నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయం మిమ్మును పలకరించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 16:19వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను'' ప్రకారం నేడు పరలోక రాజ్యపు తాళపు చెవులను దేవుడు మీకివ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. అసలు పరలోక రాజ్యము అనగా అర్థము ఏమిటి? పరలోక రాజ్యము అనగా ప్రభువుకు సంబంధించిన విషయములను అది మనకు సూచిస్తుంది. అంతమాత్రమే కాదు, ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులను మనకు ఇస్తాడు. ఈ తాళపు చెవులు మనకు మూడు విషయాలను తెరచుటకు మనకు ప్రవేశమును అందిస్తుంది.
మొట్టమొదట, మత్తయి సువార్త 16వ అధ్యాయములో ఉన్న వాక్యమును మనము చదివినట్లయితే, అందులో యేసుక్రీస్తు, శిష్యులను పశ్నించుట మనము చూడగలము. మత్తయి 16:15లో చూచినట్లయితే, "అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను'' "అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.'' అవును యేసుక్రీస్తు 'మెస్సీయ' అని అతడు గుర్తెరిగియున్నాడు. ఆలాగున అతడు తెలియజేసినప్పుడు, యేసు ప్రభువు పేతురుతో ఈలాగున సెలవిచ్చాడు, "అందుకు యేసు సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలుపరచలేదు. కనుకనే, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీ కిచ్చెదను'' అని చెప్పాడు. తద్వారా దేవునికి సంబంధించిన విషయాలకు అతనికి ప్రవేశము ఇవ్వబడినది. అవును, నా ప్రియులారా, ఈ రోజున మనము యేసయ్యను, జీవముగల దేవునిగా గుర్తెరిగినప్పుడు, దేవుని విషయాలకు మనకు ప్రవేశము కలుగతుంది. మనము ఆయనతో సంబంధము కలిగి ఉంటాము. జీవముగలిగిన దేవుని యెడల మనకు ప్రవేశము కలుగుతుంది.
రెండవదిగా, ఈ తాళపు చెవులు, మనకు అధికారమును ఇస్తాయి. ఆ అధికారముతో మనము ఏమి చేయగలము? అని చూచినట్లయితే, అదే వాక్యమును మనము మత్తయి 16:19వ వచనములో రెండవ భాగమును చదివినట్లయితే, "నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు ను బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు ను విప్పబడునని చెప్పెను'' ఈ అధికారము ద్వారా మనకు వ్యతిరేకముగా వచ్చు అన్నిటిని బంధించే అధికారమును ప్రభువు మనకు అనుగ్రహించుచున్నాడు. దేవుని శక్తితో మనము ఏది పలికిన ప్రభువు దానిని జరిగింపజేస్తాడు. అందుకే లేఖనములో, "నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అని ప్రభువు అంటున్నాడు. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులను మనము కలిగియున్నప్పుడు, మనకు సమస్త అధికారము ఉంటుంది. యేసుక్రీస్తు నామమున మనము ఏది అడిగినను, ఆయన దానిని జరిగిస్తాడు.
మూడవదిగా, ఈ తాళపు చెవులు మనకు జ్ఞానమును ఇస్తాయి. మన స్వంత శరీర రక్తమాంసములో మనము చూచినట్లయితే, మనకు అన్ని అసాధ్యముగానే కనిపిస్తాయి. మనము ఏదైన శ్రమలలో చిక్కుకున్నప్పుడు, నిరాశ చెందుతాము. ఎందుకనగా, తరువాత ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. అయితే, పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు మనము కలిగియున్నప్పుడు, ఆ తరువాత ఏమి జరుగబోతుంది అనే జ్ఞానమును మనము కలిగియుంటాము. దైవీకమైన జ్ఞానమును మనము కలిగియుంటాము. ఆ తర్వాత ఏమి జరుగబోతుందో మనకు ముందుగా తెలుపబడుతుంది. అవును, మీరు ఆయనతో అనుసంధానము కలిగియున్నప్పుడు, ప్రభువు మీకు అది తెలియపరుస్తాడు. అయితే, " నీవు జీవముగల దేవుని కుమారుడవు'' అని పేతురు చెప్పినప్పుడు కూడా, అది దైవీకమైన జ్ఞానముతోనే చెప్పబడినది. అది అతని స్వంత శరీరముతోను, జ్ఞానముతోను కాదు, అది పరలోకపు తండ్రి చేత అతనికి తెలియజేయబడినది. కాబట్టి, ఈ పరలోకపు రాజ్యము తాళపు చెవులు మీరు కలిగియున్నప్పుడు ప్రభువు మీకు అనేక విషయాలను తెలియజేస్తాడు.
