నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 3:26వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులై యున్నారు'' అని చెప్పబడినది. అవును, ఈ వాక్యానుసారముగా మీరు దేవుని బిడ్డలై ఉంటున్నారు. నా ప్రియులారా, యేసుక్రీస్తు మీ కొరకు ఆ సిలువలో మరణించాడు అని విశ్వసించండి మరియు మీరు ఆయనను నమ్మండి. ఎందుకనగా, సిలువ ద్వారానే మీరు విజయమును పొందగలరు. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 5:4వ వచనములో చూచినట్లయితే, " దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' అని చెప్పబడినట్లుగానే, మన విశ్వాసము ఈ లోకమును జయించునదిగా ఉండవలెను. సిలువలో ఆయన పొందినటువంటి శ్రమలన్నిటి ద్వారా ప్రభువు మీకు విజయమును అనుగ్రహించియున్నాడని మీరు విశ్వసించండి.
నా ప్రియులారా, ఆలాగుననే, బైబిల్‌లో మన పితురుడైన అబ్రాహామును చూడండి. అతడు ఎంతో విశ్వాసముతో జీవించాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 27:13వ వచనములో చూచినట్లయితే, " సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని దయను పొందుటలో నమ్మకముగా ఉండవలెను. అందుకే అబ్రాహాము దేవునియందు విశ్వాసముంచెను, గనుకనే అతడు తద్వారా నీతిమంతుడుగా యెంచబడియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదములను మరియు అభిషేకమును అతడు పొందుకొనియున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 7:9వ వచనములో చూచినట్లయితే, "మీరు నమ్మకుండిన యెడల స్థిరపడక యుందురు'' అని లేఖనములో చెప్పబడినట్లుగానే, మీరు ఆయనను నమ్మనట్లయితే, మీరు స్థిరపడక ఉంటారు. కనుకనే, మీరు స్థిరపడవలెననగా దేవుని యందు నమ్మకముంచవలెను.
బైబిల్‌లో నోవహు జీవితమును చూచినట్లయితే, అతడు దేవుని విశ్వసించియున్నాడు. దేవుడు చెప్పిన వాటన్నిటియందు అతడు విధేయత చూపియున్నాడు. అందును బట్టి, అతడు మరియు అతని కుటుంబమంతయు కూడా ఆ గొప్ప వినాశము నుండి కాపాడబడ్డారు. అదేవిధముగా, బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో సౌలు అను వ్యక్తిని గురించి మనము చదవగలుగుచున్నాము. అతడు ప్రభువును అనుసరించినటువంటి వ్యక్తి. దేవుని యొక్క ప్రజలందరిని అతడు హింసించుచూ, సంహరించుచుండెచూ, అయితే, ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతనిని వ్యక్తిగతంగా దర్శించాడు. ఆయన సౌలును చూచి, "సౌలా, సౌలా, ఎంతకాలము నన్ను హింసించెదవు'' అని అడిగినప్పుడు, సౌలు యథార్థంగా దేవుని వెదకియున్నాడు. తద్వారా, అతడు దేవుని యొక్క ఆదరణను పొందుకొనుట ద్వారా అతను దేవుని యందు కృపను పొందినవాడుగా ఉంటూ, దేవుని యొక్క కరుణాపాత్రగా మారియున్నాడు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క పరిచర్యను చేయుటకు మొదలు పెట్టాడు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, కనుకనే, మీరు ప్రభువు యొద్దకు రండి. ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్య యొక్క సిలువ వైపు చూడండి. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు చెప్పినట్లుగానే, ప్రభువు మీ కొరకే సిలువలో తన ప్రాణమును అర్పించియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఆయనను మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించినప్పుడు మీ జీవితము ఆశీర్వదింపబడిన జీవితముగా మారిపోతుంది. అటువంటి జీవితమును పొందుకొనుటకు, ఇప్పుడే మిమ్మును మీరు సౌలు వలె దేవుని చేతులకు అప్పగించుకొని, అబ్రాహాము వలె ఆయన యందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా, ఉగ్రత పాత్రగా ఉన్న మిమ్మును కరుణాపాత్రగా మార్చి, ఆయన సేవలో మిమ్మును పౌలువలె బలంగా వాడుకుంటాడు. అబ్రాహాము వలె మిమ్మును ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగలిగిన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీవు మా కొరకు ఆ సిలువలో నీ ప్రాణమును అర్పించినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము మరియు మా ప్రియులు చెడు మార్గములో నడుచుకొనకుండునట్లుగా మమ్మును సిలువశక్తి ద్వారా కరుణాపాత్రగా మార్చుము. దేవా, నిన్ను మా రక్షకునిగా అంగీకరించునట్లుగా మా హృదయమును తాకుము. యేసయ్యా, మా యొక్క పాపములన్నియు క్షమింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ కుమారుడైన యేసుక్రీస్తునందు సజీవులముగా జీవించునట్లుగా చేయుము. దేవా, సౌలును దర్శించి సౌలును పౌలుగా మార్చినట్లుగానే, నీ వాక్యము ద్వారా మమ్మును దర్శించి, పౌలువలె మా జీవితములను మార్చుము. దేవా, మేము నిన్ను విశ్వసించి, అబ్రాహాము వలె మేము విశ్వాసములో స్థిరంగా నిలిచి ఉండునట్లుగా మాకు సహాయం చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


