.నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానము బైబిల్ నుండి సామెతలు 3:33వ వచనము ప్రకారం ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆ వచనము, "భక్తిహీనుల యింటి మీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును'' ప్రకారం నీతిమంతుల ఇల్లును ఆయన ఆశీర్వదించునని వాగ్దానము చేయబడియున్నది. అవును, బైబిల్లో, నీతిమంతులకు అనేక ఆశీర్వాదములు మరియు భక్తిహీనులకు అనేక శాపములు కలుగునని సామెతల గ్రంథములో చెప్పబడియున్నది. మనము బైబిల్లో సామెతలు 13:25వ వచనమును చూచినట్లయితే, "నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును'' అని వ్రాయబడియున్నది. మరియు సామెతలు 21:20వ వచనములో చూచినట్లయితే, "విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును'' అని చెప్పబడియున్నది. అవును, నీతిమంతులు ఆశీర్వాదములను పొందెదరు అని లోకము కూడా చెబుతుంది. ప్రభువు దీనులను లేవనెత్తి హెచ్చిస్తాడు. అహంకారుల యెడల ఆయన కోపగిస్తాడు. దావీదు దేవుడైన యెహోవా యెదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. గనుకనే, 2 సమూయేలు 7:8వ వచనమును చూచినట్లయితే, " కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని'' ప్రకారం దేవుడు గొఱ్ఱెల కాపులో ఉన్నటువంటి దావీదును గొఱ్ఱెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు కాపరిగా నియమించాడు. ఆలాగుననే 2 సమూయేలు 7:18వ వచనములో చూచినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, "నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?'' అని చెప్పినప్పుడు, ప్రభువు దావీదును మరియు తన కుటుంబమునంతటిని జ్ఞాపకము చేసుకొని, దావీదు ఇల్లంతటిని ఆశీర్వదించాడు.
ఇంకను బైబిల్లో 2 సమూయేలు 6:11వ వచనములో చూచినట్లయితే, యెహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరిని ఆశీర్వదించెను. ఆలాగుననే, దేవుడు మార్తా యొక్క గృహమును ఆశీర్వదించియున్నాడు. మార్తా ఎల్లప్పుడు తన గృహమును యేసు కొరకు తెరచియుంచినది. యేసు ప్రభువు అనేకసార్లు ఆమె గృహమును సందర్శించియున్నాడు. యేసయ్య, తన గృహములో ప్రవేశించినప్పుడు, ఆమె గృహము ఒక అద్భుతమైన చక్కని గృహముగా మారినది. అవును, నా ప్రియులారా, దైవీకమైన జీవితమును జీవించేవారిని ప్రభువు దీవిస్తాడు. ప్రభువు మాత్రమే మన యింటిని కుటుంబముగాను, గృహముగాను మార్చగలుగుతాడు. ఆయనే మన ఇంటిని నిర్మించుటకు శక్తిగలవాడు.
కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీ కుటుంబములోనికి ప్రభువును ఆహ్వానించండి. దేవుని వాక్యమును మీ కుటుంబములో ఉంచుకొనండి. ప్రభువు యెదుట మిమ్మును మీరు తగ్గించుకొనండి. దావీదు వలె మీ పాపములను ప్రభువు చెంత ఒప్పుకున్నప్పుడు, ప్రభువు మీ యందు ఇష్టము కలిగియుంటూ, ఆయన మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. అపొస్తలుల కార్యములు 16:31వ వచనములో చూచినట్లయితే, "అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు'' అని చెప్పబడిన ప్రకారం మీరు ఆయన యందు విశ్వాసముంచినప్పుడు, మీరును మీ యింటి వారందరు రక్షింపబడుదురు. ప్రభువు మిమ్మును మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు ప్రారంభించినప్పుడు, మీరు కూడా దావీదువలె, ' ప్రభువా, నీవు మమ్మును దీవించుటకు మేము ఏ పాటివారము మరియు మా కుటుంబము ఏపాటిది' అని మిమ్మును మీరు తగ్గించుకుని చెబుతారు. ప్రభువు అనేకమైన విధములుగా మిమ్మును మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోవుచున్నాడని నేను ఎరుగుదును. మీ కుటుంబము మధురమైనటువంటి గృహముగా మారబోతుంది. ప్రభువు మీ గృహమును ఆశీర్వదించి మధురమైన గృహముగా మార్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ గృహమును బహుగా ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
మధురమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై మరియు మమ్మును ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా యొక్క ప్రతి ఒక్క గృహమును మరియు మా ఇంటిని ఆశీర్వదించుము. దేవా, మా యింటిని మాత్రమే కాదుగానీ, మా యింటిలో ఉన్న ప్రతివారందరు నీ ప్రేమగల హస్తము ద్వారా దీవించబడునట్లుగా చేయుము. తండ్రి, మమ్మును జ్ఞాపకము చేసుకొనుము. దేవా, మేము మరియు మా ఇంటి వారందరును యెహోవానైన నిన్ను మాత్రమే సేవించునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, మా యింటివారును యెహోవాను సేవించెదము అని వారు కూడా చెప్పునట్లుగా నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఎటువంటి విభేధాలు ఉండకుండా, మా గృహములను కట్టుము. ప్రభువా, మా గృహములోనికి ప్రవేశించుము, మా గృహములో మనస్పర్థలు మరియు దుఃఖము మా జీవితములో ఉండకుండా, ప్రతి శాపమును దీవెనగా మరియు ప్రతి నష్టమును లాభముగా మార్చి, మా గృహములో ప్రతిదానిని పునరుద్ధీకరించుము. ప్రభువా, మా కుటుంబములో అందరము ఐక్యత, సమాధానమును, ప్రేమను కలిగియుండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు మా హృదయాన్ని మరియు మా ఇంటిని నీకు తెరచుచున్నాము. నీవు వచ్చి మాతో నివసించుము, నీ సన్నిధి మా ఇంటిని నీ శాంతి, ప్రేమ మరియు ఆశీర్వాదాలతో నిండిన గృహంగా మార్చును గాక. దావీదులాగే, మేము నీ ముందు మమ్మును తగ్గించుకుంటున్నాము, మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాము మరియు మమ్మును శుద్ధి చేసి నీ యెదుట మేము సరైనదిగా చేయునట్లుగా మార్చుము. దేవా, దావీదు, ఓబేదు-ఎదోము మరియు మార్తల ఇళ్లను నీవు ఆశీర్వదించినట్లుగానే, నీవు మా ఇంటిని జ్ఞాపకం చేసుకుని నీ మంచితనాన్ని మాపై కుమ్మరించుము. ప్రభువా, నీ వాక్యం మా ఇంట్లో ఉండునట్లుగాను మరియు మా ఇంట్లోని ప్రతి హృదయం నిన్ను విశ్వసించి రక్షింపబడునట్లుగా చేయుము. దేవా, మా ఇల్లు నిజంగా ఒక ఇల్లు, మధురమైన గృహంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీ హృదయమంతటితో మేము దీవించబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ధన్యకరమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.