నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీకందరికి నా శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 6:10-12వ వచనములు మన కొరకు ఇవ్వబడియున్నవి. ఆ వచనములు, "నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యములచేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము'' అని ఈ లేఖనములో సెలవిచ్చినట్లుగానే, మీరు తిని తృప్తి పొందునట్లుగా మీరు సమృద్ధిగా ఆశీర్వదింపబడవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నా ప్రియ స్నేహితులారా, మీ హృదయమంతటితో ప్రభువును మీరు జాగ్రత్తగా వెదకవలెను. మీ అనుదిన జీవితములో మీరు నేర్చుకొనవలసిన ప్రాథమిక అంశము ఇదియే.

అందుకే బైబిల్ నుండి యెషయా 1:19వ వచనములో చూచినట్లయితే, " మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని మాటలను వినినప్పుడు, ఆయన మనలను భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించునట్లుగా చేస్తాడు. మనలో అనేకమంది మంచి విషయాలైన అనేకమైనవాటిని, ఇంకా ఎన్నో మంచి విషయాలను కోల్పోయి విలపిస్తూ ఉంటాము. సరైన సమయములో వివాహము జరుగకుండా ఉండడము, మంచి ఉద్యోగము ఉండకపోవడము, ప్రభువు యొద్ద నుండి ఎటువంటి ఆశీర్వాదమును పొందలేకపోవడము, తగిన సమయములో సంతానము కలుగకపోవడము, ఇవన్నియు కూడా ఎందుకు జరుగుచున్నవి? అని మనము తలంచినట్లయితే, మనము ప్రభువును ఎంతగా వెదకాలో, అంతగా వెదకక పోవడము వలననే ఇవన్నియు జరుగుచున్నవి. అందుకే బైబిల్ నుండి యెషయా 57:13వ వచనములో చూచినట్లయితే, " నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి యన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని నమ్ముకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును దేశమును స్వతంత్రించుకొనునట్లుగా చేస్తాడు.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ప్రభువు యందు ఎంతగా విశ్వాసముంచియున్నారని మీ జీవితములను ఒకసారిగా పరీక్షించుకొనండి. ప్రభువును ఎంత సమయమును వెదకుచున్నారు? ప్రభువును ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారు? దేవుని వాక్యమును ఎంతగా చదువుచున్నారు? ఒకసారి మిమ్మును మీరు పరీక్షించుకొని, ప్రభువు యొద్దకు ఇప్పుడే రండి.

నా ప్రియులారా, మీరు ఆ విధంగా ప్రభువును వెదకుచున్నట్లయితే, ఆయన మిమ్మును అత్యధికమైన ఆశీర్వాదములతో నింపుతాడు. మిమ్మును ఆయనకు దగ్గరగా చేర్చుకొని మీ జీవితములను రూపాంతరపరుస్తాడు. అందుకే బైబిల్ నుండి మలాకీ 3:12వ వచనములో చూచినట్లయితే, "అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మిమ్మును అత్యధికమైన ఆశీర్వాదములతో నింపడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే, మీరు ఆయనను ఎంతగా వెదకుచున్నారు? మీరు ఆయనను ఎంతగా ప్రేమించుచున్నారు? మీ సమయమును ఆయన సన్నిధిలో మీరు ఎంతగా వెచ్చించుచున్నారు? దేవుని వాక్యమును మీరు ఎంతగా చదువుచున్నారు? పై చెప్పబడిన విషయములన్నిటిని మీరు జాత్త్రగా చేసినట్లయితే, ప్రభువు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. ప్రభువు మిమ్మును గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎల్లప్పుడు కూడా ప్రతి ఆశీర్వాదములను పేరుపేరున లెక్కించి, స్తోత్రించాలని పాడుతాము కదా. కనుకనే, నా ప్రియులారా, ప్రభువు చేసిన గొప్పకార్యములను బట్టి, మీరు సంతోషించి, అనుభవించండి. నేడు మీరు ఈ విషయాలన్నిటిని జ్ఞాపకము ఉంచుకొని, మరియొకసారి మీరు ప్రభువు సన్నిధిలో మిమ్మును మీరు సమర్పించుకొని, ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీకిస్తానని చెప్పిన వాగ్దాన దేశములో మిమ్మును ప్రవేశపెట్టి, మీరు తృప్తిగా తిని, సమృద్ధియైన ఆశీర్వాదములను అనుభవించునట్లు చేసి మిమ్మును ఉన్నతంగా దీవించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నీ ఆశీర్వాదములన్నిటిని బట్టి నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క నిరంతర ప్రేమకు మరియు సమృద్ధియైన దీవెనలకు నీకు వందనాలు. దేవా, మా హృదయమంతటితో నిన్ను వెంబడించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా అందరి హృదయాలను తాకుము. దేవా, నేడు మా హృదయాలను తెరచి, నిన్ను వెంబడించుటకు మేము సిద్ధముగా ఉండుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మా మీద నీ చేతులుంచి, మమ్మును దీవించుము. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించుము. తండ్రీ, మా అవసరతలన్నిటిని నీ మహిమలో తీర్చి, మమ్మును సమృద్ధిగా దీవించుము. దేవా, మా పూర్ణ హృదయంతో నిన్ను వెదకడానికి, నిన్ను సంపూర్ణంగా విశ్వసించడానికి, మరియు నీ వాక్యమునకు విధేయత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీకు సమీపముగా ఉంచుము మరియు మా జీవితం నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా కుటుంబమును దీవించుము మరియు మా చేతుల పనిని స్థిరపరచుము మరియు మహిమలో ఉన్న నీ ఐశ్వర్యమును బట్టి మా అవసరాలన్నింటినీ తీర్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.