నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు నిరీక్షణను కలిగించే దినం! దేవుడు మిమ్మును ఎన్నటికిని విడువడు, మిమ్మును ఎడబాయడు మరియు నేడు ఆయన మిమ్మును అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అని నమ్ముచున్నాను. అందు కే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 10:38 వ వచనంలో ప్రకటించబడినట్లుగానే, ఈ నిరీక్షణను హత్తుకొని జీవించండి. ఆ వచనములో, "నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు'' ప్రకారం దేవునికి నీతిమంతులుగా ఉండువారు విశ్వాసం మూలముగానే జీవిస్తారు. ఈ లోక ప్రజలు తమ వెలిచూపు ద్వారా జీవిస్తారు - వారు తమ ముందు ఉంచబడిన దానిని చూస్తూ, దాని ద్వారా వారి చుట్టు జరుగుచున్న దాని ద్వారా జీవిస్తారు. దీని ఫలితంగా, వారి భావోద్వేగాలు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటాయి. కొన్నిసార్లు వారు ఆనందంగా ఉంటారు, మరికొన్నిసార్లు అసహనం, నిరాశకు గురవుతారు, ఒత్తిడికి గురవుతారు లేదా ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. కానీ, దేవుడు తన పిల్లలైన మనకు ఓ మహత్తరమైన పాఠాన్ని నేర్పిస్తాడు - పరిస్థితుల మీద కాదు, కనిపించేదానిపై కాదు, పట్టుకునేదానిపై కాదు - విశ్వాసం మీద మాత్రమే జీవించాలని. ఎందుకంటే, ఆయనే మంచి తనంతో నిండి ఉన్న దేవుడు, ఆయనే నమ్మకమైనవాడు, వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చువాడు, ఎన్నటికిని మారనివాడు. మన విశ్వాసాన్ని ఈ సత్యంలో దృఢంగా ఉంచినపుడు, నీతిమంతుడు ఎన్నడును కదలకుండా దృఢంగా నిలబడతాడు.

ఒకసారి నేను ఒక యజమాని తన కుక్కను కారులో వదిలేసి దుకాణంలోకి వెళ్లడం చూశాను. ఆ కుక్క కారులో నిశ్శబ్దంగా, ఎంతో విధేయతతో ఓపికతో ఎదురు చూస్తుండెను. యజమాని రెండు మూడు గంటల తర్వాత మాత్రమే తిరిగి వచ్చాడు. ఆ కుక్క ఒక్కసారి కూడా కిటికీలో చూడడము కానీ, దాని మీద కాలు పెట్టడము కానీ, తలుపులను ఆడించడము కూడా చేయలేదు. అందుకు వ్యతిరేకముగా, అది నిశ్శబ్దంగా కూర్చుని, యజమాని తిరిగి వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూస్తుండెను. ఆ కుక్క సహనాన్ని చూచి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, అది తన యజమాని తిరిగి వస్తాడని యు, తనను ఒంటరిగా వదిలిపెట్టడనియు ఎంతో నమ్మకంతో కారులో నెమ్మదిగా కూర్చుని ఉండెను.

చూడండి నా ప్రియ స్నేహితులారా, ఆలాగునే, మన దేవుడు మనలను ఎన్నడును విడువడు, ఎడబాయడు అని నమ్ముతూ, నీవు మరియు నేను ఎంత ఎక్కువగా విశ్వాసంతో జీవించాలి కదా? ఆలాగున జీవించినట్లయితే, దేవుడు మీ విశ్వాసాన్ని తప్పకుండా ఘనపరుస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రతి రోజు దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకొనినప్పుడు మీరు విశ్వాసంలో బలపరచబడతారు, దృఢమైన విశ్వాసములో ఎదుగుతారు. అంతమాత్రమే కాదు, ప్రతిరోజు దేవుడు మీకు మహి మకరమైన ఆశీర్వాదాలను వాగ్దానం చేయుచున్నాడు. కనుకనే, ఆ వాగ్దానాల యందు విశ్వాసముంచండి. విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా జీవించుదురు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును ఎన్నడును, విడవకుండా, ఎడబాయకుండా మమ్మును కాపాడుము. దేవా, నీవు నమ్మకమైన దేవునిగా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితం అస్థిరమైనది అనుకున్న క్షణాలలో, మేము చూస్తున్న దాని ప్రకారం కాకుండా, నీ వాక్య సత్యం ద్వారా జీవించమని మాకు గుర్తు చేయుము. ప్రభువా, ప్రతిరోజు నీ ప్రేమగల వాగ్దానాల ద్వారా మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మా పరిస్థితులపై కాకుండా, నీపై మాత్రమే మా దృష్టిని కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు వాగ్దానాలను నెరవేర్చే దేవుడవని తెలుసుకుని, మా హృదయం నీలో స్థిరంగా నిలిచి ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, మేము అవిశ్వాసముతో కాకుండా, నీలో దృఢమైన విశ్వాసమును కలిగి జీవించునట్లుగా సహాయము చేయుమని స్తుతి ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.