నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీ శత్రువులను ప్రభువు ఓడిస్తాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానము కదా! ప్రభువు మన శత్రువులనందరిని కూడా ఏడు మార్గములలో చెదరిపోవునట్లుగా చేస్తాడు. ప్రభువు వారి హృదయములలో ఎంతో భయమును కలుగజేస్తాడు. వారు భయపడి మనకు వ్యతిరేకంగా వస్తుంటారు. మనయందు నివసించుచున్న దేవుడు ఈ లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు అని వారికి తెలుసు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 23:22వ వచనములో చూచినట్లయితే, "అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును'' అని చెప్పబడిన ప్రకారముగా, మనము ఆయన మాటను ఎంతో జాగ్రత్తగా వినాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. చూడండి, ప్రభువు మనలను ఎంతగా ప్రేమించుచున్నాడు కదా! ' నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను' అని ప్రభువు అంటున్నాడు. కనుకనే, ఎవ్వరు కూడా మన వైపు వారి వేలును కూడా చూపలేరు. ప్రభువే మన పక్షమున యుద్ధములన్నిటిని పోరాడి మనకు జయమునిస్తాడు.
బైబిల్‌లో రాజైన యెహోషాపాతు తన విరోధముగా వచ్చిన గొప్పసైన్యమును చూచినప్పుడు భయపడలేదు. అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 20:15వ వచనములో మనము చూచినట్లయితే, " యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యా యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును'' అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. నా ప్రియులారా, కనుకనే, మీరు ఒంటరిగా పోరాడటము లేదు. ప్రభువు మీతో ఉన్నాడు. అనేకసార్లు మనము ఆ విషయమును గ్రహించలేము. మనము ఎంతో సులభముగా విచారములోనికి వెళ్లపోవుతూ, అన్ని విషయములను గురించి చింతిస్తూ ఉంటాము. మనము ఆ విషయమును గూర్చి, మన యింటిలో ఒక మూలన కూర్చుని ఎంతగానో చింతిస్తూ ఉంటాము. అయితే, ప్రభువు మన పక్షమున ఉంటే, మనకు విరోధి ఎవరు ఉంటారు.
నాగ్‌పూర్ లో జరిగిన కూటములో నేను పరిచర్య చేయుచున్నప్పుడు, దురాత్మ శక్తులు అరవడము, కేకలు వేయడము నాకు ఇంకా గుర్తు ఉన్నది. నేను ప్రజల వైపు చూచినప్పుడు, దురాత్మచేత పట్టి పీడింపబడుచున్న అనేకమంది తల్లులు గట్టిగా, గట్టిగా కేకలు వేయుచుండెను. అయితే, అపవాది వారందరిలో కూడా ఆలాగున పని చేయుచుండెను. ఆ సమయములో ప్రభువు వారి మీద ఎంతో కనికరమును నాకు కలుగజేసియున్నాడు. నేను దురాత్మ శక్తులను ఖండించినప్పుడు అవన్నియు కూడా వెంటనే వారిని విడిచి వెళ్లిపోయినవి. వారందరు కూడా విడుదల పొందుకొనుట చూడడము ఎంత గొప్ప దీవనకరమైనది ఉంటున్నది కదా! నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీతో ఉన్నాడు. కనుకనే, ఏదియు కూడా మీకు వ్యతిరేకముగా పనిచేయజాలదు. మీరు అపవాదిని ఖండించగానే, ఒక మార్గమున వచ్చినవాడు ఏడు మార్గములలో వెళ్లిపోతాడు. క్రీస్తు యొక్క అధికారము మీద మీరు నిలువబడినప్పుడు, ప్రతి దుష్ట శక్తి మిమ్మును చూచి పారిపోవలసినదే.కనుకనే, మీరు భయపడకండి.
