నా ప్రియ స్నేహితులారా, నేడు అద్భుతమైన వాగ్దానమును బైబిల్ నుండి యెషయా 31:5వ వచనమును మనము కలిగియున్నాము. ఆ వచనము, "పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును'' అని చెప్పబడినట్లుగానే, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకొనినటువంటి దేశమై యున్నది. ప్రభువు వారిని ప్రేమిస్తాడు, వారిని కాపాడుతాడు, వారిని క్రమ శిక్షణలో ఉంచుతాడు. దేవుడు తన ప్రేమ మరియు కాపుదలను తన పిల్లలను కాపాడుకునే తల్లి పక్షి ప్రేమతో పోల్చుచున్నాడు. తల్లి డేగ తన రెక్కలను విస్తరించి తన పిల్లలను కప్పినట్లుగా, మన ప్రభువు తన దైవిక కాపుదలతో మనలను కప్పుతాడు. ఆయన మనలను ప్రమాదంలో విడిచిపెట్టడు. కానీ, అందుకు బదులుగా ప్రతి కష్టాల నుండి మనలను పైకి లేవనెత్తుతాడు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 14:2వ వచనమును చూచినట్లయితే, " ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను'' ప్రకారము ఇశ్రాయేలీయులను దేవుడు తన స్వకీయ ప్రతిష్టత జనముగా ఎన్నుకొనియున్నాడు. దేవుడు తన ప్రజలైన మన పట్ల చూపించే ప్రేమను తల్లి డేగ చూపించే ప్రేమతో పోల్చియున్నాడు. తల్లి డేగ తన రెక్కలను చాచి, తన పిల్లలను కాపాడుచూ, తన పిల్లలను మోయుచూ ప్రయాణిస్తుంది. అదేవిధముగా, ప్రభువు మన కొరకు కూడా అదే చేస్తాడు. ఆయన మనలను కాపాడుతాడు, ఆయన మనలను ప్రేమించుటకు ఎంత దూరమైన మనతో కూడా వస్తాడు. ఒక గ్రద్ధ తన పిల్లలను కాపాడుకొనుటకై వాటి చుట్టూ తిరుగుతూ వాటిని భద్రంగా కాపాడుతుంది.
బైబిల్ నుండి కీర్తనలు 138:7వ వచనములో కీర్తనాకారుడైన దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును'' ప్రకారము పక్షులు ఎలాగైతే, వాటి పిల్లలను కాపాడుకుంటాయో, మన ప్రభువు కూడా మనలను ఆలాగుననే కాపాడుకుంటూ మోస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 66:13వ వచనములో చూచినట్లయితే, దేవుడు మనలను ఎలా ఆదరిస్తాడు అని వ్రాయబడియున్నదో చూడండి, " ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు'' అని వాగ్దానము చేసియున్నాడు. అవును, ఒక తల్లి నిజముగా తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఒక పసిబిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు, తన తల్లి వెంటనే ఎక్కడ ఉన్నప్పటికిని కూడా, తను ఎక్కడ ఉన్నను కూడా పరుగెత్తుకుంటూ ఆ బిడ్డ యొద్దకు వచ్చి, ఆ బిడ్డను హత్తుకుంటుంది. ఆలాగే మన జీవితములో సమస్యలు ఎదురైనప్పుడు మనము చింతించనవసరము లేదు. ఒక తల్లి మనలను ప్రేమించుచున్నట్లుగా మన ప్రభువు మనలను ప్రేమించుచున్నాడు గనుకనే, మనము ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే చాలు. అయితే, మీకు సమస్యలు ఎదురైనప్పుడు, ప్రభువును మీరు తల్లిగా అనుకొని ఆయనకు మొఱ్ఱపెట్టండి. ఆపత్కాలమున ఆయన మీకు తోడుగా ఉంటాడని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 50:15వ వచనములో చూచినట్లయితే, "ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు'' అని ప్రభువు అంటున్నాడు. అత్యవసర పరిస్థితులలో మనము ఆశ్రయయించవలసిన మన యొక్క ఫోన్ నెంబరు అని ఒక సహోదరి చెప్పుట నేను వినియున్నాను. కీర్తనలు 50:15 అను ఈ నెంబరును గుర్తించుకోవడానికి ఎంతో సులభము కదండి. ఒక తల్లి పక్షివలె ప్రభువు మనలను ఆదరిస్తాడు. మనం బాధతో లేదా భయంతో చుట్టుముట్టబడినప్పుడు, మనం యేసు నామాన్ని ప్రార్థించవచ్చును. ఆయన మనకు జవాబు ఇస్తాడు, ఓదారుస్తాడు మరియు మనలను విడిపిస్తాడు. ఆయన సన్నిధి మనలను రెక్కలు చాపి, చుట్టుముట్టి, సమాధానము, బలం మరియు భద్రతను తీసుకొనివస్తుంది.
