నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ జీవితమును తన దైవీక జీవంతో నింపాలని కోరుకుంటున్నాడు. ఈ రోజు, ఆయన తన జీవజలమును మీ ఆత్మలో, మీ శరీరంలో మరియు మీ కుటుంబంలో కుమ్మరించుచున్నాడు. ఆయనే జీవజలనది; మీలోని ప్రతి వాడబారిన, అలసిపోయిన భాగమును నూతనపరచాలని ఆయన ఎంతో మీ పట్ల ఆశించుచున్నాడు. బహుశా! ఈ రోజు మీరు, 'నా బలం క్షీణించిపోయినది; ఆధ్యాత్మికంగా నేను ఎండిపోయినట్లుగా, అలసిపోయినట్లుగా ఉన్నాను' అని అంటుండవచ్చును. అలాగైతే, ధైర్యం తెచ్చుకోండి! దేవుని జీవం ఇప్పుడే మీ వైపు ప్రవహించుచున్నది. నేడు మిమ్మును బలపరచడానికి, నూతనపరచడానికి మరియు మీ కొరకు ఆయన సిద్ధపరచిన స్థానమునకు మిమ్మును చేర్చడానికి ఆయన కృప మీ మీద కుమ్మరించబడుతుంది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 27:3వ వచనము మన కొరకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, " యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, ఇది ఎంతటి గొప్ప నమ్మకము కదా! మీ ఆత్మ అలసిపోయినప్పుడు, మీ హృదయం శూన్యంగా అనిపించినప్పుడు లేదా పరిస్థితులు మీ బలమును నాశనము చేయుచున్నట్లుగా అనిపించినప్పుడు, ప్రభువు తానే స్వయంగా మిమ్మును నూతనపరచడానికి, మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఆయన తన యొక్క నిత్యజీవమును మీ మీద కుమ్మరించుచూ, తన జీవమును మీ మీద కుమ్మరించుచూ, దివారాత్రములను ప్రతి క్షణం మిమ్మల్ని భద్రంగా కాపాడుతూ ఉంటాడు.

ఈ మాట నాకు ఒక గ్రామానికి చెందిన రైతును గుర్తుకు వచ్చినది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన మా అంకుల్‌గారు తరచుగా రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక సాయంత్రం, తన పొలాల వైపు వెళ్లుచున్న ఒక రైతును చూచి, ఆయన, అర్ధరాత్రి వేళ ఇంత ఆలస్యంగా పొలానికి ఎందుకు వెళ్తున్నారు? అని అడిగారు. అందుకు ఆ రైతు ఇలా జవాబిచ్చాడు: ' అయ్యా, నా పని రాత్రిపూట మొదలవుతుంది, ఎందుకంటే అప్పుడే విద్యుత్ సరఫరా ఉంటుంది. అప్పుడు మాత్రమే నేను మోటార్ పంపును నడిపి, బావి నుండి నీటిని తోడగలను. రాత్రంతా నేను కాలువ నుండి పారుచున్న నీటిని పరిశీలిస్తూ, కలుపు మొక్కలు లేదా అడ్డంకులను తొలగిస్తూ, ప్రతి మొక్కకూ తగినంత నీరు అందేలా చేస్తాను. నా సొంత పిల్లలను చూసుకున్నట్లుగానే, నేను ఈ పంటలను కూడా ఎంతో జాగ్రత్తగా పరామర్శిస్తుంటాను. అప్పుడే, ఈ పొలాలకు నీరు అందుతుంది. తద్వారా, మా కుటుంబానికి ఆహారం లభిస్తుంది. అలాగే పంట దిగుబడి ద్వారా అనేక ఇతర కుటుంబాలు కూడా మేలు పొందుచున్నవి కదా! అని చెప్పాడు. అవును, విశ్వసనీయమైన శ్రద్ధకు ఇది ఎంత అద్భుతమైన దృశ్యం కదా! నా ప్రియులారా, ఈ భూలోకపు రైతు తన పంటల సంరక్షణ కోసం నిద్రలేని రాత్రులు గడపడానికి ఇష్టపడినట్లయితే, మన పరలోకపు తండ్రి తన పిల్లలైన మన పట్ల ఇంక ఎంత ఎక్కువగా కాపాడతాడు? కదా! అందుకే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, " నేను కాపాడువాడను కునుకను నిద్రపోను. నేను నిన్ను నిరంతరము కాపాడుచున్నాను. నేను కాపాడుచూ, నిన్ను రక్షించెదను, నీకు చెందిన సమస్తమును కాపాడి సంరక్షించుచున్నాను, నా జీవజలముతో నిన్ను సేదతీర్చుచున్నాను, మరియు రాత్రింబగళ్లు