నా ప్రియమైన వారలారా! నేడు ప్రభువు ఉన్నతమైన ఆశీర్వాదములను మీకు అనుగ్రహించబోవుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:1వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు సెలవిచ్చినది ఏదైనను సరే, అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ రోజు యేసు నామమున నేను ప్రకటించుచున్నాను: " లేచి ప్రకాశించండి, మీకు వెలుగు వచ్చియున్నది!'' ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చును? అందుకే బైబిల్ నుండి యోహాను సువార్త 8:12వ వచనములో చూచినట్లయితే, "మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను'' ప్రకారము ఆయనలో ఏ మాత్రము చీకటి ఉండదు. ఆయనను వెంబడించువారు చీకటిలో నడవరు, కానీ జీవపు వెలుగును కలిగి ఉంటారు. ఆయన వెలుగు జీవమును, రక్షణను, నడిపింపును అనుగ్రహించుచున్నది. కనుకనే, మీరు యేసును మీ హృదయములోనికి ఆహ్వానించినప్పుడు, మీరు లోకమునకు వెలుగుగా మార్చబడుదురు. అందుకే బైబిల్ నుండి మత్తయి 5:14వ వచనములో చూచినట్లయితే, "మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగైయుండనేరదు'' అని వాగ్దానము చేయబడినట్లుగానే, మీరు కొండ మీద ఉన్న పట్టణమువలె ప్రకాశించెదరు. దేవుని వెలుగు మీ చుట్టూ ఉన్నవారికి చేరుతుంది. యేసు వచ్చినప్పుడు ప్రజలు గొప్ప వెలుగును చూసినట్లుగానే, మీరు ఆయనతో నింపబడినప్పుడు మీ జీవితం ప్రకాశిస్తుంది. యేసు నామములో ఈ కృపను మీరు ఇప్పుడే పొందండి.

మొదటగా, దేవుని వెలుగు మీ ద్వారా సత్‌క్రియలను జరిగించుచున్నది. అందుకే బైబిల్ నుండి మత్తయి 5:16 వ వచనములో మనము చూచినట్లయితే, "మనుష్యులు మీ స్రత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి'' అని చెప్పబడినట్లుగానే, మీ స్రత్కియలను చూచి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ప్రజల యెదుట మీ వెలుగు ప్రకాశించునట్లుగా చేస్తాడు. రెండవదిగా, బైబిల్ నుండి 1 రాజులు 19:7వ వచనములో చూచినట్లయితే, "అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న యొక గుహలో చేరి బసచేసెను'' అని చదివినట్లుగానే, ఏలీయా చీకటిని, నిరుత్సాహామును అనుభవించాడు. ప్రభువు శక్తి ద్వారా, అతను పరలోకము నుండి అగ్ని దిగివచ్చునట్లుగా చేసి, ప్రభువు ఒక్కడే దేవుడని నిరూపించి, ప్రజలందరు ఆయనను ఆరాధించునట్లుగా నడిపించాడు.

ఈ విషయమును విన్న రాణియైన యెజెబెలు, దుష్టాత్మతో నిండినదై, ఏలీయాను ఇలాగున బెదిరించినది: యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక! ఏలీయా ప్రభువును గురించి సాక్ష్యమివ్వడం, ఆయన నామమున అద్భుతములను జరిగించడము, ప్రజలను దేవుని అంగీకరించునట్లుగా నడిపించడము చూచి, ఆమెకు కోపము కలిగినది. ఏలీయా నిరుత్సాహపడి, "తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థన చేసెను. రాణి గానీ, అధికారంలో ఉన్న మరెవరైనా సరే తనను చంపుటకంటే, తానే స్వయంగా తన ప్రాణమును తీసుకొనుమని అతను దేవుకిని మొఱ్ఱపెట్టాడు. అయితే ప్రభువు ఒక దూతను పంపాడు; 'అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. '

