నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 5:2వ వచనమును అద్భుతమైన వాగ్దానమును నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...ఆయన (క్రీస్తు) ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము'' ప్రకారము ప్రియులారా, దేవునికి సమీపముగా వెళ్లుట ఎంత గొప్ప భాగ్యమై యున్నది. అర్హత లేకపోయినను కూడా దేవుడు ఇచ్చు భాగ్యము అనగా అర్థము ఏమిటి? అది దేవుని కృపయై యున్నది. దేవుని కృపను పొందుట ఎంతో కష్టతరము. అందుకే బైబిల్ నుండి 1కొరింథీయులకు 15:10వ వచనములో చూచినట్లయితే, "అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని'' అని చెప్పబడిన ప్రకారముగా మనలో పరిశుద్ధత లేకపోయినను, ఆయన మనకు కృప ద్వారా ఒక ప్రత్యేకమైన హక్కును అనుగ్రహించియున్నాడు. అవును, మనలో పరిశుద్ధతను కలిగియున్నప్పుడు నిశ్చయముగా దేవుని కృపను మనము పొందుకొనగలుగుతాము. మనము ఒకప్పుడు దేవునికి దూరస్థులమై యున్నాము. కానీ, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన తండ్రితో సంబంధము గలవారమై యున్నాము. ఈ లోకములో ఉన్న వారందరు కూడా కొన్నిసార్లు పడిపోయి దేవుని మహిమ నుండి వేరైపోతారు. కానీ, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలనను మాత్రమే మనము క్షమింపబడి, మనము దేవుని మహిమను పొందుకొనగలుగుతాము. అనగా, దేవుని దయలో మనము నిలిచియుండగలుగుతాము. ఆలాగుననే, ఒకప్పుడు, మనం దేవునికి దూరంగా ఉండి, పాపంతో వేరు చేయబడినవారము, కానీ యేసుప్రభువు రక్తం ద్వారా, ఇప్పుడు మనం కృపా సింహాసనం యెదుట అంగీకరించబడి, క్షమించబడే ప్రత్యేకమైన హక్కును అనుగ్రహించబడియున్నాము. కనుకనే ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, కృపలో నిలిచియుండడము అనగా అర్థము ఏమిటి? దేవుడు మనలను ప్రేమించుట మాత్రమే కాదు గానీ, ఆయన మన యందు ఇష్టపడుట, సంతోషించుట అని అర్ధము. ప్రభువు మన యందు ఇష్టపడినప్పుడు, మన తండ్రియైన దేవుని రాజ్యములోనికి మనకు నేరుగా ప్రవేశము ఉంటుంది. దేవుని సింహాసనమునకు అతి సమీపముగా చేరుతాము. ఇది ఎంత గొప్ప భాగ్యమై యున్నది కదా! అందుకే బైబిల్ నుండి ప్రకటన 3:20వ వచనములో చూచినట్లయితే, "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము'' ప్రకారము ప్రభువునందు మనము ఆనందపడుట మాత్రమే చూడటము లేదు గానీ, మనము పరిశుద్ధముగా ఉండాలని మన పట్ల ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన, 'మీ హృదయమను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను' అని అంటున్నాడు. కనుకనే, నేడు మీ హృదయాన్ని తెరుస్తారా? నాతో సంబంధము కలిగియుండు అవకాశమును మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడు కూడా అదే ప్రశ్నను అడుగుచున్నాడు, మీ హృదయాన్ని దేవుని వైపునకు తెరుస్తారా? మీ హృదయములోనికి ఆయన వచ్చి, మిమ్మును బలపరచాలనియు, స్థిరపరచాలనియు ఆయన ఎంతగానో మీ పట్ల ఆశించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 5:10వ వచనములో అదే కార్యమును గూర్చి చెప్పబడియున్నది. ఆ వచనము, "తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును'' ప్రకారము అవును, మిమ్మును ఒక స్థిరమైన పునాది మీద ఉంచాలని ప్రభువు ఆశించుచున్నాడు. కనుకనే, మీరు ఉన్న పక్షమున దేవుని యొద్దకు రండి, ఆయన ప్రేమలో ఆనందించండి.

