులముగా మమ్మును మార్చుము. యేసయ్య, నీ వలె మేము కూడా పరిశుద్ధ జీవితమును గడపడానికి మరియు ఈ లోకములోని క్షణికమైన విషయాలపై మా సమయమును వృధా చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ చిత్తం ప్రకారం నీవు మాకు ద్వారములను తెరుస్తావని మరియు నీ మహిమ కొరకు మమ్మును వాడుకొనుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.