నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుడు మన హృదయాలను సమృద్ధియైన ఆనందంతో నింపుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 55:22 వ వచనము ద్వారా మనం దేవుని నుండి ప్రత్యక్షంగా వాగ్దానమును పొందబోవుచున్నాము: ఆ వాగ్దాన వచనము, "నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు'' అని చెప్పబడిన ప్రకారము మన భారములన్నిటిని ఆయన మీద మోపినప్పుడు అది మనకు ఎంత సంతోషమును కలిగిస్తుంది కదా! ఆ గ్రామంలో ఒక స్త్రీ తన తలపై పెద్ద గడ్డివామును మోసుకుంటూ, ఆ మార్గము నుండి ఎంతో దూరం నడిచి వెళ్లుచుండెను. ఒక వ్యక్తి తన పడవను నడుపుతూ ఆమె ఆ నీటి నుండి ఎంతో దూరం నడవవలసి ఉంటుందని గమనించాడు. కనుకనే, అతడు, ఆమె చూచి, 'నీవు నా పడవలో ఎందుకు ఎక్కకూడదు? నేను మిమ్మల్ని తక్కువ సమయంలోనే అవతలి ఒడ్డుకు చేర్చగలను గదా' అని చెప్పాడు. వెంటనే, ఆమె పడవలోనికి ఎక్కింది, కానీ ఆ వ్యక్తి ఆమె ఇంకా తన తలపై గడ్డిమోపును మోయుచూ ఉండటాన్ని గమనించాడు. ఆమె దానిని క్రింద పెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. చూడండి, ఆమె తన భారమును తానే మోయుచుండెను. దానిని క్రిందికి దించి పెట్టడానికి ఎంతమాత్రము ఇష్టపడలేదు. అది భారము అని కూడా తనకు అనిపించలేదు.

నా ప్రియులారా, అదేవిధముగా, మనలో అనేకమంది సరిగ్గా అలాగే ఉంటున్నారు. మనం దేవుని యొద్దకు వచ్చినప్పటికిని, మన భారములన్నిటిని మన తలల మీదనే మోస్తూ ఉంటాము. వాటిని క్రింద పెట్టడానికి మనం ఇష్టపడము. ఆలాగుననే, మన భారములను ప్రభువు మీద మోపడానికి మనం ఇష్టపడము. మనము వాటిని గురించి పదే పదే భయపడుతూ ఉంటాము. ఆలాగుననే, అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాంతం ఇలాగే తలంచెదరు. తమ పిల్లలకు మంచి పాఠశాల దొరుకుతుందా? ఫీజులు కట్టడానికి చాలినంతగా డబ్బు ఉంటుందా? బిడ్డకు రక్షణ కలుగుతుందా? మరియు వారు చక్కగా చదువుచుకుంటారా? లేదా? అని ఆందోళన పడుతుంటారు. తర్వాత, వారికి వివాహ వయస్సు వచ్చినప్పుడు, ఆ సమయంలో తగిన జీవిత భాగస్వామితో వివాహము జరుగుతుందా? అత్తమామల కుటుంబం మంచిగా ఉంటుందా? ఆ తర్వాత, పిల్లలు పుడతారా? అది ఎప్పుడు జరుగుతుంది? పిల్లలను పాఠశాలకు పంపిన తర్వాత కూడా, తల్లిదండ్రులు రోజంతా వారికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతూ, వారిని గురించి ఆందోళన చెందుతారు. తద్వారా, ఎంతో భారం వారి హృదయాన్ని నింపుతుంది.

అయితే, నా ప్రియులారా, ప్రభువు ఇలాగున అంటున్నాడు, "నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు'' అని చెప్పబడిన వచనము ప్రకారము ఉదయముననే, మీకు ఉన్న ప్రతి భారాన్ని ప్రార్థన ద్వారా ప్రభువునకు అప్పగించండి మరియు ఆ భారాన్ని తొలగించడం ద్వారా దేవుడు మీ హృదయానికి సంతోషాన్ని మరియు సమాధానమును అనుగ్రహించును గాక. ఆయన మిమ్మును పోషిస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. ఆయన మిమ్మును చూసుకుంటాడు మరియు ఆయన మీ పిల్లల జీవితాలను కూడా ఎంతో జాగ్రత్తగా పరామర్శిస్తాడు. నా ప్రియులారా, కనుకనే, మనం ఆయన ఆత్మ యొక్క సంతోషముతో నింపబడినప్పుడు, వారిని ఎలా పరామర్శించాలని దేవుడు తన జ్ఞానంతో మనలను నడిపిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు చేయవలసిన ప్రతి పనిని ఆయన మీకు తెలియజేస్తాడు మరియు వాటి కొరకు మార్గమును సరాళము చేస్తాడు. అప్పుడు సమస్తమును ఎంతో సుళువుగాను మరియు ఆశీర్వాదకరంగాను మారుతుంది. కనుకనే, నా ప్రియులారా, మన భారములన్నిటిని ప్రభువు మీద మోపడానికి ఈ క్షణమే అటువంటి హృదయమును పొందుకొనుటకు మిమ్మును మీరు ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు మా హృదయంలో అనేక భారాలను మేము మోయుచున్నాము మరియు మాలో ఉన్న ప్రతి బాధలను కూడా నీవు గమనించుచున్నావు, దయచేసి మా భారములను మరియు ఒత్తిడిల ద్వారా మేము నిన్ను సంపూర్ణంగా విశ్వసించుటకు మాకు నేర్పించుము. ప్రభువా, ఇప్పుడు కూడా మా చింతలన్నింటిని, మా భయాలను మరియు మా పిల్లల జీవితాలను నీ ప్రేమగల హస్తములలోనికి అప్పగించుకొనుచున్నాము. దేవా, నీవు మా భారములన్నిటిని తొలగించి, మమ్మును ఆదుకుంటావన్న వాగ్దానం ప్రకారము, మేము నీవిచ్చిన వాగ్దానమును మేము నమ్మునట్లుగా మాకు అటువంటి మంచి హృదయమును దయచేయుము. ప్రభువా, నీ ఆత్మ నుండి వచ్చుచున్న ఆనందం మరియు సమాధానముతో మా హృదయాన్ని నింపుము. దేవా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నీ యొక్క జ్ఞానంతో మమ్మును నడిపించుము. ప్రభువా, మాకు మరియు మా కుటుంబానికి సరైన మార్గాలను తెరువుము మరియు మాకు సంబంధించిన ప్రతిదానిని పరిపూర్ణం చేయుము. దేవా, నీవు సమస్తమును జాగ్రత్తగా చూసుకుంటావనియు, మా మరియు మా పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తావని నమ్ముచూ, ఈ రోజు నీలో విశ్రాంతి తీసుకొనుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.