నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి విలాపవాక్యములు 3:25వ వచనం తీసుకొనబడినది. ఆ వచనము, "తన్ను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపువాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవునియందు నిరీక్షణ కలిగియున్న వారికిని మరియు ఆయనను వెదకువారికిని ఆయన మేలు జరిగిస్తాడు. కనుకనే, ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుట వలన మీరు ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? ఒకవేళ, మీరు 'నేను కూడా ఎంతో కాలముగా కనిపెట్టుకొనియున్నాను' అని తలంచుకొనుచుండవచ్చును. అయితే, ఆయన కొరకు కనిపెట్టుకొనియుండుట వలన మీరు ఏమి పొందుతారో అని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చును. ప్రభువు మీకు తప్పకుండా సహాయము చేస్తాడనియు మరియు మీ పట్ల న్యాయమును జరిగిస్తాడనియు, ఇంకను నీతిగా ప్రవర్తిస్తాడని మీరు ఎదురుచూస్తూ నమ్ముచున్నారా? అయితే, ప్రభువు నిశ్చయముగా మీకు మేలు జరిగిస్తాడు. అందుకే బైబిల్ నుండి లూకా 18:7,8వ వచనములలో మనము చూచినట్లయితే, " దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మీరు రాత్రింబగళ్లు ప్రభువుకు మొరపెడుతూ ఆయన కొరకు కనిపెట్టుకొని యుంటూ ఎదురుచూస్తున్నారా? " ప్రభువా, మా పట్ల న్యాయము జరిగించుము, సరైన కార్యమును మా పట్ల జరిగించుము. ఈ కార్యమును నీ హస్తములకు అప్పగించుకొనుచున్నాము; మేము స్వయంగా జోక్యం కలుగజేసుకొనకుండా, నీ హస్తములకు అప్పగించుకొనుచున్నాము'' అని మీరు అంటున్నారా? అయితే, మీరు మీ కార్యములన్నిటిని దేవుని హస్తాలకు అప్పగించి, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన నిశ్చయంగా మీకు త్వరలోనే న్యాయమును తీర్చి, మీ పట్ల నీతిని జరిగిస్తాడు.

అంతేకాకుండా, యెహోవా కొరకు ఎదురుచూచేవారు తమ బలమును నూతన పరచుకుంటారని లేఖనము సెలవిచ్చుచున్నది. అందుకే బైబిల్ నుండి యెషయా 40:31 వ వచనములో చూచినట్లయితే, " యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని కొరకు కనిపెట్టుకొనియున్నప్పుడు మీరు నూతన బలమును పొందుకుంటారు. అంతమాత్రమే కాదు, మీరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన మీ జీవితములోని ప్రతి రంగములోను సమస్తమును నూతనముగా మారుస్తాడు. అది మీ జ్ఞానము నూతనపరచబడుతుంది, మీరు పనిచేసే ప్రాంతము రూపాంతరపరచబడుతుంది. మీ సంబంధాలు పునరుద్ధరించబడతాయి. మీ అవయవాలు కూడా పునరుద్ధరణను పొందుకుంటాయి. అప్పుడు మీరు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మీరు ఉన్నత స్థానములకు ఎదగడానికి, విడుదలను అనుభవించడానికి ప్రభువు మీకు సహాయము చేస్తాడు. ఇంకను ఆయన కొరకు ఎదురు చూచు మిమ్మును వెనకకు లాగివేయుచున్న ప్రతి బంధకములు మీ నుండి ఇప్పుడే తొలగింపబడుచున్నవి. మీరు సొమ్మసిల్లినప్పుడు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కనుకనే, ప్రభువు కొరకు ఎదురు చూచుట ద్వారా మీరు పొందుకొను గొప్ప కృప ఇదియే.

