నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేడు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 107:20వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన వాక్కును పంపి నేడు మనలను బాగుచేయాలని ఆయన మన పట్ల వాంఛ కలిగియున్నాడు. ఆలాగుననే, ఆరంభములో దేవుడు ఈ లోకమును సృష్టించినప్పుడు, "వెలుగు కలుగును గాక'' అని పలికెను. ఆలాగుననే, జరిగెను. అవును, దేవుడు ఈ లోకములో సమస్తమైన జంతువులను, పశుపక్షాదులను, మానవులను, ఇంకను అన్నిటిని కూడా తన మాట ద్వారా సృజించాడు. ఆయన మాటకు ఎంతో శక్తి ఉన్నది. అంతమాత్రమే కాదు, సమస్తమును సృష్టించగల శక్తి ఆయన మాటకు కలదు.

అందుకే బైబిల్ నుండి యోహాను 1:1వ వచనములో చూచినట్లయితే, "ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను'' అని చెప్పబడినట్లుగానే వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర రూపియైన యేసయ్యగా ఈ లోకమునకు వచ్చియున్నాడు. కనుకనే, మనము ఆయన వాక్యమునందు విశ్వాసముంచినప్పుడు, మనము స్వస్థత నొందుతాము. యేసుక్రీస్తు ఒకసారి ఈ లోకములో జనసమూహముల మధ్య నడుస్తూ వెళ్లుచున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ' ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, దయచేసి, అతనిని స్వస్థపరచుమని ఆయనను వేడుకొనెను.' అందుకు, యేసు, " నేను వచ్చి వాని స్వస్థపరచెదనని'' అతనితో చెప్పగా ఆ శతాధిపతి, "ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; కేవలము నీవు ఒక మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును'' అని చెప్పాడు. నా ప్రియులారా, దేవుని యొక్క మాటకు ఎంతో శక్తి ఉంటున్నది. అప్పుడు యేసయ్యా, ఈ మాట విని ఆశ్చర్యపడి, 'వెంట వచ్చుచున్నవారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అని అన్నాడు. అంతట యేసు, " ఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను.'' యేసు, 'ఈ సమయములోనే నీ దాసుడు స్వస్థతను పొందుతాడు'' అని చెప్పినప్పుడు, సరిగ్గా ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.'' అవును, దేవుని నోట నుండి వచ్చు ఒక మాట వలన నేడు మనము సజీవులముగా జీవించుచున్నాము. ఒకసారి, తుఫాను వచ్చినప్పుడు, యేసయ్యా, ఒక మాట మాత్రము సెలవిచ్చియున్నాడు. అందుకాయన లేచి గాలిని గద్దించి, "నిశ్శబ్దమై ఊరకుండుమని'' సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.

ఆలాగుననే, లాజరు చనిపోయినప్పుడు, యేసయ్యా, అతనితో ఈలాగు చెప్పియున్నాడు కదా, "లాజరు బయటకు రమ్మని''అన్నాడు. వెంటనే, మరణించిన ఆ వ్యక్తి సజీవుడుగా బయటకు వచ్చియున్నాడు. ఆలాగుననే, పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి స్త్రీ, యేసయ్య యొద్దకు వచ్చినప్పుడు, "కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని'' యేసయ్య ఆమెతో చెప్పియున్నాడు. ఆమె అదే సమయములో స్వస్థత నొందియున్నది. ఆయన వాక్కుకు ఎంతో శక్తి ఉన్నది. నా ప్రియులారా, ఈ రోజు కూడా ఆయన వాక్యము మీ మీదికి దిగి వచ్చి, మిమ్మును స్వస్థపరుస్తుంది. మా జీవితములో చూచినట్లయితే, మా యొక్క ప్రతి వర్తమానములో కూడా మేము ఏదైన ఒక దేవుని వాక్యమును వర్తమానముగా అందించినప్పుడు, ఆ వాక్కులు అద్భుతములను తీసుకొని వచ్చుచున్నవి. ఒక సహోదరుడు, " మీరు చెప్పు ప్రతి వర్తమానములను కూడా, నా డైరీలో వ్రాసుకుంటాను. ప్రతిసారి ఆ వాక్కులను నేను చదువుచున్నప్పుడు, ప్రభువు నాకు ఒక నూతన బలమును అనుగ్రహించుచున్నాడు'' అని చెప్పియున్నాడు.