ఆలాగుననే, ప్రభువు ఏలీయాను బలపరచి, తనకు ముందున్న ప్రయాణానికి అతని సిద్ధపరచాడు. రాబోవు కార్యములను గురించి అతనికి దైవీకమైన నడిపింపును, ప్రవచనపరమైన సూచనలను ఇచ్చాడు. ఏలీయా ప్రభువు ఇచ్చిన బలముతో తన ప్రయాణమును కొనసాగించాడు; దేవుడు అతడిని ఆ రాణి నుండి తప్పించి, కాపాడాడు. అతడు దేవుని పర్వతమైన హోరేబునకు చేరుకున్నప్పుడు, యెహోవా అతనితో ఇలాగున మాట్లాడియున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 రాజులు 19:15-16వ వచనములలో చూచినట్లయితే, "అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము; ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అని యెహోవా ఏలీయాకు ఆజ్ఞాపించాడు. ఏలీయా ఎలీషాను అభిషేకించియున్నాడు; ఆ తర్వాత, దేవుని ఆజ్ఞల మేరకు ఎలీషా హజాయేలును మరియు యెహూను రాజులుగా అభిషేకించాడు. కాలక్రమేణా యెహూ రాజుగా మారి, రాణియైన యెజెబెలు జీవితమునకు అంతమును పలికాడు. ఆమె దేవుని యొక్క బిడ్డలను హింసించడానికి, నాశనం చేయడానికి దుర్మార్గమైన చట్టాలను అమలు చేసినది. యెహూ ద్వారా ఆమె పాలన అంతమైంది; ప్రభువు చెప్పిన మాట నెరవేరునట్లుగా కుక్కలు ఆమె రక్తమును నాకునట్లుగా చేసెను.

నా ప్రియులారా, ప్రభువు మనకు ప్రవచన వాక్కులను అనుగ్రహించి, మనలో తన వెలుగును ఉంచుతాడు. ఆయన వాక్యము మనలో నివసించి, మనము దానిని ప్రజలకు ప్రకటించి నప్పుడు, ఆయన యువతను ప్రవక్తలనుగా లేవనెత్తి, రాజుల సమక్షంలో తన వాగ్దానమును ప్రకటించునట్లుగా చేస్తాడు. ఆయన శక్తి ద్వారా, దుష్ట అధికారములు కూలిపోవును మరియు వారి చెడు పథకాలు అంతమవుతాయి. నా ప్రియులారా, ప్రభువు మన జీవితములోనికి మరియు కుటుంబములోనికి, పని స్థలములోనికి తన వెలుగును పంపుతాడు. మీరు స్వయంగా అన్ని కార్యములను మీ చేతులలోనికి తీసుకొనవలసిన అవసరము లేదు, ఎవరిని నాశనం చేయవలసిన పని కూడా లేదు. దేవుని ఆత్మతో నింపబడి, ఆయన నామమున ప్రవచించండి. ప్రభువు తానే మీ పట్ల తన కార్యములను నెరవేర్చును. ప్రభువు మీకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించును గాక! నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, మా జీవితం, మా కుటుంబం, మేము పని చేయుస్థలము మరియు మేము చేయు ప్రతి పని మీద నీ వెలుగు ప్రకాశించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితము నుండి ప్రతి చీకటిని, నిష్ఫలతను తొలగించుము. యేసయ్యా, నీవు జీవపు వెలుగు ద్వారా మా జీవితములో ఉన్న చీకటిని తొలగించి, మేము నీ వెలుగులో నడుచుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా సత్‌క్రియలను ఇతరుల యెదుట ప్రకాశించి, నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా భవిష్యత్తును గురించిన మాలో ఉన్న భయము, నిరుత్సాహము మరియు బెదిరింపులను ఎదుర్కొచున్నప్పుడు నీ శక్తి ద్వారా మమ్మును బలపరచుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము మరియు నీ ప్రవచన వాక్యమును మాకు దయచేయుము. ప్రభువా, మేము లేచి, తేజరిల్లునట్లుగాను, నీ ఉద్దేశమును నెరవేర్చునట్లుగాను మమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించుము. దేవా, నీ సన్నిధి ద్వారా మా పిల్లలను, కుటుంబం మరియు సంఘమును ఆశీర్వదించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.