నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భముగా, ఉపాధ్యాయులందరికి నా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. చూడండి, నేడు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానము ఇచ్చియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 118:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను'' అని ఒక అద్భుతమైన లేఖన వచనము సెలవిచ్చుచున్నది. ఇదే కీర్తనలు 18:6వ వచములో అదే విషయము చెప్పబడియున్నది, "నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను'' ప్రకారం మీరు దేవునికి మొఱ్ఱపెట్టండి, నిశ్చయముగా దేవుడు మీకు జవాబును ఇస్తాడు. అదేవిధముగా, 2 సమూయేలు 22:4-7వ వచనములలో మనము ముఖ్యముగా 2 సమూయేలు 22:4వ వచనమును చూచినట్లయితే, "కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను'' మరియు 2 సమూయేలు 22:7వ వచనములో చూడండి, "నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను'' ప్రకారం ఇది ప్రార్థనయై యున్నది. నా ప్రియ స్నేహితులారా, ప్రార్థన అనగా ప్రభువుతో మాట్లాడడము. కనుకనే, మీ హృదయాన్ని తెరచి, మీ హృదయములో ఉన్న అవసరతలన్నిటిని ప్రభువు చెంత కుమ్మరించడమే ప్రార్థనయై యున్నది.
బైబిల్‌లో భక్తుడైన యోనాను చూడండి. యోనా ఒక దైవసేవకుడై యున్నాడు. అతడు దైవసేవకుడుగా ఉన్నప్పటికిని తను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడు వేటిని కూడా సహింపజాలక పోయెను. యోనా 2:2వ వచనములో చూచినట్లయితే, " ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు'' ప్రకారం అతడు దేవునికి మనవి చేసెను. యోనా జీవితమును గురించి మీకు తెలుసా? అతడు మత్స్యము కడుపులో నుండి ఎలాగున రక్షింపబడ్డాడు? అతడు మరల అభిషేకమును పొందుకొని, ఆయన మహిమార్థముగా ఎలా వాడబడ్డాడో? చూడండి. కష్టాలు ఉపద్రవములు అన్నిటిని మన జీవితములో ఎదుర్కొన్న ప్రతిసారి, ఆయన చెంతకు వచ్చి, ఆయన వైపు చూడాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని ఆయన వాగ్దానము చేసియున్నాడు. కనుకనే, మీరు నోరు తెరచి, ఆయనతో మాట్లాడండి, మీ హృదయములో ఉన్న వేదన మరియు దుఃఖమునంతటిని ఆయన యెదుట కుమ్మరించండి, అదియే ప్రార్థనయై యున్నది.
బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:10వ వచనములో చూచినట్లయితే, " నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను'' అని పౌలు చెబుతున్నాడు. నా ప్రియులారా, ఈ లోకములో మనము శ్రమలను, సమస్యలను ఎదుర్కొంటుండవచ్చును. మరి ముఖ్యముగా దైవసేవకులు అనేకమైన శ్రమలను ఎదుర్కొంటుండవచ్చును. కానీ, ధైర్యము వహించండి. అన్నిటిని ప్రభువు హస్తాలకు సమర్పించడము నేర్చుకొనండి. ఇప్పుడు కూడా ప్రార్థించి ప్రభువు హస్తాలకు సమస్తమును సమర్పిద్దామా? ఆలాగున నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఇరుకు నుండి మీరు మొఱ్ఱపెట్టినప్పుడు, విశాల స్థలమందు మీకు ఉత్తరమిచ్చి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రసశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ ప్రేమపూర్వక వాగ్దానానికి నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము కష్టతరమైనప్పుడు, నీకు మొరపెట్టగలిగినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మా ప్రార్థన ఆలకిస్తావనియు, నీవు యోనా మొఱ్ఱను ఆలకించి, అతనిని మత్స్యము కడుపులో నుండి కాపాడి, అతని మొఱ్ఱలకు జవాబిచ్చినట్లుగా, మరియు నీవు దావీదును విశాలమైన స్థలానికి లేవనెత్తినట్లుగా ప్రభువా, ఈరోజు మా ప్రతి భారం, ప్రతి బాధ మరియు ప్రతి భయం నుండి మమ్మును కూడా లేవనెత్తుము. దేవా, ప్రార్థనలో మా హృదయాన్ని నీ యెదుట కుమ్మరించడానికి, నీ నిరంతర ప్రేమను విశ్వసించడానికి మరియు మా బలహీనతలో నీ బలాన్ని కనుగొనడానికి మాకు నేర్పుము. ప్రభువా, మేము మా ప్రతి శోధనలు మరియు శ్రమను నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. దేవా, నీ పరిపూర్ణ సమాధానము, నీ ధైర్యం మరియు నీ ఆనందంతో మరియు బలముతో మమ్మును నింపుము. ఎందుకంటే, నీవే మా విమోచకుడివి మరియు మా గానము నీవే. దేవా, మేము అనేకమైన కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొంటున్నాము, కనుకనే, మా ప్రతి సమస్య నుండి మమ్మును బయటకు తీసుకొని వచ్చుటకు నీవు మాత్రమే సమర్థుడవు. దేవా, మేము మా కష్టాల నుండి మమ్మును విడిపించుమని నీకు మొఱ్ఱపెట్టుచున్న మా మొఱ్ఱను ఇప్పుడు ఆలకించి, మాకు జవాబును దయచేయుము. ప్రభువా, మరిముఖ్యముగా నీ సేవ చేయుచున్న మా ప్రార్థనను ఆలకించి, మా శ్రమల నుండి మమ్మును విడిపించి, నీ యొక్క ఆదరణ అంతటిని మాకు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.