నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనము విధేయతను గూర్చి ధ్యానించబోవుచున్నాము. కొన్నిసార్లు విధేయులముగా ఉండడము చాలా కష్టతరముగా ఉంటుంది. మనము చిన్న పిల్లలముగా ఉన్నప్పటి నుండి పెద్దవారము అయ్యేంతవరకు కూడా తల్లిదండ్రులకు విధేయులము కావడము ఎంతో కష్టముగా ఉంటుంది కదా! అయితే, బైబిల్ గ్రంథములో విధేయత కలిగి ఉండాలని చెబుతుంది. విధేయతను గురించి తలంచినప్పుడల్లా, బైబిల్ గ్రంథములో ఇస్సాకును గురించి నాకు జ్ఞాపకమునకు వస్తుంది. మనము ఒక మేకను బలి ఇవ్వడానికి కొండపైకి వెళ్లుచున్నాము, కట్టెలన్నిటిని తీసుకొనుమని అబ్రాహాము ఇస్సాకుతో చెప్పాడు. అయితే, ఇస్సాకు మదిలో అనేకమైన అనుమానములు రావచ్చును. అయితే, నాకు తెలిసినదంతయు, నా తండ్రికి మరియు దేవునికి నేను విధేయునిగా ఉండాలి అని అనుకున్నాడు. ఇస్సాకు తనకు ఏమియు కూడా తెలియకుండానే, తండ్రిని వెంబడిస్తూ, ఆ కొండపైకి వెళ్లాడు. వారు చూపెట్టినటువంటి విధేయతను బట్టి, ప్రభువు అబ్రాహామును మరియు ఇస్సాకును దీవించియున్నాడు. దేవుని వాక్యము పట్ల చూపెట్టిన ఒక గ్రుడ్డి విధేయతను బట్టి, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా, ఎటువంటి అనుమానములు లేకుండా, వారు దేవునికి విధేయతను చూపించి, ఆయన ఆజ్ఞలకు విధేయతను చూపించారు. సందేహములు లేదా భయము మనలను అవరించకుండా దేవుని వాక్యమును మనము పాటించినప్పుడు, ఆయన ఆశీర్వాదములు తప్పక పొందుకొని అనుభవించగలమని మన పితురుల జీవితములు మనకు బోధించుచున్నవి.
అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 1:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అయితే నీవు నిబ్బరము గలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు'' అని ఖచ్చితముగా చెప్పబడియున్నది. అవును, ఒకటి రెండు కాదు, బైబిల్ గ్రంథములోని ప్రతి ఆజ్ఞలను పాటించినప్పుడు ప్రభువు మిమ్మును దీవిస్తాడు, మీరు విజయవంతులుగా జీవించెదరు. మీరు ఎటువంటి కష్టములోనైనను ఉన్నట్లయితే, ప్రభువు మిమ్మును దేనినైనను చేయమని అడిగినప్పుడు, నా ప్రియ స్నేహితులారా, ఖచ్చితముగా దానిని చేయండి. ఒకవేళ, నా ప్రియులారా, అది ఇప్పుడు మీకు అర్థము కాకపోవచ్చును. మీరు అనుకున్న ప్రణాళికకు అది వ్యతిరేకముగా ఉండవచ్చును. అయితే, మీరు విధేయత చూపెట్టినప్పుడు, మీరు తప్పకుండా దీవించబడతారు. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభువు మిమ్మును చేయమని అడిగినట్లయితే, ఆయనకు విధేయులుగా ఉండండి. కానీ, మీరు దేవుని స్వరమును పాటించాలని ఎన్నుకున్నప్పుడు, ఆయన నిశ్చయంగా మిమ్మును ఆశీర్వదించి, తన శ్రేష్ఠమైన మార్గంలోనికి నడిపిస్తాడు.