ఇప్పుడు కూడా సహోదరి సౌందరి యొక్క ఒక చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. చెన్నై పట్టణములో, రెడ్‌హిల్స్ ఆమె నివసించుచున్నారు. ఆమె సహోదరి యొక్క పాపకు ఒక సంవత్సరము వయస్సు. ఆ చిన్న బిడ్డకు క్యాన్సర్ అని తెలియజేయబడినది. ఆ చిన్న పసిబిడ్డ యొక్క శరీరమంతయు పుండ్లతో నిండియుండెను. ఆ బిడ్డ యొక్క జుట్టు అంతయు రాలిపోయినది. ఆ బిడ్డ ఎంతో బలహీనముగా ఉండేది. ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. తద్వారా, తన తల్లి ఎంతో విసిగిపోయి, హృదయము పగిలిపోయిన స్థితిలోనికి వెళ్లిపోయినది. ఆ బిడ్డను చూచుకోలేనటువంటి, పరామర్శించలేని పరిస్థితికి దిగజారిపోయినది. ఒకానొక పరిస్థితిలో ఈ బిడ్డ చనిపోయినను ఎంతో మంచిది అనే ఆలోచనలోనికి ఆ తల్లి వెళ్లిపోయినది. ఆ బిడ్డ అంతగా బాధపడుచూ, వేదనపడేది. కానీ, ఈమె సౌందరి తన సహోదరి యొక్క బిడ్డ కొరకు అడయారులో ఉన్న డి.జి.యస్. దినకరన్ ప్రార్థన గోపురమునకు వెళ్లి ప్రార్థించెను. ప్రార్థన యోధులు ఎంతో భారముతో ఆ బిడ్డ కొరకు ప్రార్థించి, వారు ప్రార్థన నూనె ఆ బిడ్డ యొక్క శరీరమునకు వ్రాయమని చెప్పి, ప్రార్థన నూనె కూడా ఇచ్చారు. ఆ పసి బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ యొక్క శరీరమంతయు ఈ ప్రార్థన నూనెను రాసి, ఆ బిడ్డను గురించి, యెడతెగక ప్రార్థన చేసియుండెను. ఆ తర్వాత, ఒక అద్భుతము జరిగినది. ఆ బిడ్డ పరిపూర్ణంగా స్వస్థపడినది. ఆ బిడ్డ యొక్క శరీరములో ఉన్న పుండ్లు అన్నియు కనిపించకుండా అదృశ్యమైపోయినవి. ఈ రోజు ఆ చిన్న బిడ్డ ఎంతో చక్కగా ఆరోగ్యముగా ఉన్నది. ప్రియ సహోదరి సౌందరి ప్రార్థన గోపురమునకు వచ్చి, ఆ బిడ్డ కొరకు ప్రార్థించిన యోధులందరికి వందనాలు తెలియజేసినది. ఈ రోజు ఆ బిడ్డ పరిపూర్ణంగా స్వస్థపడియున్నది. చూడండి నా ప్రియులారా, ఆ చిన్న బిడ్డను ప్రభువు ఏ విధంగా కాపాడియున్నాడు కదా! చనిపోవుచున్నటువంటి ఆ బిడ్డను ప్రభువు స్వస్థపరచి, కాపాడియున్నాడు. పక్షులు ఎగురుచూ తన బిడ్డలను కాపాడినట్లుగానే, మన దేవుడు మిమ్మును కూడా కాపాడి సంరక్షిస్తాడు. ఆయన మిమ్మును స్వస్థపరుస్తాడు, ఆయన మిమ్మును విమోచించి, విడుదల చేసి, మిమ్మును కాపాడి సంరక్షిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
 ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, పక్షులు తన రెక్కలు చాపి కాపాడినట్లుగా మమ్మును కాపాడతావని నీవు ఇచ్చిన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ ప్రేమగల బలమైన రెక్కలతో మమ్మును కప్పుము. ప్రభువా, ఒక తల్లి వలె నీ బిడ్డలైన మా మీద నీ హస్తమును ఉంచి, మా శరీరమును మరియు మా వ్యాధులను స్వస్థపరచుము. దేవా, మాలోను మరియు మా ప్రియులైన వారిలోను ఉన్న మరణకరమైన వ్యాధులను ఇప్పుడే నీవు తాకి వాటన్నిటిని నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, మా శరీరములోను మరియు మా ప్రియులైన వారిలోను ఉన్న ప్రతి గడ్డలు మరియు క్యాన్సర్, చర్మసమస్యలను, బొబ్బలను, కణితలను, వాపులను మరియు ప్రతి నొప్పిని ఇప్పుడే నీ గాయపడిన హస్తములతో ముట్టి, నీ యొక్క నామము ద్వారా స్వస్ధపరచుము మరియు అవన్నియు ఇప్పుడే కనిపించకుండా అదృశ్యమైపోవునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మా వేదనకు ఒక ముగింపును నేడే మాకు దయచేయుము. ప్రభువా, మా శరీరాన్ని తాకుము మరియు నీ స్వస్థపరిచే శక్తి మాలో ప్రవహించునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి బాధ, బలహీనత మరియు భయాన్ని తొలగించుము. ప్రభువా, నీ ఆదరణకరమైన సన్నిధి మా మీద మరియు విరిగిపోయిన మరియు అలసిపోయిన మా ప్రియులందరి మీద ఉండునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, మా యొక్క ప్రతి కష్టము నుండి మమ్మును విడిపించి, సురక్షితమైన స్థలమునకు తీసుకొని వెళ్లి, మమ్మును కాపాడుము. దేవా, మా జీవితంలో నీవు జరిగించే అద్భుతాల మేము నిన్ను మహిమపరచునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మమ్మును నీ రెక్కల క్రింద కప్పి, మమ్మును సురక్షితంగా కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

 దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి    
  Donate Now


