నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 36:9 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము'' ప్రకారం సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు, ఆధారము ప్రభువే అయి యున్నాడు. ప్రభువుతో మాత్రమే మనము జీవితాన్ని ఆనందించగలుగుతాము. అందుకే, యోహాను 10:10వ వచనములో మనము చూచినట్లయితే, "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' ప్రకారం యేసు ప్రభువు, 'జీవమును మరియు సమృద్ధి జీవమును ఇచ్చుట కొరకు నేను మీ యొద్దకు వచ్చియున్నాను, ' అని అదే చెబుతున్నాడు. ప్రభువు ఎంతో ధారాళముగా ఇచ్చువాడు. ఆయన మనకు సమృద్ధియైన సంతృష్టికలిగిన జీవితమును ఇవ్వాలని మన పట్ల ఆశించుచున్నాడు. ఇంకను యోహాను 14:6లో చూచినట్లయితే, "యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' ప్రకారం ఆయనే జీవమును మరియు జీవాహారమునై యున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 6:35 వ వచనములో చూచినట్లయితే, అందుకు యేసు, "జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు''అని సెలవిచ్చెను. నిజమైన జీవము కలిగియుండడము అనగా, దేవుని జీవమును మన ఆత్మలో కలిగియుండడమే. అందుకే ఆయన, "ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?'' అని దేవుని వాక్యము చెబుతున్నది. ఈ లోక ప్రజలు అనేకమైన ధనధాన్యములు కలిగి గొప్పగా జీవించుచుండవచ్చును. అనేకమంది ప్రజలు వారి యొక్క జీవశైలిని అనుకరించవచ్చును. అయితే, అటువంటి వారి ప్రాణమును కోల్పోయినట్లయితే, దాని వలన వారికి ఏమి ప్రయోజనము? యేసు లేని ప్రాణమును దేనిని కూడా సాధించజాలదు. అయితే, మన యందు యేసును కలిగియున్నప్పుడు, యేసుతో పాటు మన జీవితమును ఆనందించగలుగుతాము.

అందుకనే, బైబిల్ నుండి యోహాను 4:14వ వచనములో చూచినట్లయితే, యేసు, "నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పెను.'' అవును, నీటి బుగ్గలోని నీరు ఎప్పుడు ఉబుకుచుంటుంది. ఆ విధంగా మనము యేసునందు జీవమును కలిగియున్నప్పుడు, మనము నిత్యము సంతోషముతో ఉప్పొంగుతాము. ఈ లోకములో మాత్రమే కాదు కానీ, పరలోకములో కూడా మనము యేసునందు ఆనందించేవారముగా ఉంటాము. 'నిత్యజీవమునకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండెదనని' యేసయ్య అన్నారు. అయితే, యేసయ్యా, మనలో లేకపోయినట్లయితే, ఈ లోక పాపపు బానిసత్వము మరియు భారముచేత మనము నలిగిపోతూ ఉంటాము. బైబిల్ నుండి యోహాను 3:3 వ వచనములో చూచినట్లయితే, "అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.'' అనగా, యోహాను 3:8వ వచనములలో చెప్పబడినట్లుగానే, "...ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను'' ప్రకారము ఒకడు ఆత్మమూలముగా మరల జన్మించాలని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మనము దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ఆనందముతోను, మహిమతోను పొంగిపొర్లునంతగా నింపబడతాము. అవును, దేవుని యందు నిత్యజీవపు ఊటగలదు. ఈ రోజు ఆ జీవజలములను మీకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయనను పొందుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? నా ప్రియ స్నేహితులారా, ఆయన ఆత్మను మీకిమ్మని ఆయనను అడగండి. దేవుని రాజ్యములో ప్రవేశించునట్లుగా ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, మీరు ఆయనతో నిరంతరము నివసించగలరు. దేవుని ఆత్మచేత అది సాధ్యమై యున్నది. మీ యందు దేవుని ఆత్మ లేకుండా, మీరు ఎంతమాత్రము దేవుని రాజ్యములోనికి ప్రవేశింపజాలరు. యేసు ప్రభువు, మరల ఈ లోకమునకు రానైయున్నాడు. ఆయన వచ్చినప్పుడు, మనము ఆయనను స్వీకరించడానికి సిద్ధపడినవారముగా ఉండాలి. ఐదుమంది బుద్ధిగల కన్యకలను గురించి బైబిల్‌లో మనకు తెలియజేయబడియున్నది. వారు తమ దివిటీలు వెలుగుతూ, సిద్ధముగా ఉన్నారు. వారు సిద్దెలలో నూనెను కలిగియున్నారు. 'నూనె' అనగా, దేవుని ఆత్మకు సూచనగా ఉన్నది. కనుకనే, పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు వారు ఎంతో సిద్ధపడియున్నారు.

నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా సిద్ధముగా ఉన్నారా? ఇప్పుడు కూడా ప్రభువు తన ఆత్మ చేత మిమ్మును నింపుతాడు. మీరెవరైనప్పటికిని ప్రభువుకు మొఱ్ఱపెట్టండి, బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 2:17 మరియు యోవేలు 2:28వ వచనములలో కూడా చెప్పబడియున్నది, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మరియు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు'' అని చెప్పినట్లుగానే, ప్రియ స్నేహితులారా, మీరు ఉన్న రీతిగానే ఆయన యొద్దకు రండి, మీరు పాపానికి బానిసలై యున్నారేమో?ఒకవేళ, మేము యోగ్యులము కాదు అని అంటుండవచ్చును. అయితే, మీరు ఇప్పుడే యేసు యొద్దకు రండి, ఆయనకు మొఱ్ఱపెట్టండి, ఆత్మను పొందుకొనుటకు మీకు ఇదియే సరైన సమయము. మీరు మరల జన్మించకపోయినట్లయితే, దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరని యేసుక్రీస్తు చెప్పియున్నాడు. కనుకనే, ప్రియ స్నేహితులారా, ఆయనకు మొఱ్ఱపెట్టండి. ఆయన మరల వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనుటకు మీలోనికి యేసు ప్రభువును పొందుకొనుటకు సిద్ధపడండి. నేటి వాగ్దానముగా ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు జీవపు ఊటగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసు, నీవు జీవాహారము కనుకనే, ఈరోజు మా ఆత్మ పోషింపబడుటకు మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపి నూతన వ్యక్తిగా మార్చుము. యేసయ్యా, మా పాపముల నుండి మమ్మును కడిగి, మాకు పరిశుద్ధమైన హృదయాన్ని ఇచ్చి, నీవు మరల వచ్చినప్పుడు, మేము సిద్ధంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం నుండి ప్రతి పాప భారాన్ని తొలగించుము. ప్రభువా, మా కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను నీ ఆత్మతో ఆశీర్వదించి, మేము నిన్ను ముఖాముఖిగా చూసే రోజు వరకు మేము నీ యందు నమ్మకంగా జీవించునట్లుగా చేయుము. దేవా, నీవు పక్షపాతము లేనివాడవు. తండ్రీ, ఇప్పుడే మమ్మును నీ ఆత్మతో నింపుము. ప్రభువా, ఇప్పుడే, మా మీదికి దిగిరమ్ము, మా హృదయములోనికి ప్రవేశించుము. తెరువబడిన మా హృదయమును నీ ఆత్మచేత నింపుము. దేవా, నీవు మా హృదయములోనికి వచ్చి నివసించుము. యేసయ్యా, నీవే జీవజలపు ఊటగాను, జీవాహారముగాను, జీవముగాను ఉన్నావు. కనుకనే, దేవా, ఇప్పుడు నీవు మా మీదికి దిగివచ్చి, జీవమును ఆనందించగలిగే కృపను దయచేయుము. ప్రభువా, నీ ఆత్మ మా మీద కుమ్మరించునట్లుగా చేసి, కొలతలేనంతగా మమ్మును నింపుము. దేవా, నీ యొక్క గొప్ప ఆనందమును మాకు కలుగజేయుము. ప్రభువా, మేము ఆనందముతో ఉప్పొంగుచూ, నిత్యజీవమును పొందుకొనునట్లుగా మమ్మును దీవించుము. నిరంతరము నీ యందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, పరలోకములో మేము నీ యందు ఆనందించునట్లుగా చేయునట్లుగా, మమ్మును నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి, నీ జీవజలముతో మమ్మును పరిశుద్ధపరచి, మమ్మును మరల నీలో క్రొత్త జన్మించునట్లుగా చేయుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.