నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 12:13వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " మీరున్న యిండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మీ మీదికి ఏ తెగులును రాకుండా మిమ్మును కాపాడతానని ఈ నూతన మాసములో మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. నా ప్రియులారా, మనకు ఇది ఎంత ధన్యకరమైన వాగ్దానముగా ఉంటున్నది కదా!
నా ప్రియులారా, ' ఇశ్రాయేలీయుల వారి ఇండ్ల ద్వారబంధముల మీద రాయబడిన ఆ రక్తమును చూచి, నేను దాటిపోతాను, ఏ తెగులు మీకు రానీయ్యను' అని ప్రభువు వాగ్దానము చేసియున్నాడు. ఆ విధంగానే, ప్రభువు వారికి దైవీకమైన కాపుదలను అనుగ్రహించియున్నాడు. ప్రభువు ఇశ్రాయేలీయులను ఎంతగానో ప్రేమించి, వారిని సంరక్షించియున్నాడు. వారు, వారి యొక్క ఇండ్ల ద్వారబంధముల మీద రాయబడియున్న దేనిచేత కాపాడబడలేదు గానీ, దేవుని యొక్క రక్తముచేత వారు కాపాడబడియున్నారు. రాయబడిన గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము సిలువపైన రక్తము కార్చిన యేసయ్య యొక్క రక్తమునకు సూచనగా ఉన్నది. యేసయ్య యొక్క రక్తము ద్వారా మనము రక్షణను పొందుకొనియున్నాము. నా ప్రియులారా, మన యొక్క స్వనీతి మనలను ఎంత మాత్రము రక్షింపజాలదు. మనము కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే రక్షింపబడతాము. అందుకే బైబిల్ నుండి లేవీయకాండము 17:11వ వచనమును చూచినట్లయితే, " రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును'' అని చెప్పబడినట్లుగానే, రక్తము మన ప్రాణమునకు ప్రాయశ్చిత్తము చేయుచున్నది. అందుకే బైబిల్ నుండి మత్తయి 26:28వ వచనములో చూచినట్లయితే, " ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము'' అని చెప్పబడినట్లుగానే, రక్తము చిందించుట ద్వారానే, దేవుడు మన పాపములను క్షమిస్తాడు. ఆయన సిలువ మీద తన స్వరక్తమును కార్చుట ద్వారా యేసయ్య మన పాపములన్నిటిని క్షమించియున్నాడు. ఆయన రక్తము ద్వారా మనము క్షమించబడియున్నాము. మరియు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము కొనబడియున్నాము. యేసయ్య యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా మనము విమోచింపబడియున్నాము. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము స్వస్థపరచబడియున్నాము. సిలువ మీద కార్చిన తన స్వరక్తము ద్వారా ప్రభువు మనలను విమోచించి, రక్షణలోనికి నడిపిస్తాడు. సిలువ మీద కార్చబడిన రక్తమును దేవుడు జ్ఞాపకము చేసుకున్న ప్రతిసారి ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని, మన బంధకముల నుండి మనలను విడిపిస్తాడు.
మా చిన్న తమ్ముడైన ఆనంద్‌కు ఒకసారి తన నాలుక మీద బొబ్బలు వచ్చినవి. అతడు వేడి వేడి పాలను త్రాగడము వలన తన నాలుక కాలిపోయి బొబ్బలు రావడము జరిగినది. అతడు ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ నొప్పిని అతడు భరించలేకపోయాడు. అతడు ఏమి తినలేకపోయాడు, అస్సలు ఏమి తాగలేకపోయాడు కూడా. ఆ నొప్పితోను, బాధతోను బాధపడుచున్నప్పుడు, మా తమ్ముడు, మా అమ్మగారికి ఫోన్ చేసి, 'అమ్మా, దయచేసి, నా నాలుక మీద ప్రార్థన నూనెను రాయమని అతడు కోరాడు.' అతడు యేసయ్య రక్తము మీద విశ్వాసముంచియున్నాడు. ఇంకను మా అమ్మగారితో, మా తమ్ముడు ఈలాగున