నా ప్రశస్తమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు ఆగష్టు 21వ తారీఖు, నా జీవితములో ఎంతో గొప్ప దినము. అదేమనగా, యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్షణను పొందుకొని, క్రీస్తునందు నూతన వ్యక్తిగా నేను మార్చబడిన దినము. ఆ రోజు నుండి ఈనాటి వరకు ప్రభువు నా జీవితమును ఎంతగానో దీవించాడు. హల్లెలూయా! నేడు బైబిల్ నుండి 2 కొరింథీయులకు 5:5వ వచనములోని అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు'' అని చెప్పబడిన వచనము ప్రకారము ప్రభువు తన యొక్క పరిశుద్ధాత్మచేత మనలను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. మనము బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:22వ వచనములో చూచినట్లయితే, "మీతో కూడ క్రీస్తునందు నిలిచి యుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు'' ప్రకారం ఆ వాగ్దాన వచనములో కూడా అదే సత్యము చెప్పబడియున్నది. మరియు ఎఫెసీయులకు 1:14వ వచనములో చూచినట్లయితే, " దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ఈ పరిశుద్ధాత్మను మనము ఎలా పొందుకొనగలము? అని చూచినట్లయితే, బైబిల్ గ్రంథము మనకు ఏమని స్పష్టముగా తెలియజేయుచున్నదనగా, "అడుగుడి మీకియ్యబడును'' అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. కనుకనే, మీరు ప్రభువుకు ప్రార్థన చేయండి, దేవుని ఆత్మను పొందుకొనండి. ఇంకను లూకా 11:13వ వచనములో చూచినట్లయితే, "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' ప్రకారం అదే వాక్యము చెప్పబడియున్నది. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీలో ప్రతి ఒక్కరు అదే అనుభవముచేత నింపబడి ఉండాలి. ఇంకను అపొస్తలుల కార్యములు 10:38వ వచనములో," అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను'' కూడా చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు కూడా ఇట్టి అనుభవమును పొందుకొని, ఆయన పరిచర్యను చేయడము మొదలు పెట్టాడు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ శక్తిచేత నింపబడి, ఆయన ఈ భూమి మీద పరిచర్య చేశాడు.

అదేవిధముగా, నా ప్రియులారా, ఈ రోజు మీలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ చేతను మరియు తన శక్తి చేత నింపబడాలని కోరుకుంటున్నాడు. మీలో ఎందరు ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారు? బైబిల్‌లో కొర్నేలీ అను ఒక వ్యక్తి ఉండెను. అతడు యూదుడు కాదు, అయినప్పటికిని, తన హృదయమంతటితోను ప్రభువును వెదకాలని తనలో తపన కలిగియున్న ఒక వ్యక్తి. అదే విజయమునకు రహస్యమై ఉన్నది. కనుకనే, నా ప్రియులారా, మీరు కూడా కొర్నేలీ వలె దేవుని వెదకడానికి మరియు ఆత్మీయ అనుభవమును పొందుకొనడానికి ఆశ కలిగియున్నట్లయితే, ప్రభువు తప్పకుండా దానిని ఇప్పుడే మీ పట్ల నెరవేరుస్తాడు. కొర్నేలీ ఈ ఆశీర్వాదమును పొందుకొనుటకు ఎంతో ఆతృతను కలిగియుండెను. కాబట్టి, ప్రభువు తన సేవకుని అతని యొద్దకు పంపాడు. తన సేవకుడైన పేతురు అతనిని దర్శించాడు. అతనితోను మరియు అతని కుటుంబముతోను, స్నేహితులతోను పేతురు మాట్లాడెను. పేతురు ఇంకను మాట్లాడుచుండగానే, అక్కడికి కూడి వచ్చిన వారందరిని ప్రభువు తన ఆత్మచేత నింపియున్నాడు. కొర్నేలీ మరియు అతని కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులందరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మచేత నింపాడు.

నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు కూడా దేవుని అడగండి, మీకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించబడుతుంది. మీరు కూడా కుటుంబముగా ఇటువంటి అనుభవము చేత నింపబడండి. మీరందరు ఇప్పుడు కూడా కుటుంబముగా చేరియున్నారని ఆశించుచున్నాను. మీరందరు ఇప్పుడు ప్రార్థించి ఈ అనుభవమును పొందుకొనండి. మీరు ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా దేవుడు తన ఆత్మచేత మీ కుటుంబమంతటిని నింపుతాడు. ఇంకను మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూడగలరు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిని తన చేత నింపుచున్నాడు. నేటి వాగ్దానము ద్వారా మిమ్మును తన ఆత్మచేత నింపి దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వరానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, మేము నీ పరిశుద్ధాత్మ కొరకు తృష్ణ కలిగియున్నాము. ఇప్పుడు మా హృదయాలను, ఆత్మలను నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుము. ప్రభువా, కొర్నేలీని మరియు తన కుటుంబాన్ని నింపిన రీతిగానే, నేడు మమ్మును మరియు మా కుటుంబమును ఇప్పుడే నీ ఆత్మ శక్తిచేత నింపుము. దేవా, మేము నీ యొక్క ఆత్మీయ దీవెనలు పొందుకొనుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. దేవా, ఇప్పుడు కూడా, మా స్వాస్థ్యమునకు ఆత్మ అను సంచకరువును అయిన నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపమని మేము కోరుచున్నాము. ప్రభువా, దయచేసి మాలో నీ కొరకు లోతైన ఆత్మీయ తృష్ణను కలిగించుము. దేవా, మేము పరిశుద్ధంగా నడవడానికి మరియు నీకు నమ్మకంగా సేవ చేయడానికి నీ శక్తి చేత మమ్మును బలపరుచుము. ప్రభువా, మేము అడుగుచున్నప్పుడు, నీవు జవాబు ఇస్తావని మేము నమ్ముచున్నాము మరియు మా జీవితంలో నీ మహిమ బయలుపడుట మేము చూచునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.