నిన్ను క్షేమంగా కాపాడుతాను'' అని సెలవిచ్చుచున్నాడు. ఈనాడు, నా ప్రియులారా, ఆయన నిరంతరమైన కాపుదల నిమిత్తము ప్రభువుకు కృతజ్ఞతలను తెలియజేసి, ఇలా చెప్పండి, 'ప్రభువా, నన్ను కాపాడుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. నా జీవితాన్ని నిరంతరం సేదతీర్చుచున్నందుకు, పగలు రాత్రి నన్ను కాపాడుచున్నందుకు నీకు కృతజ్ఞతలు ' అని చెప్పినప్పుడు, నిశ్చయముగా, ఆయన మిమ్మును నిరంతరము భద్రంగా కాపాడుతాడు.

నా ప్రియులారా, జీవజలనదులు మీలో ప్రవహించుచున్నప్పుడు, రక్షణ నది కూడా మీ హృదయములను నింపుతుంది. శోధనలు, పాపభోగేచ్ఛలను మరియు పాపపు ప్రభావాలు మనలను చుట్టుముట్టబడియున్న ఈ లోకంలో మనము జీవించుచున్నాము. అయినప్పటికిని, ప్రభువు మన జీవితములోనికి తన శుద్ధజలములను నిరంతరం కురిపిస్తూనే ఉంటాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 12:3వ వచనములో చూచినట్లయితే, " కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు'' అని ప్రకటించబడినట్లుగానే, మనము ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనునట్లుగా చేస్తాడు. ఇంకను యెహెజ్కేలు 36:25వ వచనములో చూచినట్లయితే, ప్రభువు ఇలాగున వాగ్దానము చేయుచున్నాడు; " మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను '' అని చెప్పబడినట్లుగానే, ఆయన, 'నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, అప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారు; మీ సమస్త అపవిత్రత నుండి మరియు మీ సమస్త విగ్రహముల నుండి నేను మిమ్మును పరిశుద్ధపరుస్తాను' అని అంటున్నాడు. అవును, ఆయన తన యొక్క శుద్ధజలముల ద్వారా ప్రతి పాపపు మాలిన్యమును కడిగి శుభ్రపరుస్తాడు, మనలో ఉన్న అపరాధభావమును తొలగించబడుతుంది. పవిత్రతను పునరుద్ధరిస్తుంది మరియు మన హృదయాలను నూతనపరుస్తుంది. నా ప్రియులారా, మన యొక్క ప్రతి పాపపు అలవాటు, పాపపు కోరిక, అపరాధభావన మరియు ప్రతి బంధకము నుండి ఆయన మనలను శుభ్రపరచి, జీవజలనది ద్వారా కడిగివేయబడుచున్నవి. యేసుక్రీస్తు ద్వారా మనం క్షమాపణ, విడుదల మరియు ఒక నూతన ప్రారంభమును పొందుకుంటాము. నా ప్రియులారా, ఈ రోజు మీరు అన్యాయాన్ని మరియు అవినీతిని ఎదుర్కొని ఉండవచ్చును లేదా ప్రజలచేత అపార్థం చేయబడి ఉండవచ్చును. ప్రభువు మిమ్మును మర్చిపోలేదు. అందుకే బైబిల్ నుండి ఆమోసు 5:24వ వచనములో చూచినట్లయితే, "నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి '' అని చెప్పబడినట్లుగానే, మీ పట్ల న్యాయం, నీతి నదివలె ప్రవహించును గాక మరియు నీతి ఎన్నటికి ఇంకిపోని ఏరువలె పారును గాక! అని ప్రకటించుచున్నది. దేవుని నీతి ఒక మహా నదివలె మీ జీవితంలోనికి ప్రవహించుచున్నదని ఆయన వాగ్దానమును చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి లూకా 18:7-8వ వచనములో చూచినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పు చున్నాను'' ప్రకారముగా, రాత్రింబవళ్లు తనకు మొఱ్ఱపెట్టుకునే తన ప్రజలకు దేవుడు తప్పక న్యాయం చేస్తాడని యేసు మన పక్షమున వాగ్దానము చేయుచున్నాడు. ఆయన నిర్ణయించిన సమయం మన సహనాన్ని పరీక్షించవచ్చును, కానీ ఆయన తన బిడ్డల పక్షాన నిలిచి వారిని సమర్థించడంలో ఎప్పటికీ విఫలం కాడు.

