నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎజ్రా 8:22వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును'' అని చెప్పబడిన ప్రకారము అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువుతో మనము అన్యోన్యసహవాసమును కలిగియుంటూ, మనము ఆయన వైపు చూడాలి మరియు మనము ప్రభువును గట్టిగా హత్తుకోవాలి. ఆయనతో మాట్లాడాలి. ఆవిధంగా మనము ప్రభువుతో అన్యోన్యసహవాసమును కలిగియుండాలి. ఆలాగుననే భక్తుడైన దావీదు ప్రభువుతో అన్యోన్యసహవాసమును కలిగియుండెను. అందుకే బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 29:12వ వచనములో చూచినట్లయితే, "ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే'' అని చెప్పబడిన ప్రకారము ఐశ్వర్యమును గొప్పతనమును ప్రభువు వలన మాత్రమే కలుగుతుంది. కనుకనే, మీ యొద్ద ఏమియు లేనప్పటికిని, మీరు ప్రభువును వెదకండి, ఆయన యొద్ద ఉన్న గొప్పతనమును, ఐశర్యమును అనుభవించండి.

నా ప్రియులారా, దావీదు ఒక గొఱ్ఱెల కాపరి మాత్రమే. కానీ, ప్రభువు అతనిని రాజుగా ఆశీర్వదించియున్నాడు. దేవుడు అతనిని ఒక గొప్ప రాజుగా ఆశీర్వదించాడు. దావీదు ఈ ఆశీర్వాదమును ఎలా పొందుకున్నాడు? ప్రభువును ఎలా వెదికాడు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 55:17వ వచనములో చదివినట్లయితే, "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును'' అని చెప్పబడిన ప్రకారము దావీదు దేవునిని మూడు వేళల వెదకియున్నట్లుగా మనము చూడగలము. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 63:1వ వచనములో చూచినట్లయితే, "దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును'' అన్న వచనము ప్రకారము దావీదు వేకువనే దేవుని వెదికాడని భక్తుడు అంటున్నాడు. కాబట్టి, అటువంటి గొప్ప నిరీక్షణ దావీదు కలిగియుండెను. అందుకే దావీదు, 'దేవా, నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను' అని చెప్పబడి ఉన్నట్లుగానే, అవును, మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు. కాబట్టి, దావీదు తన పూర్ణ హృదయముతో ప్రభువును వెదికాడు. అదేవిధముగా, నా ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడైనప్పటికిని తండ్రిని ఎంతో జాగ్రత్తగా ప్రార్థనలో వెదికాడు. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 1:35వ వచనములో చూచినట్లయితే, "ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను'' అని చెప్పబడిన ప్రకారము వేకువ జామున యేసు ప్రభువు తన తండ్రిని వెదికాడని తెలియజేయబడియున్నది.

నా ప్రియులారా, అవును, యేసు ప్రభువు, తండ్రిని వెదకినట్లుగానే, మనము కూడా మన పూర్ణ హృదయములతో ఆయనను వెదకాలి. నా స్నేహితులారా, ఆలాగుననే, మీరు కూడా వేకువనే లేవండి, 4 గంటలకు లేచి, ఆయన పాద సన్నిధిలో కూర్చోండి, ఆయన మహిమార్థమై పాడండి. దేవుని వాక్యమును చదవండి. అంతమాత్రమే కాదు, మీ హృదయ లోతులలో నుండి ప్రభువును మహిమపరచండి. అప్పుడు మీరు అద్భుతమైన రీతిలో దేవుని శక్తితోను, సన్నిధానముతో నింపబడతారు. నా ప్రియులారా, మీ హృదయవాంఛలన్నిటిని ప్రభువు సన్నిధిలో సమర్పించినప్పుడు దేవుని హస్తము మీ మీదికి దిగివస్తుంది. మీరు అత్యధికంగా ఆశీర్వదింపబడతారు. కనుకనే, మీరు దేవుని పాద సన్నిధికి వచ్చి, 'ప్రభువా, నేను నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకాలి అని అనుకుంటున్నాను' అని చెప్పండి. అంతమాత్రమే కాదు, 'యేసయ్య నీ వలననే నేను తండ్రిని నా పూర్ణ హృదయముతో వెదకాలి' అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీరు కూడా దావీదు వలె దీవించబడినవారుగా మార్చబడతారు. నేటి, వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ, నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము ఇప్పుడే నీ సన్నిధానమునకు వచ్చుచున్నాము. తండ్రీ, మా జీవితంపై నీ దయగల హస్తం ఉంచినందుకు నీకు ధన్యవాదాలు. ప్రభువా, నేడు నీవు మా మొఱ్ఱలను ఆలకించుము. ప్రభువా, మేము నీతో అన్యోన్యసహవాసమును కలిగియుండాలని అనుకుంటున్నాము, ఇప్పుడు మాకు అటువంటి సహవాసమును దయచేయుము. దేవా, ఉదయముననే లేవగలిగే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము నీకు మొఱ్ఱపెట్టినప్పుడు, మా అవసరతలన్నియు తీర్చుము. దేవా, మా హృదయమంతటితో నిన్ను వెదకడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీ వలె మేము కూడా ఉదయాన్నే లేచి నీ పాదాల వద్ద కూర్చోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, దయచేసి నీ శక్తితో మరియు నీ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, నీ కుడి చేయి మమ్మును ఎల్లప్పుడు పైకి లేవనెత్తునట్లుగా కృపను దయచేయుము. దేవా, మా జీవితంలోని అన్ని వేళల నిన్ను హత్తుకొని ఉండటానికి మాకు నేర్పించుము. యేసయ్య, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన మేము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, దయచేసి మా జీవితాన్ని నీ మహిమకు సాక్ష్యంగా మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.