బైబిల్ నుండి మార్కు సువార్త 5:6వ వచనములో మనము ఒక బలమైన ఉదాహరణను చూడగలము. యేసయ్య, దూరము నుండి వచ్చుచుండగా, దురాత్మ చేత పీడింపబడుచున్న వాడు దూరము నుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి, యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. అప్పుడు యేసయ్య, ' అపవిత్రాత్మా, యా మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.' అప్పుడు, యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి వెంటనే వెళ్లిపోయెను. కానీ, ఆ వ్యక్తి ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. ఏ త్రాడుకానీ మరియు సంకెళ్లు కూడా అతనిని బంధించలేకపోయినవి. కారణము, అనేకమైన దురాత్మల చేత అతడు పట్టబడియున్నాడు. అయితే, ఒక్క క్షణములోనే యేసయ్య, ఆ దురాత్మలను ఖండించగానే, దురాత్మలన్నియు కూడా అతనిని విడిచిపోయినవి. అవును నా ప్రియులారా, యుద్ధము యెహోవాదే. కనుకనే, మీ శత్రువులను బట్టి మీరు ఎంతమాత్రము కూడా భయపడకండి. అపవాదిని చూచి, మీరు ఎంత మాత్రము కూడా భయపడకండి. అపవాదిని మీరు ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు ఆయనతో సన్నిహితంగా నడిచినప్పుడు, ఆయన శక్తి మీ ద్వారా పనిచేస్తుంది. ప్రభువు ఇప్పటికీ మీ పక్షాన పోరాడుతున్నాడు. ప్రతి శత్రువు, ప్రతి ఒత్తిడి, అంధకారపు ప్రతి దాడి ఆయన శక్తివంతమైన నామం యెదుట తలవంచక మానదు. కనుకనే, ఆయనను నమ్ముతూ విశ్వాసంలో స్థిరంగా నిలబడండి, ఎందుకంటే ఈ యుద్ధం యెహోవాదే. అందునిమిత్తము మొదటగా మిమ్మును మీరు ప్రభువు కొరకు సమర్పించుకున్నట్లయితే, మీలో ఉన్న గొప్ప దేవుడు మీకు వ్యతిరేకముగా వచ్చు దురాత్మ శక్తులను కూడా పారద్రోలి వేస్తాడు. ఇప్పుడు కూడా మీ పక్షమున పోరాడుటకు కోరుచున్నాడు. ఇంతకాలము మిమ్మును బాధించుచున్న ప్రతి అపవాది శక్తుల నుండి ప్రభువు విడుదల చేయుచున్నాడు. మీ శరీరములో ఏ రోగము లేదు అని వైద్యులు అంటుండవచ్చును. కానీ, ఈ అనారోగ్యము నన్ను ఎంతగానో బాధించుచున్నది అని మీరు అనుకుంటున్నారా? లేక మీకు విరోధముగా శత్రువులు వస్తున్నారని చింతించుచున్నారా? అయితే, నా ప్రియులారా, దేవుడు మీ పక్షమున యుద్ధము చేసి, మీ మీదపడు మీ శత్రువులను యెహోవా మీ యెదుట హతమగునట్లు చేసి, వారొక త్రోవను మీ మీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల మీ యెదుట నుండి పారిపోవుదురు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితములో ఉన్న దురాత్మ శక్తుల ద్వారా మరియు శత్రువుల చేత బాధింపబడుచున్న మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా కుటుంబమును వేదనపరచుచున్న దురాత్మ శక్తులను యేసు నామమున మమ్మును విడిచిపెట్టి వెళ్లిపోవునట్లుగా ఆజ్ఞాపించుము. ప్రభువా, మేము శ్రమ నొందినది ఇక చాలు, మమ్మును విడిపించుము. ప్రియమైన ప్రభువా, మా రక్షకునిగా మరియు మా ఆశ్రయంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా,మాకు విరోధంగా ఏ ఆయుధము వర్థిల్లకుండా చేయుము. ప్రభువా, మా జీవితములో, కుటుంబములోను, ఆరోగ్యములో మరియు భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలిచే ప్రతి యుద్ధంలో నీవు మా పక్షమున పోరాడి, మా యొక్క శత్రువు బాధ నుండి మమ్మును విడిపించి, మాలో ఉన్న భయం, ఆందోళన మరియు బానిసత్వం యొక్క ప్రతి సంకెళ్లను త్రెంచివేయుము. దేవా, మా కుటుంబములోను, మాజీవితములోను అపవాది కలిగించు అలజడులను తొలగించి, మాకు నీ యొక్క శాంతి, సన్నిధి మరియు కాపుదలను మా గృహమును నింపునట్లుగా కృపను దయచేయుము. దేవా, యుద్ధం నీదేనని గుర్తెరిగి, నిన్ను సంపూర్ణముగా విశ్వసించునట్లుగా కృపనిచ్చి, మా విశ్వాసమును బలపరచుము. ప్రభువా, నీ యొక్క అద్భుతమైన శక్తి ద్వారా మాకు విజయమును మరియు విడుదలను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


