క్రీస్తునందు నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు, ప్రభువు మనకు బైబిల్ నుండి కీర్తనలు 73:26వ వచనము నుండి ఒక చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహించుచున్నాడు. ఆ వచనము, "నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు'' ప్రకారము దేవుడు నిత్యము మనకు స్వాస్థ్యమై యున్నాడు. అవును, ఇది ఎంత ఆదరణకరమైన వాగ్దానము కదా! ఈ లోకములో, మన చుట్టూ ఉన్నవన్నియు ఓటమిపాలు కావచ్చును. మరియు అనేకవిధాలుగా ప్రజలు మనలను నిరాశపరచవచ్చును, మన బలం క్షీణించిపోవచ్చును, మన వనరులు నాశనము కావచ్చును మరియు మన సన్నిహిత సంబంధాలు కూడా విడిపోవచ్చును. ఉద్యోగాలు విఫలం కావచ్చును, వ్యాపారాలు కుప్పకూలిపోవచ్చును, మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురికావచ్చును మరియు కొన్నిసార్లు కుటుంబాలు కూడా మనలను తప్పుగా అర్థం చేసుకోవచ్చును. కానీ వీటన్నింటిలోనూ, దేవుడు ఎన్నటికిని ఓటమిపాలుకాకూడదని దేవుని వాక్యం మనకు గుర్తు చేయుచున్నది. ప్రభువు మీ స్వాస్థ్యభాగమైనప్పుడు, ఆయన మీ బలం, మీ దుర్గము మరియు మీ నిత్యమైన నిరీక్షణ అవుతాడు. అందుకే కీర్తనకారుడు ఇలాగున అంటున్నాడు, 'ప్రభువా, నీవే మా స్వాస్థ్యభాగము.' అంటే దేవుడే మీకు సర్వస్వముగా మారుతాడు - మీ సమాధానము, మీ సదుపాయము, మీ నమ్మకం మరియు మీ భవిష్యత్తు అంతయు ఆయనే అని మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, మనం ప్రభువుతో కలిసినప్పుడు, మన ఆత్మలో ఆయన బలాన్ని పొందుకుంటాము. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:17వ వచనములో ఇలాగున తెలియజేయబడుచున్నది, " అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు'' ప్రకారము మనము ప్రభువుతో కలిసికొనినప్పుడు మనము ఆయనతో కూడా ఏకాత్మయై ఉంటాము. కాబట్టి, మీ జీవితం యేసు నుండి ప్రత్యేకించబడినది కాదు. మీ పేరు, మీ హృదయం మరియు మీ ఆత్మ ఆయనతో ఏకమైయున్నవి. అందుకే మీరు ధైర్యంగా ఇలా చెప్పగలరు, ' ప్రభువా, మా హృదయానికి బలం. మీ శరీరం బలహీనంగా మారినప్పటికి, మీ ఆత్మ బలంగా ఉంటుంది, ఎందుకంటే అది శాశ్వత జీవమునకై మూలమైన యేసుక్రీస్తుతో ముడిపడి ఉంటుంది. ఆయన ఎన్నడూ విఫలం కాడు. ఆయన ఎన్నడూ విడువడు. తుఫానులు వచ్చి, మంటలు చెలరేగినప్పటికిని, యేసు కదల్చబడకుండా ఉంటాడు. ఈ లోకము తలక్రిందులైనను, కానీ మీ హృదయం ఓటమి కాకూడదు. ఎందుకంటే, ప్రభువు తన కుడి చేతితో మిమ్మల్ని ఆదరిస్తాడని గుర్తుంచుకోండి, ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ జీవితములో మీరు ఎదుర్కొంటున్న ప్రతి తుఫానును తొలగించినను, తొలగించకపోయినను సరే దాని నుండి నెమ్మదిగా నడవడానికి ఆయన మిమ్మల్ని తన సమాధానముతో బలపరుస్తాడు.

ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒకప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చికాగోలోని అతనికి ఒక గొప్ప ప్రయోగశాల పూర్తిగా కాలి బూడిదైనప్పుడు, మిలియన్ల డాలర్ల విలువైన ఆవిష్కరణలు నాశనమయ్యాయి. అయినప్పటికిని అతను నెమ్మదిగా ఉండెను. అంతమాత్రమే కాదు, అతను తన కుటుంబ సభ్యులను మంటలను చూడటానికి రమ్మని పిలిచెను. అతడు తన కుమారుని పిలిచి, మీ అమ్మగారిని పిలువు, ఆమె మరల ఇంత పెద్ద మంటను చూడకపోవచ్చు అని చెప్పాడు. మరుసటి రోజు, ఆ కాలిపోయిన శిథిలాలను శుభ్రం చేయుచుండగా, అతని ఛాయాచిత్రం మాత్రమే కాలిపోకుండా కనిపించింది. అప్పుడు అతను ఇలాగున అన్నాడు, 'అంతా కాలిపోయింది, కానీ థామస్ ఆల్వా ఎడిసన్ ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరమ పునఃప్రారంభిస్తాను' అని తన ఫోటోను చూచి తన కుటుంబ సభ్యులతో చెప్పాడు. మరియు అతను అలాగుననే చేసాడు. అదేవిధంగా, నా ప్రియులారా, మీ జీవితములో సమస్తమును కాల్చివేయబడినట్లు ఒక అనుభవముగా ఉన్నట్లుగా అనిపించినప్పుడు, దేవుడు నేటికిని మిమ్మును జీవింపజేస్తాడు. ఇంకను మీ ఆత్మ సజీవంగా ఉంటుంది. మీ లక్ష ్యము నిర్మూలము చేయబడలేదు. కనుకనే, మీరు కోల్పోయిన అన్నిటిని మరి ఎక్కువగా బలముగాను, ప్రకాశవంతంగా మరియు రెట్టింపు రీతిలో పునర్నిర్మించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 46:1వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు'' ప్రకారము దేవుడు మీరు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. అంతమాత్రమే కాదు, బైబిల్ నుండి యెషయా 40:31వ వచనము మనకు గుర్తు చేయుచున్నది, " యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' ప్రకారము కాబట్టి మీరు ప్రభువు కొరకు వేచియున్నట్లయితే, ఎటువంటి అగ్ని మంటలు వచ్చినను, వాటి నుండి సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆలాగుననే, బైబిల్ నుండి విలాపవాక్యములు 3:24వ వచనములో చూచినట్లయితే, " యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయన యందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను'' ప్రకారము ప్రభువు ఎలీషాకు చేసినట్లుగానే, ఆయన మిమ్మును పైకి లేవనెత్తి, మీకు రెట్టింపు భాగాన్ని అనుగ్రహించి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయానికి బలం నీవు అయినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మా చుట్టూ ఉన్నవన్నియు విఫలమైనప్పటికీ, ఓ ప్రభువా, నీవు ఎన్నటికిని విఫలం కావు. దేవా, నీవు నిత్యము మా స్వాస్థ్యభాగముగా ఉండుము. ప్రభువా, మా శరీరం బలహీనమైనప్పుడు మా ఆత్మను నీ యొక్క బలముచేత మమ్మును బలపరచుము. దేవా, మా జీవితంలో ప్రతి తుఫానులన్నింటిని ఎదుర్కొనుటకు మమ్మును ధైర్యంతో నింపుము. ఓ దేవా, మేము కోల్పోయినవన్నియు ఏలీషా వలె తిరిగి రెండంతలుగా పొందుకొనుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ కృప మమ్మును ఎంతో బలంగా, దృఢంగా మరియు స్థిరంగా ఉండనట్లుగా, నీ శక్తితో మమ్మును నింపుము. దేవా, మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉండునట్లుగాను, నీ బలంతో పక్షిరాజు వలె మరల రెక్కలు చాపి పైకి ఎగరడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయం ఎల్లప్పుడూ నీలో నెమ్మదిగాను మరియు ఆనందంగా ఉండునట్లుగా కృపను అనుగ్రహించి, మమ్మును నీతో ఏకాత్మగా ఉండునట్లుగాను, మేము నీ నిత్యము నిలిచి ఉండు స్వాస్థ్యభాగముగా ఉండునట్లుగా మాకు సహాయము చేసి, మమ్మును అగ్నిలోను, జలములలోను ముందుకు నడిచి వెళ్లునట్లుగా యేసు యొక్క శక్తివంతమైన మరియు ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.