నా ప్రియులారా, అయితే, ఈ పరలోకపు రాజ్యపు చెవులను ఏలా పొందుకోవాలి? దేవుని విషయాలను ఎలా తెలుసుకోవాలి? మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన ఎవరో గుర్తించాలి. ఆయనతో అనుసంధానము కలిగి ఉండాలి. ఆయనతో మీ నడవడి యథార్థముగా ఉండాలి. మీరు మీ జీవితములో యథార్థముగా మరియు నీతిగా జీవించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు పరలోకపు రాజ్యము తాళపు చెవులు మీకిస్తాడు. మీ జీవితములో ఏమి జరుగబోతుందో మీరు తెలుసుకోవాలని ఆశ కలిగియున్నారా? తర్వాత ఏమి జరుగుబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ కళ్లతో చూసేవాటికి తదుపరి ఏమున్నదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, నిశ్చయముగా పరలోకపు రాజ్యము తాళపు చెవులు మీకు ఎంతో అవసరము. ప్రభువు ఆ విషయములన్నిటిని కూడా మీకు తెలియపరుస్తాడు. పరలోక రాజ్యములో, ప్రవేశము, అధికారము, జ్ఞానమును మీరు కలిగియుంటారు. మీ జీవితమును గురించి మాత్రమే కాదు, ఇతరుల కొరకు జీవితములో పరలోకపు రాజ్యపు తలుపులు తెరిచే అధికారమును మీకిస్తాడు. సువార్తను ప్రకటించాడానికి, వారి జీవితములో దేవుని ప్రణాళికలను తీసుకొని రావడానికి మరియు నెరవేర్చడానికి, దేవుడు మీకు అధికారమును ఇవ్వాలంటే, నేడే మిమ్మును మీరు దేవుని హస్తములకు సమర్పించుకొని, ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే, నిశ్చయముగా, ఆయన పరలోకపు తాళపు చెవులు మీకిచ్చి, నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ రాజ్యానికి తాళపు చెవుల మాకిస్తానని వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు. దేవా, యేసును మెస్సీయగా, జీవముగల దేవుని కుమారునిగా మేము అంగీకరించుచున్నాము. ప్రభువా, నీ యొక్క దైవీకమైన సాన్నిధ్యాన్ని మరియు నీ పవిత్ర మార్గాలను మాకు ప్రాప్తింపజేయుము. దేవా, ఈ భూమిపై చెడును బంధించి నీ చిత్తాన్ని విడుదల చేయడానికి మమ్మును నీ యొక్క అధికారతముతో నింపుము. ప్రభువా, యేసు నామంలో మేము ప్రార్థించే ప్రతి మాట పరలోక శక్తిని కలిగి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మాకిచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుటకు మా కళ్ళు తెరువుము, నీ ఆత్మ ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా స్వంత దృష్టి తగ్గినప్పుడు మాకు దైవిక అంతర్దృష్టిని అనుగ్రహించుము మరియు మేము ఇతరుల కోసం నీ రాజ్యాన్ని తెరవజేయడానికొరకై, వారిని నీ సత్యంలోనికి తీసుకురావడానికి మమ్మును ఉపయోగించుకొనుము. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీతో అనుసంధానంగాను, యథార్థతగాను, పరిశుద్ధంగాను మరియు నమ్మకంగాను ఉండనట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు అధికారముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.