అవును, నా ప్రియులారా, దేవుని వాక్యము మనకు జీవమునిచ్చుచున్నది. అందుకే బైబిల్ నుండి యోహాను 6:63వ వచనములో చూచినట్లయితే, " ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి'' అని యేసు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, దేవుని యొక్క మాటలు మిమ్మును పునరుద్ధీకరింపజేయును గాక. దేవుని యొక్క మాటలు పాపము ద్వారా కలుగు మరణము నుండి మిమ్మును పునరుద్ధీకరింపజేయును గాక. దేవుని యొక్క మాటలు మీలో ఉన్నటువంటి రోగములను స్వస్థపరచును గాక. దేవుని యొక్క మాటలు మిమ్మును మరల జీవింపజేయగల శక్తితో నింపును గాక. నా ప్రియులారా, దేవుడు ఈ రోజే మిమ్మును తన వాక్కుతో నింపి, మిమ్మును బలపరచి, తన యొక్క శక్తితో నింపును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీవే వాక్యమై యున్నావు, శరీరధారిగా నీవు ఈ లోకమునకు వచ్చియున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు జీవమును మరియు స్వస్థతను మరియు అద్భుతములను ఇవ్వడానికి ఈ లోకమునకు వచ్చినందుకై నీకు వందనములు. దేవా, నీ వాక్యము ఈ రోజు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, నేడు వ్యాధితో ఉన్న మమ్మును మరియు మా ప్రియులను నీ యొక్క వాక్కును పంపించి, మాకు మరియు మా ప్రియులకు అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు మా శరీరములు మరియు మా జీవితములను నీ వాక్కు ద్వారా పునరుద్ధరించబడునట్లుగా చేయుము. దేవా, ఈ రోజు నీ జీవముగల వాక్యము మా మీదికి దిగివచ్చునుగాక. యేసయ్యా, మాలో ఉన్న ప్రతి రోగమును స్వస్థతకును, ప్రతి బలహీనత బలమునకు మరియు వ్యాధిబాధలో ఉన్న మాకు జీవమును దయచేయుము. యేసయ్యా, మేము పాపము ద్వారా మరణించకుండా, నీ వాక్యము ద్వారా మేము పునరుద్ధిరించబడునట్లుగా చేయుము. దేవా, మేము మా శరీరములోను, జీవితములోను కోల్పోయినవన్నియు తిరిగి మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మా యొక్క ప్రతి బాధ, బలహీనత, నరాల సమస్య, రక్తహీనత, మరియు క్యాన్సర్ నీ యొక్క అద్భుతమైన శక్తిచేత స్వస్థపరచబడునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క వాక్యము ద్వారా మా విశ్వాసమును బలపరచి, మమ్మును నూతన జీవముతోను, నిరీక్షణతోను, మరియు ధైర్యముతోను నింపుము. ప్రభువా, నీ వాక్యము మా జీవితములలో అద్భుతములను తీసుకొని వచ్చునట్లుగాను మరియు నీ మహిమను బయలుపరచునట్గు చేయుము. దేవా, మాలో నేడు ఎటువంటి వ్యాధి ఉన్నను సరే, నీ అద్భుతమైన శక్తిచేత మమ్మును స్వస్థపరచి, పునరుద్ధరించుటకు నీ వాక్కును మా యొద్దకు పంపించి, మమ్మును స్వస్థపరచుమని యేసుక్రీస్తు యొక్క స్వస్థపరచు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.