మేము కారుణ్యలో నివసించుచున్నప్పుడు, బేతెస్దలో ఉన్న దర్శన కేంద్రము నాకు ఎంతో ఇష్టము. ఏదో ఒక విధంగా ప్రతిరోజు అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తాను. అక్కడ బేతెస్దలో కాపలా కాయుచున్న భద్రత సిబ్బంది అక్కడ చూసినటువంటి దర్శన స్థలము అది. అతను వెళ్లి, డి.జి.యస్. దినకరన్ తాతగారికి చెప్పినప్పుడు, వారు ఆ స్థలమును దర్శన కేంద్రముగా నిర్మించడము జరిగినది. ఇప్పుడు బేతెస్ద అనేకులకు దీవెనకరముగా ఉండిఉంటున్నది. వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో దీవెనకరముగా ఉన్నది. దేవుని బయలుపరచడానికి ఒక వ్యక్తి చూపిన విశ్వాసపూర్వకమైన స్పందనతో ప్రారంభమైన ఆ విషయం, నేడు వేలాదిమంది దేవుని సన్నిధిని అనుభవించుచూ ఆయన స్పర్శను పొందుకునే ఒక ప్రదేశంగా మారింది. అవును, నా ప్రియులారా, విధేయత ఎల్లప్పుడూ మనము ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదములను కలుగజేయుచున్నది.
నా ప్రియులారా, అందుకే ఈ రోజు ప్రభువు ఇలాగున అంటున్నాడు, 'మిమ్మును కూడా దీవించి, విజయవంతులనుగా చేస్తాను.' అవును, నా స్నేహితులారా, ఈ రోజు మీరు దేవునికి విధేయులై ఉంటుండగా, ఆయన మిమ్మును దీవిస్తాడు. ఈనాడు ప్రభువు మీకు అదే వాగ్దానమును ఇచ్చు చున్నాడు. మీరు ఆయన వాక్యమునకు లోబడినప్పుడు, ఆయన మిమ్మును ఆశీర్వదించి, నడిపించి, విజయవంతులనుగా చేయుచున్నాడు. విధేయత చూపడం కష్టంగా అనిపించినప్పుడు కూడా, ఆయనను సంపూర్ణంగా విశ్వసించండి. దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడు కూడా మన అవగాహనకు మించినవి, మరియు ఆయనకు విశ్వాసంగా లోబడుచున్నవారిని ఆయన ఆశీర్వాదములు ఎల్లప్పుడు వెంబడిస్తాయి. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీ వాక్యమునకు విధేయత చూపడం యొక్క ప్రాముఖ్యతను మాకు బోధించినందుకు నీకు వందనములు. దేవా, మాలో సంశయము లేదా సందేహం లేకుండా నీ ఆజ్ఞలను అనుసరించడంలో ఆనందించే విధేయతను మరియు చిత్తానుసారమైన హృదయమును మాకు దయచేయుము. యేసయ్యా, నీ బిడ్డలమైన మేము నీ ఆజ్ఞలను పాటించునట్లుగాను, ఎటువంటి ప్రశ్నను వేయకుండా, నీకు విధేయతను చూపునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము ఏమి చేయాలో మాకు తెలియని పరిస్థితులలో కూడా మేము నీకు విధేయతను చూపునట్లుగా మాకు నీ కృపను చూపుము. ప్రభువా, పరిస్థితులు మాకు విరోధముగా పనిచేయుచున్నప్పటికిని కూడా, మేము నీ వాక్యమునకు విధేయులముగాను మరియు ఓపికతో ఉండునట్లుగాను మాకు సహాయము చేయుము. దేవా, నీ వాక్యమును మేము గట్టిగా పట్టుకొని ఉండునట్లుగాను మమ్మును మార్చుము. ప్రభువా, నేడు మా మీదికి నీవిచ్చు దీవెనలు దిగివచ్చునట్లుగా చేసి, మేము విజవంతులముగా మారునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. దేవా, మమ్మును నీ యొక్క పరిపూర్ణ చిత్తంలోనికి నడిపించి, నీ ఉద్దేశ్యం ప్రకారం మాకు విజయమును అనుగ్రహించి, నీ యొక్క పరిశుద్ధ నామమును మహిమపరచడానికి మా జీవితములను ఉపయోగించుకొనుము. ప్రభువా, నీ ప్రణాళికలు మాకు అర్థం కానప్పుడు లేదా నీ నడిపింపు కష్టంగా అనిపించినప్పుడు కూడా మేము నీయందు నమ్మకముంచడానికి మాకు సహాయము చేయుము. దేవా, మేము నీ పట్ల ఎంతో భయభక్తులు కలిగియుండునట్లుగాను, నీ ఆజ్ఞలకు విధేయులగునట్లుగాను, మా పితరులవలె మేము దీవించబడునట్లుగా అటువంటి కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


