నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 37:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో, "...మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి, మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను...'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బైబిల్ నుండి యెహెజ్కేలు 37 వ అధ్యాయములో ప్రభువు యెహెజ్కేలును ఎండిన ఎముకలు గల లోయలలో నడిపించియున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క జీవములేని విశ్వాసమునకు ఈ దర్శనము ఒక సూచనయై యున్నది. ఇశ్రాయేలీయులు పది సంవత్సరములు బంధీలుగా చెరపట్టబడియున్నారు. బైబిల్ నుండి యెహెజ్కేలు 37:11వ వచనములో చూచినట్లయితే, చెరపట్టబడియున్న ఇశ్రాయేలీయులు ఈ విధంగా అంటున్నారు, "అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించు చున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని యనుకొనుచున్నారు'' ప్రకారం జీవితములో ఉన్న నిరీక్షణ అంతటిని ఇశ్రాయేలీయులు కోల్పోయా రు. వారి భవిష్యత్తును వారు ఇక ఎన్నడు కూడా ఊహించలేకపోయారు. అంతా కోల్పోయాము, ఇక మనము నాశనమైపోయాము అని వారు అనుకొనుచున్నారు. మనము ఎండిపోయినటువంటి వారముగా ఉన్నాము. నా ప్రియులారా, ఒకవేళ ఇప్పుడు మీరు కూడా మీ నిరీక్షణ అంతా కోల్పోయి, మీ జీవితము అంతయు మృతమైనదిగా ఉంటున్నది, ' నేను అలసిపోయాను, నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను అని అంటున్నారేమో? అపవాది అంధకారములోనికి నన్ను నెట్టి వేయుచున్నాడు అని అంటున్నారేమో? నా జీవితములో నేను వెలుగును ఎప్పుడు చూడబోవుచున్నాను అని ఏడుస్తూ, మొఱ్ఱపెట్టుచున్నారేమో?' అయితే, 'ఇశ్రాయేలీయులను మరల జీవింపజేస్తాను' అని ప్రభువు వాగ్దానము చేసినట్లుగానే, ప్రభువు మిమ్మును కూడా నిశ్చయముగా మరల జీవింపజేస్తాడు. మీరు అన్నిటిని మరల పొందుకుంటారు. ప్రభువు మాతమ్రే మృతమైనవాటిని మరల జీవమును మరియు ఊపిరిని పోయగలడు. దేవుని ఆత్మ మూలముగానే మృతమైనవాటి సహిత ము తిరిగి జీవింపజేయబడతాయి. ఎండిన ఎముకలలోనికి దేవుని జీవాత్మ ప్రవేశించి, మరల జీవింపజేయడము ద్వారా, శారీరకముగా మాత్రమే కాదు గానీ,ఆత్మీయంగా కూడా దేవుడు మరల జీవింపజేయగలుగుతాడు అని నిరూపించగలిగియున్నాడు. దేవుని ఆత్మ యెక్కడ ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది. కనుకనే, స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువు తన యొక్క ఊపిరిని, జీవమును మీలోనికి ప్రవేశింపజేయబోవుచున్నాడు. అందుకే యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన సమృద్ధియైన జీవమును మనకు ఇవ్వడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి, మన నిమిత్తము తనను తాను సమర్పించుకున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.
తన జీవితములో తనకున్నటువంటి నిరీక్షణ అంతటిని కోల్పోయిన ఒక సహోదరి యొక్క చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. తన పేరు అముదా, తను బెంగుళూరు పట్టణము నుండి వచ్చియున్నారు. ఏడు సంవత్సరములుగా తను రక్తస్రావముతో ఎంతగానో బాధపడుచుండెను. అనేకమైన హాస్పిటల్‌కు వెళ్లారు, ఎన్నో చికిత్సలు చేయించుకొనియున్నారు. ఏదియు కూడా ఆమెకు సహాయపడలేదు. ఆమె యొక్క గర్భ సంచిని తొలగించాలని వైద్యులు చెప్పియున్నారు. వీటన్నిటిని మధ్యలో తన భర్త తనను అర్థము చేసుకొనకుండా, తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆర్థికంగా కూడా ఆమె అనేకమైన సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చినది. శారీరకంగా కూడా ఆమె ఎంతో బలహీనతను ఎదుర్కొనేది. తన జీవితములో కూడా ఈ సంఘటనలన్నిటిని గురించి కూడా ఆమె ఎంతగానో ఆవేదన చెందుచుండెను. తనకున్న నిరీక్షణ అంతా కూడా కోల్పోయినది. అటువంటి నిరాశపరిచే సమయములో కూడా బెంగుళూరు పట్టణములో జరుగుచున్న యేసు పిలుచుచున్నాడు కూడికకు ఆమె హాజరైనది. ఆమె అక్కడ మాతో కూడా ప్రార్థించుకోవచ్చునని తెలుసుకొని, అక్కడకు వచ్చి మా దగ్గర ప్రార్థించుకొనెను. ఆమె కూడా ఉపవాసము ఉండి, ఎంతగానో ప్రార్థన చేసెను. హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుచున్న ఆ సమయములో ఆమె ఉన్న గదిలో ఎంతగానో తేజోవంతమైన కాంతిని ఆమె చూసినది. దేవుని యొక్క తాకిడిని ఆమె అనుభూతి చెందినది. అప్పుడు, 'నీవు అనారోగ్యముతో ఉండగా, నేను నిన్ను స్వస్థపరచవచ్చునా?' అని ఒక స్వరమును ఆమె వినియున్నది. ఆ సమయములో ఆమెలో ఉన్న అనారోగ్య సమస్యలన్నియు ఆమె నుండి తొలగిపోయినవి. ప్రభువు ఒక అతీతమైన అద్భుతమును జరిగించియున్నాడు. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా ఆమె స్వస్థతను పొందుకొనియుండెను. ఆ తర్వాత, ఆమె భర్త కూడా ఆమె యొద్దకు తిరిగి వచ్చెను. ఈ రోజు ఆమె ఒక సంతోషకరమైన కుటుంబ జీవితమును గడుపుచుండెను. ప్రభువు ఆమెకు మరల జీవమును అనుగ్రహించియున్నాడు. ఆయన, " నా ఆత్మను మీ యందు ఉంచెదను, మీరు మరల జీవించెదరు '' అను ప్రభువు సెలవిచ్చిన రీతిగానే, సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆమె ఇప్పుడు జీవించుచున్నది. హల్లెలూయా!