చివరగా, యేసు మరొక నదిని గురించి-అనగా పరిశుద్ధాత్మ నది గురించి-మాట్లాడుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 7:37-39వ వచనములలో చూచినట్లయితే, " నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.'' అవును, పరిశుద్ధాత్మ మీ జీవితమును నింపినప్పుడు, ఆయన సన్నిధి మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రవహించుచున్నది. మీ మాటలు, కోపం, అసహనంతో కూడినవిగా కాకుండా, జీవమును కలిగించునట్లుగా మార్చబడుచున్నవి. నాప్రియులారా, మీ కుటుంబం దేవుని సమాధానాన్ని అనుభవించును. అనేకమందిని ఆశీర్వదించడానికి ప్రభువు మీ జీవితం ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు; మీరు ఆయన జీవముగల మాటలను పలికినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అందుకే బైబిల్ నుండి యోహాను 4:14వ వచనములో చూచినట్లయితే, " నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును '' అని చెప్పబడినట్లుగానే, యేసు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని కూడా ఇచ్చుచున్నాడు. వాస్తవంగా, ఆయన ఇచ్చు నీళ్లు మీలో నిత్యజీవమును ఉబుకు నీటి ఊటగా మారుతాయి. మానవ హృదయములో ఉన్న లోతైన దాహమును యేసు మాత్రమే తీర్చగలడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ప్రతిరోజు ఆయన ఇచ్చు జీవజలములను త్రాగినప్పుడు, మీరు ఎన్నటికీ దప్పికగొనరు. దానికి బదులుగా, మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి జీవమును, నిరీక్షణను మరియు సేదతీర్పును అందించే ఆశీర్వాద ప్రవాహంగా మార్చబడతారు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నిరంతరము ఎండిపోని జీవజలనదిగా మారినందుకై నీకు వందనములు. దేవా, మా ఆత్మలో, శరీరంలో మరియు కుటుంబంలో నీ జీవజల ఊటలు పారునట్లుగా నీ కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి అలసిన భాగాన్ని సేదదీర్చి, నీ కృపతో నన్ను బలపరచుము. యేసయ్యా, మా యొక్క ప్రతి పాపమును నీ యొక్క శుద్ధజలములను చల్లి, పవిత్రపరచుము. దేవా, మాలో ఉన్న ప్రతి అపరాధభావమును తొలగించి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి విషయంలోను నీ యొక్క నీతి న్యాయం జరిగించుము. దేవా, మా ఆపత్కాలములో కూడా నిన్ను నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ద్వారా జీవజల నదులు ప్రవహించునట్లుగాను, తద్వారా, మా కుటుంబమును మరియు మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించునట్లుగా చేయుము. దేవా, పగలు మరియు రాత్రి మమ్మును మరియు మా కుటుంబమును, మేము కలిగియున్న సమస్తమును కాపాడుము. ప్రభువా, నీ యొక్క పరిపూర్ణ చిత్తంలో మమ్మును నడిపించి, మా జీవితం ఎల్లప్పుడూ నిన్ను మహిమపరచునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.