నా ప్రియమైన స్నేహితులారా, మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 2:15వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము'' ప్రకారం మనము క్రీస్తు సువాసనయై యున్నామని వ్రాయబడియున్నదని పౌలు తెలియజేయుచున్నాడు. మనము 2 కొరింథీయులకు 2:14వ వచనములో చూచినట్లయితే, "మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' అని వ్రాయబడియున్నది. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచునట్లుగా ప్రభువే ఇది మన కొరకు చేయుచున్నాడు. ఆయన మన హస్తములను పట్టుకొని, విజయోత్సవములతో ఊరేగింపజేయుచున్నాడు. క్రీస్తు యొక్క సువాసన అని ప్రభువే మిమ్మును పిలుచుచున్నాడు. పాత కాలములో అనేక పట్టణములను జయించిన తర్వాత, రాజులు విజయోత్సవముతో ఊరేగింపబడేవారు. ఆ ఊరేగింపు సమయములో వారు «ధూపమును కూడా వేస్తుండేవారు. వారు దోపిడి చేసి తీసుకొని వచ్చిన సంపదనంతటిని ప్రదర్శించేవారు. వారు ఆలాగున ఊరేగింపుగా వెళ్లుచుండగా, ప్రజలందరు వారిని ఉత్సాహపరచుచుండేవారు. అందుకే పౌలు అంటున్నాడు, 'మీరే ఆ సువాసనయై యున్నారు.' కనుకనే, నీతి గల జీవితమును జీవించుచుండగా, క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లే అవకాశము మనము కలిగియున్నాము.

నా ప్రియులారా, మనము నీతిగల జీవితమును జీవించుట ఎంతో ప్రాముఖ్యమై యున్నది. అనగా, ప్రభువును మన యందు కలిగి ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనది. పాత నిబంధన కాలములో ఆహరోను మరియు యాజకులు అభిషేకపు తైలముతో అభిషేకించబడేవారు. ఆ నూనె వారి తల మీద పోయబడి, వారి గడ్డం మీదుగా, వారి వస్త్రముల మీదుగా కారుచుండేది. కాబట్టి, వారి ద్వారా సువాసనను వెదజల్లుచుండేవారు. కాబట్టి, బైబిల్ నుండి యెహెజ్కేలు 20:41వ వచనములో చూచినట్లయితే, "జనములలో నుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనుల యెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ సువాసన అనగా ఏమిటి? బైబిల్ నుండి యెషయా 11:3వ వచనములో చూచినట్లయితే, "యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును'' అని వ్రాయబడియున్నది. కనుకనే, మనం దేవుని యందు భయభక్తులతో జీవించినప్పుడు, మనం ఆయనకు ఇంపైన సువాసనగా మార్చబడతాము.

నా ప్రియులారా, యేసు యొక్క గుణములను ప్రతిబింబించే విధంగా మీరు జీవించడానికి పిలువబడియున్నారు. క్రీస్తువలె జీవించుట ద్వారా మనము ఈ లోకమంతటికిని సువాసనను వెదజల్లుతాము. బైబిల్ నుండి సామెతలు 27:9 వ వచనములో చూచినట్లయితే, "తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును...'' అని చక్కగా వివరించబడియున్నది. అవును స్నేహితులారా, మీ చుట్టు ఉన్నవారికి ఆనందమును తీసుకొని వచ్చు సువాసనవలె ప్రభువు మిమ్మును కూడా ఉపయోగించును గాక. తన సన్నిధితోను మరియు దైవ జ్ఞానముతోను ప్రభువు మిమ్మును నింపును గాక. ఆయన వలె మిమ్మును ప్రభువు మార్చును గాక. నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును సువాసనగా మార్చి, ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానముగా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ పరిమళ సువాసనగా నింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్లినను, మేము ఏమి మాట్లాడినను, మా చుట్టు ఉన్న ప్రజలకు సంతోషము చేకూర్చునట్లుగా, క్రీస్తు సువాసన వలె మేము మారునట్లుగా కృపనిమ్ము. ప్రభువా, యేసుతో మేము నింపబడు జీవితమును మాకు అనుగ్రహించుటకు ఇప్పుడే నీ సన్నిధినిమాతో ఉంచుము. దేవా, మా జీవితములో అనవసరమైన విషయాలన్నిటిని తొలగించి, నీవలె మమ్మును మార్చుము. యేసయ్యా, మేము నీ యందు భయభక్తులు కలిగియుండుటకు, మేము నీ జ్ఞానము యొక్క సువాసననుగా మమ్మును మార్చుము. దేవా, క్రీస్తు సువాసనగా మమ్మును పిలిచినందుకు వందనాలు. యేసయ్యా, మా జీవితం నీ సౌందర్యము, కృప మరియు నీతిని ప్రతిబింబించునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మమ్మును నీ సన్నిధితో నింపి, నీ సత్యంలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, మేము మాట్లాడే ప్రతి మాట మరియు మేము చేయుచున్న ప్రతి కార్యములు క్రీస్తు సువాసనను కలిగి ఉండునట్లుగా చేయుము. దేవా, నీ పట్ల భయభక్తులతో జీవించడానికి మరియు మా చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని మరియు నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీకు ఇష్టమైన వారముగాను మరియు లోకానికి ఆశీర్వాదంగా మార్చుమని యేసుక్రీస్తు మధురమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.