నా ప్రియులారా, ఆలాగుననే, నేడు ప్రభువు మిమ్మును కూడా స్వస్థపరచి మరల జీవింపజేయడా? నిశ్చయముగా జీవింపజేస్తాడు. కనుకనే, మీరు ఆయనను నమ్మండి. ఆయన మిమ్మును జీవింపజేయుట మాతమ్రే కాదు గానీ, మీ శరీరమును జీవింపజేసి మరియు మీ యొక్క ఆత్మను, ప్రాణమును కూడా ప్రభువు స్వస్థపరుస్తాడు. మీ జీవితములో కూడా నేడు మృతి చెందియున్న ప్రతి ఒక్కటి మరల ఈ రోజు జీవములోనికి రాబోవుచున్నవి. ఈరోజు, దేవుడు మీ జీవితంలోని ప్రతి నిర్జీవ పరిస్థితిలోను - మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ ఆర్థిక పరిస్థితులు మరియు మీ ఆత్మలోను - తన ఆత్మను ఊదడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం మరియు విడుదల ఉంటాయి. యేసు మనకు ఓటమిలో కాకుండా సంపూర్ణ స్థాయిలో జీవమును ఇవ్వడానికి వచ్చాడు. మీ జీవితంలోని ప్రతి మృతమైనదానిని నేడు ఆయన శక్తి ద్వారా పునరుద్ధరించబడుతుందని నమ్మండి. ఆయన మీ శరీరాన్ని స్వస్థపరచగలడు, విరిగిన సంబంధాలను పునరుద్ధరించగలడు, మీ హృదయానికి సమాధానమును తీసుకురాగలడు మరియు నిరాశ నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తగలడు. మీ నిరీక్షణను కోల్పోకండి. ప్రభువు మీ పక్కన నిలబడి ఉన్నాడు, మిమ్మల్ని రెట్టింపు స్థాయిలో పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మీకు తోడుగా ఉండి, మీ జీవితములో మృతమైన సమస్తమును మరల రెండంతలుగా మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా ఈ నూతన మాసమంతయు ప్రభువు మిమ్మును మరల జీవింపజేసి, దీవించును గాక
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీవు ఆ సిలువలో మృతి చెందుట ద్వారా మాలో మరణకరమైనవాటన్నిటిని తొలగించి వేసియున్నందుకై నీకు వందనాలు. తండ్రీ, ఈ సందేశము చదువుచున్న మాలోనికి నీ జీవమును, ఊపిరిని ఊదుమయ్యా. దేవా, మాలోనికి నీ జీవమును ప్రకటించునట్లుగా చేయుము. యేసయ్యా, నీ నామమున మా జీవితములో ప్రతి మృతమైన కార్యాలు నశించిపోవునట్లుగా చేయుము. దేవా, ఇప్పుడు కూడా మాలో నీ యొక్క జీవమును ప్రవేశింపజేయుము. ప్రభువా, మా ఆత్మ తిరిగి జీవించునట్లుగా చేయుము, ప్రతి శరీరము మరల బ్రతుకునట్లుగా చేయుము. దేవా, కోమాలో ఉన్న మా ప్రియులలోనికి నీ జీవమును పంపించి, వారు మరల బ్రతుకునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజు నీ జీవమిచ్చే ఆత్మను మాలోనికి ఊదుము. యేసయ్యా, మా జీవితంలోని ప్రతి చనిపోయిన పరిస్థితిని పునరుద్ధరించుము. ప్రభువా, మా శరీరం, మా మనస్సు మరియు మా ఆత్మను నీ శక్తి ద్వారా స్వస్థపరచుము. యేసయ్యా, మేము నిరీక్షణ కోల్పోయిన చోట మాకు సమాధానమును, ఆనందం మరియు బలాన్ని పునరుద్ధరించుము. ప్రభువైన యేసు, మా కుటుంబం మరియు సంబంధాలలోకి నీ జీవాన్ని తీసుకురమ్ము. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి అనారోగ్యం మరియు బంధకాలు, నామంలో నాశనం చేయబడుటనులగా కృపను అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధితో మమ్మును నింపి మా యొక్క ప్రతి బంధకాల నుండి, మృతమైన వాటి నుండియ మమ్మును విడిపించుము. ప్రభువా, నీ యొక్క పునరుత్థానపు శక్తి మాలో పనిచేయునట్లుగా, మా ఎండిన ఎముకలను, మోకాళ్లను, నీ జీవముతో నింపి, మరల జీవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు జీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.