చెప్పియున్నాడు, 'అమ్మా, నా నాలుక మీద ఆ ప్రార్థన నూనెను రాసినట్లయితే, రేపు ప్రొద్దునకంతా నేను స్వస్థతను పొందుకుంటాను' అని చెప్పియున్నాడు. అతడు అంతగా విశ్వసించియున్నాడు. యేసయ్య యొక్క త్యాగము మీద అతడు ఎంతగా విశ్వాసముంచియున్నాడు కదా! అద్భుతరీతిగా అతని యొక్క విశ్వాసముచొప్పుననే, ప్రభువు అతనిని తాకి మరుసటి రోజు ఉదయమునకల్లా అతనిని స్వస్థపరచియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, యేసయ్య యొక్క రక్తము మన ఆశీర్వాదములకు సూచనయై ఉంటున్నది. అదేవిధముగా, అనేకమంది తల్లులు, స్త్రీలు యేసయ్య యొక్క రక్తము ద్వారా అద్భుతములు జరుగుచున్నందున విశ్వాసముతో ప్రార్థనా గోపురములో నుండి ప్రార్థనా నూనెను తీసుకొని వెళ్లడము నేను చూచియున్నాను. ఆ రక్తమును వారి యొక్క ద్వారకమ్ముల మీద వారు రాస్తారు. వారి బిడ్డలకు అది రాస్తారు. మద్యమునకు బానిసలైన వారి భర్తల తలల మీద ఆ నూనె రాస్తారు. వారి జంతువులు స్వస్థతను పొందాలని యేసయ్య యొక్క రక్తముగా ఉన్నటువంటి నూనెను వాటికి రాస్తారు. మరి కొందరైతే, దేవుడు వారి ఆహారమును ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో ఆ నూనెను వారి ఆహారములో కొద్దిగా పోస్తారు. అవును, నా ప్రియులారా, యేసయ్య యొక్క రక్తము ద్వారా మనము కాపాడబడతాము మరియు స్వస్థపరచబడతాము. కనుకనే, ఈ రోజు దేవుని యొక్క హస్తము మీ మీదికి దిగివచ్చును గాక. ఈ రోజు మేకులు కొట్టబడినటువంటి యేసయ్య హస్తము మీ మీదికి దిగివచ్చి, మీ వ్యాధులన్నిటిని స్వస్థపరచును గాక. నేడు మన ప్రాణమునకు ప్రాయశ్చిత్తమైన యేసయ్య కార్చిన రక్తము వైపు మన దృష్టిని మరల్చుదాము. నేటి వాగ్దానము నుండి మనము దీవెనలను పొందుకుందాము.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీవు మా కొరకు సిలువపై నీ అమూల్యమైన రక్తమును కార్చినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, రక్తమును చూచి, ' నేను మిమ్మును దాటిపోతాను, మీరు చావకుండా, బ్రతుకుతారు' అని చెప్పినట్లుగానే, నీ రక్తము లో జీవము ప్రాణము ఉన్నది గనుకనే, నీ రక్తములో ఉన్న శక్తి ద్వారా మాకు క్షమాపణ, కాపుదల, స్వస్థత మరియు జీవమును అనుగ్రహించుము. దేవా, మా యొక్క రుగ్మతులన్నిటిని తాకి, మాలో ఉన్న ప్రతి వ్యాధిని, తెగులును, క్యాన్సర్‌ను, కణితిని, రక్త రుగ్మతలను మరియు బలహీనతలను స్వస్థపరచు ము. ప్రభువా, మా శరీరములో ఉన్న ప్రతి అవయవములు సరిగ్గా పని చేయునట్లుగాను మరియు సృజనాత్మకమైన అద్భుతములు ఇప్పుడే జరుగునట్లుగా కృపను చూపుము. దేవా, మాలో వంగియున్న వ్రేళ్లను, సరిగ్గా ఏర్పడని ఎముకలను, బాధింపబడిన నరములను, మెదడు రుగ్మతలను, నాలుక మరియు గొంతు వ్యాధులను స్వస్థపరచుము. ప్రభువా, మా శరీరములో ఉన్న ప్రతి అనవసరమైన బలహీనత తొలగిపోవునట్లుగా చేయుము. యేసయ్యా, నీ రక్తములో ఉన్న శక్తి ద్వారా మేము ఇప్పుడే పునరుత్థానమును పొందుకొనునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని, బాధలో ఉన్న మమ్మును స్వస్థపరచుము. దేవా, మా వ్యాధుల నుండి నిరీక్షణ కోల్పోకుండా, మేము మృతి చెందకుండా సజీవులుగా ఉండే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, ఈ రోజే నీ యొక్క స్వస్థపరచు శక్తిని మేము అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


