నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 43:19వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, " ...నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను'' ప్రకారం దేవునికి అసాధ్యమైనదంటూ ఏదియును లేదు. అరణ్యములో ఇశ్రాయేలీయులు ప్రయాణిస్తున్నప్పుడు, వారు వెళ్లవలసిన దారి వారికి తెలియలేదు. అయినను ప్రభువుకు వారెంతో ఇష్టులు గనుకనే, ఆయనే వారిని మార్గములో నడిపించాడు. వారికి త్రాగడానికి నీళ్లు లేనప్పుడు, ప్రభువే వారికి త్రాగడానికి నీళ్లను సమకూర్చాడు. వారు భుజించడానికి ఆహారముగా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. నా ప్రియులారా, ఒకవేళ మీరు కూడా, ' నేను వెళ్లవలసిన మార్గము ఏదో నాకు తెలియలేదు అని అంటున్నారేమో? ఎంతో మంది అనేకమైన విషయాలు చెబుతూ, నన్ను సందేహములో ఉంచుచున్నారు అని మీరు అంటున్నారేమో? మరొక వైపు అపవాది కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో ప్రభువా, నీవే నన్ను సరైన మార్గములో నడిపించుము అని మీరు మొఱ్ఱపెట్టుచున్నారా? ' అయితే, 'మార్గములను సృజించువాడు, అద్భుతకరుడు, చీకటిలో వెలుగు, వాగ్దానములను నెరవేర్చువాడు (ది లార్డ్ ప్రామిసెస్ టు బి అవర్ వే మేకర్, మిరాక్కిల్ వర్కర్, ప్రామిస్ కీపర్, అండ్ లైట్ ఇన్ ది డార్కనెస్స్) 'అని ప్రభువును గురించి మనము ఒక ఆంగ్ల పాట పాడుతూ ఉంటాము కదా! ఆయనే మార్గములను సృజించువాడు. ఎక్కడైతే, మార్గము లేదో, అక్కడే, ఆయన మార్గములను సృష్టించగలిగిన గొప్ప దేవుడు. మన కార్యములు మనకు అసాధ్యమైనవిగా అనిపించవచ్చును. కానీ, ప్రభువునకు అన్నియు సాధ్యమే. ఇంకను మన పట్ల అసాధ్యమైన కార్యములన్నిటిని సమకూడి జరిగించగల దేవుడై యున్నాడు.

నా ప్రియులారా, ఏదైన సమస్యలు తలెత్తినప్పుడు, ఆ సమస్య తీరిపోవలెనని నేను ప్రభువునకు ప్రార్థించుచుండేదానను. ఆ సమస్యకు నేనేమి చేయలేనటువంటి పరిస్థితి చివరికి వస్తుంది. కానీ, ఆ సమయములో, 'ప్రభువా, నా జీవితములో నీవు మాత్రమే సమస్తమును సమకూర్చి జరిగించేవాడవు' ఇంకను, 'ప్రభువా, నీ హస్తములకు సమస్తమును నన్ను నేను సమర్పించుకుంటున్నాను మరియు అన్నిటి మీద నీవే అధికారాన్ని తీసుకొనుమని' చెబుతాను. అప్పుడు ప్రభువు నాకు ఒక వాగ్దానమును ఇచ్చి, నన్ను ఆదరిస్తాడు, ' నా కుమార్తె, నేను నీ పక్షమున సమస్తమును సమకూర్చి నీ పట్ల మేలు జరిగిస్తాను,' అని చెబుతాడు. కనుకనే, నేడు మిమ్మును మీరు ప్రభువునకు సమర్పించుకొనండి, అపవాదిని ఎదిరించండి. అందుకే బైబిల్ నుండి యాకోబు 4:7వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, మీరు అపవాదిని ఎదిరించినప్పుడు, అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుకనే, మీకు విరోధముగా వచ్చినటువంటి శత్రువులైనటువంటివారు ఏడు మార్గములలో తిరిగి పారిపోతారు. ప్రభువు నడిపించే సరైన త్రోవలో మీరు చక్కగా నడవగలుగుతారు. ఆలాగునకాకుండా, ' నేనే ఈ సమస్యలను తీర్చుకోగలుగుతాను' అని ఎప్పుడు కూడా అనుకోకండి. ప్రభువు హస్తాలకు ఆ సమస్యలను వదిలివేయండి. ప్రభువే మిమ్మును సరైన మార్గములో నడిపించును గాక.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ఈరోజే ఆయనను నమ్మండి. మార్గం లేనట్లు అనిపించే ప్రతి చోట ఆయన ఒక మార్గాన్ని సృష్టిస్తాడని నమ్మండి. ఆయన గొప్ప శక్తి ద్వారా ప్రతి అసాధ్యమైన దానిని సాధ్యం చేయనివ్వండి. మీ ఎడారి ఆశీర్వాదపు నదులుగా మారనివ్వండి, మీ అడ్డంకులు తెరిచిన ద్వారములుగా మారనివ్వండి మరియు మీ దుఃఖాలు ఆనందంగా మారనివ్వండి. ప్రభువు మిమ్మల్ని సమాధానము మరియు అభివృద్ధికరమైన మార్గంలోనికి నడిపించును గాక. ప్రభువే, మీకు అరణ్యములో మార్గమును సృజించును గాక. ప్రభువు ఎడారి త్రోవలలో మీ కొరకు నదులను పారజేయును గాక. కనుకనే, ఆయన యందు నమ్మికను ఉంచండి. ప్రభువు యొద్ద నుండి మీరు అద్భుతములను పొందుకొందురు గాక. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రభువా, నీవే మార్గములను సృజించే దేవుడవు. నీవే అద్భుతములను చేయు దేవుడవు. ఇప్పుడు మా జీవితములో అద్భుతములను జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, లేనివాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడవు నీవే గనుకనే ఇప్పుడే, మా జీవితాలలో కొరతగా ఉన్న వాటన్నిటిని ఉన్నట్టుగా చేయుము- అది గృహము, గర్భఫలము, పదోన్నతి, అనుకూల జీవిత భాగస్వామిని, ఇంకను మేము ఎదురు చూచుచున్న ప్రతి ఆశీర్వాదమును ఇప్పుడే, మేము పొందుకొనుటకు మార్గమును మరియు నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, త్రోవలేని చోట ఇప్పుడు మాకు త్రోవను కలుగజేసి, మమ్మును సరైన మార్గములో నడిపించుము. దేవా, ఎవరూ తెరువలేని తలుపులను నీవు తెరుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము వెళుచున్న అరణ్యంలో ఒక మార్గాన్ని ఏర్పరచుము. ప్రతి ఎడారిని ప్రవహించే నదులుగా మార్చుము. ప్రభువా, మా ముందు నిలువబడి ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించుము. దేవా, మా పిల్లల జీవితాలలో వివాహాలను అనుగ్రహించుము మరియు గర్భఫలము లేని మమ్మును, ప్రియులైన వారిని సంతానముతో దీవించుము. తండ్రీ, మాకు మరియు మా ప్రియులైన వారిని స్వంత గృహము, పదోన్నతి మరియు సమాధానముతోను మరియు వర్థిల్లతోను దీవించుము. యేసయ్యా, మా శత్రువులందరిని మాకు మిత్రులనుగా చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.