నా ప్రియులారా, ఈరోజే మీ హృదయాన్ని పూర్తిగా యేసుకు ఇవ్వండి. మీ విశ్వాసం మళ్ళీ పునరుజ్జీవింపజేయబడనివ్వండి. బహుశా! మీరు పడిపోయి ఉండవచ్చును లేదా మీ ఆశను కోల్పోయి ఉండవచ్చును - కానీ పేతురు వైఫల్యం తర్వాత తిరిగి పిలిచిన అదే ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. ఆయన మీ బలాన్ని పునరుద్ధరించాలని, మీ ఆత్మను పునరుద్ధరించాలని మరియు ఆయన ప్రేమలో మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కనుకనే, మీరు మీ హృదయాన్ని తెరిచినప్పుడు, మీరు క్షమాపణను మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో ఉండటం వలన కలిగే ఆనందాన్ని కూడా పొందుతారు. కృప బలహీనతను బలంగా, భయాన్ని విశ్వాసంగా మరియు దుఃఖాన్ని హర్షించునట్లుగా మారుస్తుంది. విశ్వాసం లేకుండా, మనం దేవుని చూడలేము; కానీ మనం విశ్వసించినప్పుడు, ఆయన మహిమ మనపై ప్రకాశిస్తుంది. ఇది మీ పునరుద్ధరణ దినంగా ఉండనివ్వండి - ఆయన అద్భుతమైన కృపలో మరోసారి నిలబడటానికి మరియు కృపా సింహాసనం యెదుట ధైర్యంగా నడవడానికి. కనుకనే ఇప్పుడే, మీ హృదయములో యేసయ్యను ప్రేమించడానికి అంగీకరిస్తారా? యేసయ్య యందు విశ్వాసముంచడానికి ఇష్టపడుచున్నారా? మనము ఉంచుచున్న విశ్వాసమును బట్టి మనకు అర్హతలేకపోయినను, తన కృపను మనకు అనుగ్రహించుచున్నాడు. ఎందుకంటే, విశ్వాసము లేకుండా మనము దేవుని చూడలేము. ఆయనకు సమీపముగా చేర్చాలని ప్రభువుకు మనము ఇప్పుడే మొఱ్ఱపెడదాము. ఆయన కలిగియున్న అపారమైన కృపను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్య, మమ్మును నీ కృపలోనికి తీసుకువచ్చినందుకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలమైన మేము నీ యందు విశ్వాసముంచుటకు ఎంతో కష్టపడుచున్నాము. దయతో, ఈ రోజే మమ్మును పునరుద్ధరీకరించి, బలపరచి, విశ్వాసములో మమ్మును స్థిరపరచుము. దేవా, మేము కోల్పోయిన విశ్వాసమును మాకు మరల అనుగ్రహించుము. దేవా, మేము స్థిరమైన పునాది యందు మేము నిర్మించబడుటకు మాకు సహాయము చేయుము. ప్రభువైన యేసయ్యా, నీ యందు విశ్వాసముంచులాగున, నీ ప్రాణమును మా కొరకు ఇచ్చియున్నందున మమ్మును ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, ఇప్పుడు నీ విశ్వాసము నుండి వెనుదిరిగి పడిపోయిన ఉన్నాము, మమ్మును మరల నీ యొద్దకు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితాలలో నీకు ఆయాసకరమైన వాటిని తీసివేసి, మా హృదయములో నీవు పనిచేసి, మమ్మును మరియు మా పిల్లలను రూపాంతరపరచుము. దేవా, అయోగ్యమైన మా జీవితములో నీ కృపను మరియు దయను, నీ ప్రేమను మాకు దయచేయుము. యేసయ్యా, మా పాపముల నిమిత్తము మేము పోరాడుచుండగా, మమ్మును నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచి, మమ్మును నీ యొద్దకు చేర్చుకొనుము. యేసయ్యా, మా పాపాలను క్షమించి, నీ విలువైన రక్తంతో మమ్మును శుద్ధులనుగా చేయుము. ఓ దేవా, ప్రతిరోజు మమ్మును నీకు దగ్గరగా వచ్చునట్లుగాను, నీ కృప మా జీవితాన్ని, మా ఇంటిని మరియు మా కుటుంబాన్ని కప్పి ఉంచునట్లుగా చేయుము. దేవా, మా హృదయం నుండి ప్రతి భయాన్ని మరియు సందేహాన్ని తొలగించుము, మేము పవిత్రతలో నడిచి నీ సన్నిధిలో జీవించునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన మరియు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.