హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సంఖ్యాకాండము 6:26వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక'' అని లేఖములో చెప్పబడినట్లుగానే, దేవుని యొక్క సన్నిధి మీ మీద ఉదయింపజేయాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఈ రోజు మీరు నిద్రలేమి రాత్రుల చేత ఎంతగానో బాధింపబడియున్నారేమో? మీ జీవితములో సమాధానము లేక కష్టపడుచున్నారేమో? మీ జీవితములో అనేకులు చదువు ముగించుకొని ఆ తర్వాత ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఒకవేళ మీరు ఉండవచ్చును. మీ కోర్సు ముగించుకొని, ఉద్యోగము కొరకు వెదకుచున్నారు కానీ, ఎక్కడ ఉద్యోగము దొరకని పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో?లేక మీలో అనేకులు మీ బిడ్డలను గురించి చింతించుచూ రాత్రింబగళ్లు వారి కొరకు ఆలోచించుకొనుచు నిద్రలేమిలో ఉన్నారేమో? ఇవన్నియు కూడా మీ హృదయములో సమాధానము లేకుండా చేయుచున్నవా? అయితే, చింతించకండి.

అయితే, నా ప్రియులారా, అటువంటి మిమ్మును చూచి, ఈ రోజు ప్రభువు అంటున్నాడు కదా, 'ఆయనే మీకు సమాధానమును ఇస్తాను ' అని సెలవిచ్చుచున్నాడు. అందుకే "యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక'' అని నేటి వాగ్దానములో చెప్పబడినట్లుగానే, ఆయన మీకు సమాధానమును కలుగజేస్తాడు. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము కదా! ఆలాగుననే, ఎంత అద్భుతమైన దేవునిని మనము కలిగియున్నాము కదా! మన జీవితముల మీద ఆయన పూర్తి అధికారము కలిగియున్నాడని మనము విశ్వసించినప్పుడు, మనము దేని కొరకు చింతించము కదా! అవును, నా ప్రియులారా, అనేకసార్లు, ' నేను కూడా ప్రభువా, భవిష్యత్తులో నేను ఏమి చేస్తానో నాకు తెలియలేదు అని ఆలోచిస్తాను. నేను ఎక్కడ పనిచేయాలి? నా పిల్లలను, ఆలాగే, నా పరిచర్యను మరియు నా యొక్క వైద్య వృత్తిని నేనెలాగున చూచుకొనగలను? అని ఆలోచిస్తాను. ' తద్వారా, అనేకసార్లు నిద్రలేమి రాత్రులను కూడా నేను గడిపియున్నాను.

కానీ, నా ప్రియులారా, అదేవిధముగా, నేడు మీరు కూడా, 'ప్రభువా, నాకు మార్గమును చూపెట్టుము. నేను ఎక్కడికి వెళ్లాలి?' అని ఏడ్చియుండవచ్చును. ఆలాగుననే, మీ మనస్సులో ఎంతగానో సందేహములతో నిండి ఉండవచ్చును. కానీ, అటువంటి మిమ్మును చూచి, ఈ రోజు ప్రభువు అంటున్నాడు, 'ఆయన మిమ్మును తన సమాధానముతో నింపుతాను '' అని సెలవిచ్చుచున్నాడు. ఆలాగుననే, ప్రభువు మిమ్మును గూర్చి పట్టించుకొనుచున్నాడు, మీరు తెలుసుకున్నప్పుడు, ఏదియు కూడా మీ సమాధానమును మీ నుండి తొలగించలేదు. ఇంతవరకు మిమ్మును నడిపించిన దేవుడు, అంతము వరకు కూడా మిమ్మును నడిపిస్తాడు. కాబట్టి, నా స్నేహితులారా, మీరు దేనిని గురించి చింతించకండి మరియు భయపడకండి. ప్రభువు మిమ్మును సరైన దిశలో నడిపించి, తన సమాధానమమును మీకు అనుగ్రహిస్తాడు. అందును బట్టి, మీ కుటుంబములో మరియు మీ యొక్క గృహములో సమాధానమును మీరు కలిగియుంటారు. అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు యేసయ్య దగ్గర నుండి అటువంటి సమాధానమును పొందుకొనండి. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సమాధానమునకు కర్తయైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, మా పట్ల నీవు శ్రద్ధ వహించే ఇంతటి అద్భుతమైన దేవుడవైనందుకు నీకు వందనములు. ప్రభువా, మా భవిష్యత్తులను నీ హస్తములో నీవు భద్రపరచియున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మమ్మును గురించి పట్టించుకుంటూ, మేము కార్చుచున్న కన్నీటిని నీవు చూస్తున్నావని మేము నమ్మునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మా హృదయాలలో కలుగు సందేహములను నీవు చూస్తున్నావయ్యా? అనేక రాత్రులు మేము నీకు మొఱ్ఱపెట్టినప్పుడు, నీవు మా పక్కనే ఉండి, వాటన్నిటిని చూచియున్నావు, కనుకనే, ఈ రోజు నీ యొక్క సమాధానముతో మమ్మును నింపుము. ప్రభువా, నిద్రలేమి రాత్రులను మాలో నుండి తీసివేసి, మాలో ప్రతి ఒక్కరిని ఈ రోజు, నీ యొక్క సమాధానముతో నింపుము. తండ్రీ, నీ ముఖమును మా మీద ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబములో ఉన్న చిన్న బిడ్డల మీద కూడా నీ యొక్క ముఖకాంతిని కలుగజేసి, వారు నడువవలసిన మార్గమును వారికి తెలియజేయుము. యేసయ్యా, కలహాలు మరియు మనస్పర్థములను ఎదుర్కొంటున్న మా కుటుంబములో నీ యొక్క సమాధానమును మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క సమాధానము మా హృదయాలను మరియు గృహాలను నింపునట్లుగా చేయుము. యేసయ్యా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించి, నీ మార్గములలో నడుచునట్లుగా మాకు మరియు మా కుటుంబమునకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, అమేన్.