నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 థెస్సలొనీక యులకు 3:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' అని చెప్పబడినట్లుగానే, హేతువులేనటువంటి దుష్టులైన ప్రజల నుండి ప్రభువు తన్ను కాపాడమని పౌలు భక్తుడు ప్రజలను కోరియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మూర్ఖులైన దుష్ట మనుష్యులు పౌలును దేవుని పరిచర్యను చేయకుండా ఇబ్బంది పెట్టిరి. పౌలు ఎక్కడికి వెళ్లినను, అక్కడ అతడు హింసలను, కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను. అందుకే బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:5వ వచనములో చూచినట్లయితే, " దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక'' అని పౌలు భక్తుడు ఈలాగున తెలియజేసెను. కష్టములను భరించుచు క్రీస్తు యొక్క సహనమును కలిగియుండునట్లుగా థెస్సలొనీకయుల కొరకు పౌలు భక్తుడు ప్రార్థించాడు.

వారు యుద్ధము చేయుట కొరకు దేవుని ప్రేమ వారికి ఎంతగానో అవసరమై యుండెను. అపవాది ఎల్లప్పుడు మన ఆశీర్వాదములను దొంగలించి, నాశనము చేసి, హత్య చేయుట కొరకే ప్రయత్నిస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి దుష్టులు కూడా చెడు ప్రణాళికలను పన్నుతూ ఉంటారు. అందుకనే, పేతురుతో యేసయ్య, ఈ విధంగా తెలియజేసియున్నాడు, 'పేతురు సీమోను' అని పిలువబడేవాడు. " సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను '' ప్రకారము అపవాది మనలను జల్లించుటకు ఎదురు చూస్తున్నాడు అని యేసు ప్రభువు సెలవిచ్చియున్నాడు. అపవాది మరియు ఈ లోకములో ఉండే దుష్టులు, ప్రజలు మనకు విరోధముగా చెడు కార్యములు చేయుట కొరకు ప్రయత్నించుచుండవచ్చును. అయితే, దేవుని అనుమతి లేకుండా, అపవాది యొక్క ఎటువంటి చెడు కార్యములు, ప్రణాళికలు మనలను తాకజాలవు.

బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:6 అయిన ఆ మరుసటి వచనములో, యేసయ్య, పేతురుతో ఈలాగున అన్నాడు, " నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.'' అవును, సీమోను యొక్క విశ్వాసము బలముగా ఉండునట్లుగా యేసయ్య పేతురు కొరకు ప్రార్థించాడు. నా ప్రియులారా, అనేకసార్లు మనము కూడా శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు, మన విశ్వాసమును కోల్పోతామేమో అని అన్నట్టుగా మనము భావిస్తుంటాము. అందుకొరకే, యేసయ్య, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. బైబిల్ నుండి హెబ్రీయులకు 7:25వ వచనములో చూచినట్లయితే, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు '' ప్రకారము యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచు న్నాడు. యేసయ్య, సిలువలో చనిపోయి పునరుత్థానము నొంది, మూడు రోజుల అనంతరము తిరిగి సజీవముగా వచ్చియున్నాడు. ఇదంతయు మనము జీవించులాగున ఆయన ఈలాగున చేసియున్నాడు. 'నేను జీవించునట్లుగా మీరును జీవించెదరు' అని సెలవిచ్చినట్లుగానే, నా ప్రియులారా, యేసయ్య ఎల్లప్పుడు మీ పక్షముగా నున్నాడు. ఎందుకు, మీ కొరకు ప్రార్థించుట కొరకు మాత్రమే. అందుకే బైబిల్ నుండి యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసయ్య, తన శిష్యుల నిమిత్తము ఎల్లప్పుడు ప్రార్థన చేయుచుండెను. ఆలాగుననే, ఆయన మీ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటాడు. అంతమాత్రమేకాదు, ఆయన మీ కొరకు కూడా విజ్ఞాపనము చేస్తూ ఉంటాడు. మీకు మరియు తండ్రికి మధ్య ఆయనే మధ్యవర్తియై యున్నాడు. మీరు ఒక్కరే, లేక ఒంటరిగా యుద్ధము చేయుట లేదు. దేవుడే మీ పక్షమున ఉన్నాడు. ఆయన మీరు పోరాడులాగున మిమ్మును బలపరుస్తాడు. ఎల్లప్పుడు, ప్రభువు నమ్మదగినవాడు. దుష్టుల నుండి మిమ్మును ఆయన కాపాడి భద్రపరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును బలపరచి, దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, దుష్టుని నుండి శ్రమలను ఎదుర్కొంటున్న మా కొరకు నీవు విజ్ఞాపనము చేయుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వము నుండి శ్రమలను అనుభవించుచున్న మమ్మును దుష్టుని నుండి విడిపించుము. యేసయ్య, దుష్టుని నశింపజేయుట కొరకై నీవు ఈ లోకమునకు వచ్చియున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మమ్మును విడిపించడానికై ఇప్పుడు మా మధ్యన కార్యములను జరిగించుము. దేవా, చీకటిని, అంధకారమును, అణిచివేతను తొలగించుము. ప్రభువా, మా యొక్క హృదయ వేదనలన్నిటిని మరియు మా శ్రమలను, కష్టములను అవన్నియు యేసు నామమున తొలగిపోయి, మమ్మును విడిచిపోవునట్లుగా సహాయము చేయుము. దేవా, మేము శ్రమనొందినది ఇక చాలు ప్రభువా, ఇక ఎటువంటి శ్రమలు మాకు విరోధముగా రాకుండా, అవి ఇంకను మమ్మును ఎంతమాత్రమున ఇబ్బంది పెట్టకుండా ఉండునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మా దుఃఖములన్నిటిని సంతోషముగా మార్చుము. ప్రభువా, మాకు విరోధముగా పని చేయుదేనినైను సరే, యేసు నామమున తొలగించి, నీ యొక్క శక్తితో మమ్మును నింపి, మా పోరాటములలో మేము ప్రోత్సహించబడునట్లుగా, సహాయము చేయుము. యేసయ్యా, మా యొక్క అనారోగ్యము మమ్మును విడిచిపోవునట్లుగా కృపను దయచేయుము. దేవా, దుష్టుని యొక్క ప్రతి దుష్ట కుట్ర నుండి మమ్మును రక్షించుము. యేసయ్య నీ ప్రేమతో మరియు క్రీస్తు సహనముతో మా హృదయాన్ని నింపుము. యేసయ్యా, మా బలహీనతలో మరియు మా కష్ట సమయాలలో మా విశ్వాసం ఓటమిపాలు కాకూడదని మా కొరకు విజ్ఞాపనము చేయుచున్నందుకై నీకు వందనాలు. దేవా, మేము నీపై మా పూర్తి నమ్మకాన్ని ఉంచునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మేము కోల్పోయినవాటన్నిటిని మరల రెండంతలుగా పొందుకొనునట్లుగా కృపను అనుగ్రహించి, మమ్మును దీవించుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.