నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 32:27వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?'' ప్రకారం ప్రభువే మనందరితో కూడా ఈ మాటను మాట్లాడుచున్నాడు, "నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను,'' అని చెబుతున్నాడు. ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడుతుంది? బైబిల్‌లో యిర్మీయా 17:7వ వచనములను మనము చదివినట్లయితే, "యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును'' ప్రకారం ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అని తెలియజేయబడుచున్నది. యేసునందు మీరు విశ్వాసముంచినప్పుడు ఏమి జరుగుతుంది? మనము బైబిల్ నుండి యిర్మీయా 17:8వ వచనమును చూచినట్లయితే, "వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు'' ప్రకారం అది సారవంతమైన భూమిగా ఉంటుంది. అది పచ్చగా ఎదుగుతుంది. అటువంటి భూమిని చూడడము ఎంత మాధుర్యముగా ఉంటుందో కదా! అదేవిధముగా, మన జీవితాలు కూడా ప్రభువు చేత ఆశీర్వదింపబడతాయి.

బైబిల్ గ్రంథములో అబ్రాహాము, యోబు, దానియేలు వంటి అనేకమంది భక్తులు ప్రభువు చేత ఎలాగున దీవించబడ్డారో మనము చూడగలము. వారు అట్టి విధంగా ఎందుకు దీవించబడ్డారు? అని చూచినట్లయితే, వారు ఎంతో ఆసక్తితో దేవుని వెదికారు. దావీదు జీవితమును చూచినట్లయితే, 'యెహోవా నా కాపరి' అని అన్నాడు. రాత్రింబగళ్లు అతడు ప్రభువును వెదికాడు. తాను పరిపూర్ణమైన విశ్వాసము ప్రభువు మీద ఉంచి యున్నాడు కనుకనే, అతని జీవితము సారవంతముగా మార్చబడినది. ఇంకను ఫలించె వృక్షము వలె మారినది. నేడు, నా ప్రియులారా, మీరు కూడా ఆ విధంగానే దీవించబడగలరు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 144:15వ వచనములో చూచినట్లయితే, "... యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు'' ప్రకారం మనము కూడా ధన్యులము కావాలంటే, దావీదు వలె మన దేవుడైన యెహోవాను మనము కూడా కలిగియుండాలి. దావీదు ప్రభువును ఎంతో యథార్థంగా వెదకాడు. ఆలాగుననే, కీర్తనలు 18:1,2వ వచనములను చదివినట్లయితే, "యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము'' అని దావీదు చెప్పిన ప్రకారం అతడు ప్రభువుతో ఎటువంటి అన్యోన్య సహవాసమును కలిగియున్నాడు చూడండి!

నా ప్రియులారా, "యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, '' అని దావీదు కీర్తనను వ్రాశాడు. ఇంకను "కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టెదను'' అని అంటున్నాడు. అవును, దావీదు ప్రభువును ఎంతో ఆసక్తితో వెదికాడు. కనుకనే, ఒక గొఱ్ఱెల కాపరియైన అతనిని ప్రభువు ఒక రాజుగా దీవించాడు. హల్లెలూయా! అదే దేవుడు నేడు ఇక్కడ మీ మధ్యలో కూడా ఉన్నాడు. కనుకనే, ఇప్పుడే మీరు ఆయన వైపు చూడండి, ఆయనను గట్టిగా హత్తుకొనండి. దావీదు వలె నేడు మీరు కూడా ఆశీర్వదింపబడుదురు. నా ప్రియులారా, మీరు కూడా దావీదు వలె ఆశీర్వదింపబడవలెననగా, అతని వలె మీరు ఆయనను నిత్యము వెదకినప్పుడు, నిశ్చయముగా, మీ దీన స్థితి నుండి ఆయన మిమ్మును పైకి లేవనెత్తి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
నాకు అమూల్యమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, నిన్ను వెదకుచున్న మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా హృదయాలలో ఉన్న ఆశలను నీవు ఎరిగియున్నావు. ప్రభువా, దావీదు వలె మేము నిన్ను వెదకుటకు కృపను చూపించుము. దేవా, దావీదు వలె మా యొక్క దీన స్థితి నుండి పైకి లేవనెత్తి, మమ్మును దీవించి, ఉన్నతంగా హెచ్చించుము. ప్రభువా, నీవు గొప్ప దేవుడవనియు, శరీరధారియైన దేవుడవని తెలుసుకొనుటకు, హృదయపూర్వకంగా, విశ్వాసంతో మేము నీ యొద్దకు వచ్చు చున్నాము. దేవా, నీకు అసాధ్యమైనదేదియు లేదు అని మేము గ్రహించి, మా చింతలన్నిటిని నీ మీద వేయుటకు మాకు నేర్పించుము. ప్రభువా, నీవు దావీదును, అబ్రాహామును, యోబును దీవించినట్లుగానే, మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము, మేము నీ మార్గములో నడుస్తూ, ఎటువంటి స్థితిలోను నిన్ను ఆశ్రయించుటకు మాకు నేర్పుము. ప్రభువా, మా శైలము, మా కోటగా, మా విమోచకునిగా ఉండి, ప్రతి నిత్యము మాతో ఉండి, మాకు అసాధ్యమైన వాటన్నిటిని మా జీవితములో సాధ్యపరచుము. దేవా, నీ సమయము, నీ శక్తి మరియు నీ వాగ్దానములను మేము నమ్ముచున్నాము, కనుకనే నీ యొక్క ఆశీర్వాదములతో మా జీవితాన్ని ప్రకాశింపజేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.