నా ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు 'నిరీక్షణతో నింపబడి, పొంగిపొర్లునట్లుగా' ఉండాలని మనకు లేఖనము స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 15:13వ వచనములో చూచినట్లయితే, "కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక '' అని చెప్పబడినట్లుగానే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నిరీక్షణ, ఆనందము మరియు సమాధానముతో నింపబడుదురు. ఇంకను మీ కుటుంబములోనూ, ఉద్యోగ స్థలములోనూ సంతోషము నెలకొంటుంది. అలాగే మీ జీవితములోని ప్రతి విషయములోనూ సమాధానము ఉంటుంది. అంతమాత్రమే కాదు, యేసు నామములో, శ్రేష్ఠమైన గోధుమలతో మిమ్మును తృప్తిపరచే కృప నేడు మీకు తోడుగా ఉంటుంది. ఇంకను మీ పిల్లల విషయములోనూ, మీ వివాహ జీవితములోనూ మరియు మీ పని స్థలములోనూ విధేయతను, సమాధానమును కలుగజేయడానికి ప్రభువు సమర్థుడు. మీ పిల్లల నుండి మరియు మీ నుండి తిరుగుబాటు స్వభావం తొలగిపోయి, సమస్తమూ ప్రభువు చిత్తానికి లోబడి ఉండునట్లుగా ఆయన ఈ రోజు మీ పట్ల జరిగిస్తాడు. మీ జీవితము మీద దేవుని ఆశీర్వాదములను శిఖరముల వలె ఉన్నతముగా ఉంచడానికి ప్రభువు సమర్థుడైయున్నాడు.

ఇంకను నా ప్రియులారా, బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనములో చూచినట్లయితే, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ఎదురు చూస్తున్న భవిష్యత్తును మీకు అనుగ్రహించుటకు మీ పట్ల దేవునికి అనేక ఉద్దేశములు ఉన్నవని నాకు తెలుసు; అవి హానికరమైనవి కావు, సమాధానమును ఇచ్చునవి మాత్రమే. కనుకనే, నా ప్రియులారా, నేడు మీ పట్ల దేవుని ప్రణాళికలు సమాధానమును మరియు నిరీక్షణను కలిగించు భవిష్యత్తును ఇచ్చునవిగా ఉంటున్నాయి. కనుకనే, నేడు మీరు ఆయన కొరకు ఎదురుచూస్తూ, ఆయనను వెదకుచున్నప్పుడు, మీ జీవితములో సమస్తమును నూతనపరచబడుతుంది, నూతన బలము పొందుకుంటారు. మీ జీవితములో ఆయన మంచితనం మరియు ఆశీర్వాదములు వర్థిల్లును గాక. ఇంకను మీ జీవితములో సమస్తమును సమాధానముగా ఉండును గాక. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీ కొరకు సహనముతో కనిపెట్టుకొనియుంటన్లుగాను మరియు భయభక్తులు కలిగిన హృదయంతో నిన్ను వెదకుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితములోని వెనుకబడియున్న సమస్త విషయములోను మాకు న్యాయమును మరియు నీతిని కలిగించునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మా బలమును, జ్ఞానమును, ఆరోగ్యమును, సంబంధములను, పనిని మరియు పునరుద్ధరణ అవసరమైన ప్రతి రంగమును నీ బలము చేత నూతనపరచుము. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మును నిరీక్షణతో, ఆనందముతో మరియు సమాధానముతోను నింపుము. దేవా, మా కుటుంబము మరియు కార్యాలయము నుండి ప్రతి బంధకములను పడగొట్టి, ప్రతి తిరుగుబాటు ఆలవాటును మా నుండి తొలగించుము. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించి, నీ మార్గములలో మమ్మును నడిపించుము. దేవా, మాకు రావలసిన ప్రతి ఆశీర్వాదములను సరైన సమయంలో మా యొద్దకు తిరిగి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యొక్క పరిచర్య చేయుటకును మరియు తద్వారా అనేకులకు మేము ఆశీర్వాదకరమంగా ఉండునట్లుగా సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.