నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 10:19వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనములో ప్రభువు ఈలాగున అంటున్నాడు, "ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు'' అని సెలవిచ్చిన ప్రకారము ఇది ఎంతటి చక్కటి వాగ్దానము కదా! అవును, దేవుడు మనకు సమస్తము మీద అధికారమును అనుగ్రహించియున్నాడు. మనము ఈ అధికారమును ఏ విధంగా పొందుకొనగలము? బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 16:9వ వచనములో మనము చూచినట్లయితే, "తన యెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యా విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును'' ప్రకారము అవును, ప్రియులారా, దేవుడు యథార్థ హృదయముగలవారి కొరకు ఎదురు చూచుచున్నాడు. ఆయన పట్ల భయభక్తులతోను, నమ్మకంగా, యథార్థంగాను, దృఢంగాను నిలిచియుండు హృదయమును కలిగి ఉండాలని ఆయన మన పట్ల వాంఛించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మనం ఆయన యెదుట యథార్థతతోను, విశ్వాసంతోను నడుచుకున్నప్పుడు, ఆయన గొప్ప అధికారము మరియు శక్తి మన ద్వారా పనిచేయడం ప్రారంభిస్తుంది.
అవును, నా ప్రియులారా, మనము ప్రభువు యెదుట యథార్థముగా ఉండాలి. యథార్థముగా ఆయన అడుగు జాడలను వెంబడించువారముగా ఉండాలి. అందుకే మనము దేవుని వాక్యమును ప్రతి దినము చదువుచూ, ఆయన సన్నిధానములో సమయమును గడుపుతూ ఉండాలి. ఈ రెండు విషయాలు ప్రభువు యెదుట మనము యథార్థముగా జీవించడానికి మనకు సహాయపడతాయి. అవన్నియు చేసినప్పుడు, ఏమి జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మిమ్మును బలపరుస్తాడు. బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:15వ వచనములో చూచినట్లయితే, "మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,'' ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా మీరు బలపరచబడతారు. మన బాహ్యపురుషుడు మాత్రమే కాదు గానీ, అంతరంగ పురుషుడు కూడా బలపరచబడాలి. అందుకొరకే మనము దేవుని శక్తిని మరియు ఇంకను పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలి. మన బలం బాహ్యంగా మాత్రమే ఉండకూడదు; అది మన అంతర్గత పురుషుడైన - మన మనస్సు, హృదయం మరియు ఆత్మను దైవీక బలముతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ మాత్రమే మనలో ఈ పనిని చేయగలదు. మనం ఆయన శక్తితో నిండి ఉన్నప్పుడు, సవాళ్లు మనలను చుట్టుముట్టినప్పు డు కూడా మనం కదలకుండా ఉంటాము. నా జీవితములో జరిగిన ఒక సంఘటనను నాకు గుర్తుకు వచ్చినది. నా భర్తగారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు, నేను అక్కడ లేను. నేను వేరొక స్థలములో ఉన్నాను. అయితే, నేను ప్రభువు యొద్ద నుండి పొందుకున్న దీవెనలన్నియు ఆయన నాతో వివరించేవారు. కాబట్టి, నేను కూడా దేవుని శక్తిని పొందుకోవాలని ప్రార్థించడము మొదలు పెట్టాను. కాబట్టి, ప్రతి రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత, నేను దేవుని వైపు చూస్తూ మొఱ్ఱపెట్టుకుంటాను.
ఆలాగున నేను ఎంతో యథార్థముగా ప్రభువును వెదకుచున్నాను కాబట్టి, ప్రభువు ఒక రోజు నన్ను ఆశీర్వదించియున్నాడు. దేవుని సన్ని«ధిలో సమయమును గడపాలని నేను ఆ రోజు అనుకున్నాను. నేను మోకరించగానే, ప్రభువు తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నేను కేకలు వేశాను. హల్లెలూయా! ఎంత మహిమాన్వితమైన అనుభవము అది ప్రియ స్నేహితులారా. అందుకే దేవుని వాక్యము అంటున్నది, 'అడుగుడి మీకియ్యబడును' అని చెప్పబడియున్నది. ఎవరైతే, ప్రభువును వెదకుతారో, వారు ఆ దీవెనన్నియు పొందుకుంటారు. బైబిల్ నుండి లూకా 11:13వ వచనములో చూచినట్లయితే, "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' అని చెప్పబడియున్నది. అదేవిధముగా, ఇప్పుడు మనము ఆయనను అడగబోవుచున్నాము. ప్రభువు అదేరీతిగా మిమ్మును కూడా ఆశీర్వదించబోవుచున్నాడు. అవును, నా ప్రియులారా, మీరు అడిగినప్పుడు, మీరు పొందుకుంటారు. ఇంకను మీరు మీ హృదయపూర్వకంగా వెదకినప్పుడు, మీరు ఆయనను కనుగొంటారు. నేడు, నన్ను తన ఆత్మతో నింపిన అదే ప్రభువు, మీరు విశ్వాసముతోను మరియు విధేయతతోను ఆయన యొద్దకు వచ్చినట్లయితే, మిమ్మల్ని కూడా అదే ఆత్మ శక్తితో నింపుతాడు. ఇంకను శత్రువు యొక్క సమస్త అధికారము అధిగమించి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఆయన మిమ్మల్ని శక్తివంతులనుగా చేయుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, ఈ అద్భుతమైన వాగ్దానానికై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. తండ్రీ, నీ ఆశీర్వాదములను బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేము నీ సన్నిధికి వచ్చి, నీ పాదాల వద్ద మోకరిల్లిచున్నాము. దేవా, నీ కనికరముగల దృష్టిని మా మీద ఉంచి, మమ్మును దీవించుము. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. యేసయ్యా, మా అంతరంగాన్ని నీ యొక్క దైవీక శక్తితో మమ్మును బలపరచుము. ప్రభువా, యేసు నామంలో మా ప్రతి బలహీనత, భయం మరియు భారం మా నుండి తొలగిపోవునట్లుగా చేయుము. దేవా, రక్షణ ఆనందంతో మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, నీ ఆత్మచేత మా ఇల్లు, హృదయం మరియు కుటుంబాన్ని నింపుము. దేవా, మేము నిన్ను నమ్మకంగా సేవించునట్లుగాను, పరిశుద్ధాత్మ యొక్క తొమ్మిది వరములను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా చుట్టూ ఉన్న అనేకులకు మమ్మును ఆశీర్వాదకరంగా చేయుము మరియు మా జీవితం ఎల్లప్పుడు నిన్ను మహిమపరచునట్లుగా చేయుము. దేవా, మా జీవితాల పట్ల దృష్టిని ఉంచుము. ప్రభువా, నీకు విధేయత చూపుటకును, మోకరించి ప్రార్థించుటకును, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. దేవా, రక్షణానందముతో మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మేము ఎల్లప్పుడు నిన్ను హత్తుకొని ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ పరిశుద్ధాత్మ తొమ్మిది ఆత్మ వరములతో మమ్మును నింపి, అనేకులకు మేము ఆశీర్వాదముగా ఉండునట్లుగామమ్మును దీవించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


