నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 5:5వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు'' అని చెప్పబడిన ప్రకారము భూలోకమును మీరు స్వతంత్రించుకోవాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. ఈ భూమిపై మీరు అన్నిటికంటె అత్యధికమైన విజయమును పొందుకొనువారుగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. పరలోకం నుండి వచ్చు ఆశీర్వాదాలన్నియు మీరు పొందుకొని, వాటిని ఈ భూమి మీద వారసత్వంగా అనుభవించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందునిమిత్తము, ఆయన మనలను సాత్విక స్వభావం గలవారిగా చేయుచున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించు స్వాస్థ్యము ఏమిటి? అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:17వ వచనములో చూచినట్లయితే, "మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము '' అని చెప్పబడిన ప్రకారం, ఆయన మనకు దేవుని వారసులమనే వారసత్వాన్ని దయచేయుచున్నాడు. అందుకే మనం క్రీస్తు నిమిత్తం శ్రమపడినప్పుడు, యేసుక్రీస్తు తాను పొందిన శ్రమల తర్వాత మహిమను పొందుకున్నట్లుగానే, మనం కూడా దేవుని మహిమను పొందుకుంటాము. అవును, యేసుక్రీస్తు దేవునికి వారసుడైనట్లుగానే, నేడు మీరు కూడా దేవునికి వారసులు అవుతారు.
నా ప్రియులారా, రెండవది, దేవుడు మనకు అనుగ్రహించు స్వాస్థ్యము ఏమని చూచినట్లయితే, బైబిల్ నుండి 1 పేతురు 1:3 వ వచనములో కనుగొనబడినది. ఆ వచనములో, "మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను'' అని వ్రాయబడిన ప్రకారము యేసు పునరుత్థానం ద్వారా ఆయన మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లుగా మనకు నూతన జన్మను అనుగ్రహిస్తాడు. అవును, నా ప్రియులారా, మనం దేవుని పిల్లలుగా పునరుత్థానం చేయబడతాము. అప్పుడు దేవుని వారసులుగాను మరియు దేవుని పిల్లలుగా మారే హక్కు మనకు కలుగుతుంది. అటుతరువాత, బైబిల్ నుండి హెబ్రీయులకు 9:14వ వచనములో చూచినట్లయితే, " నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును'' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను బలిగా అర్పించుకొని, మరణానికి నడిపించే క్రియల నుండి, అంటే పాపం నుండి మన మనస్సాక్షిని పరిశుద్ధపరచియున్నాడు. కనుకనే, యేసు రక్తం మన యొక్క పాపపు స్వభావమంతటి నుండి మనలను కడిగి పరిశుద్ధపరుస్తుంది, ఇది దేవుని నుండి మనము పొందుకొనబోవు స్వాస్థ్యముగా మారుతుంది. అవును, నా ప్రియులారా, తద్వారా, ఈ లోకంలో మనం పరిశుద్ధులమవుతాము, పాపం నుండి విడిపించబడతాము మరియు యేసు రక్తం ద్వారా పాపపు స్వభావము మీద విజయం పొందుకొని అనుభవిస్తాము.
నా ప్రియులారా, యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మరియు మీ యొక్క పాప స్వభావము నుండి మిమ్మల్ని పరిశుద్ధపరచి, దేవుని బిడ్డలుగా మార్చబడే వారసత్వాన్ని మీకు అనుగ్రహించుటకు, ఆ దేవుడు ఈ రోజు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 5:19-21వ వచనములలో చూచినట్లయితే, "శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారం, శరీర కార్యాలను చేయకుండా ఉండటానికి మనం బలపరచబడియున్నాము. అవి, (జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి). అవును, నా ప్రియులారా, మనం మన పరిశుద్ధతను స్వాస్థ్యముగా పొందుకుంటాము. దేవుడు మీకు అటువంటి కృపను నేడు మీకు అనుగ్రహించును. ఇదే దేవుడు మీ మీద మరియు మా మీద ఉంచబోయే గొప్ప కృపయై యున్నది. ఇది దేవుడు మనకు ఇచ్చిన స్వతంత్రయై యున్నది. కాబట్టి, నా ప్రియులారా, మనకు కావలసిందల్లా సాత్వికంగా ఉండటం, దేవుని యెదుట లోబడి ఉండటం, యోసేపునకు ఉన్నట్లుగా దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం మరియు మేము పాపానికి 'కాదు' అని చెప్పి, పరిశుద్ధుడైన యేసుకు 'అవును' అని చెప్పడమే. కనుకనే, ఇటువంటి గొప్ప ధన్యతను నేడు దేవుడు మీకు నేటి వాగ్దానము ద్వారా అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసు ప్రభువా, దయచేసి మా హృదయాన్ని నీ యెదుట సాత్వికంగా మరియు విధేయతగా ఉండునట్లుగా మార్చుము. యేసయ్య, నీ రక్తము ద్వారా, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మా మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయుము. దేవా, మమ్మును నీ బిడ్డలనుగాను మరియు దేవునికి వారసులనుగా చేసిన దైవీక స్వాస్థ్యమునకు వందనాలు. యేసయ్య, దయచేసి మా యొక్క ప్రతి పాపం నుండి మరియు పాప స్వభావం నుండి మమ్మును పరిశుద్ధపరచుము మరియు నీ యొక్క అమూల్యమైన రక్తం మాలో శక్తివంతంగా పని చేయుటకు సహాయము చేయుము. దేవా, మేము పాపానికి 'కాదు' అని చెప్పడానికి మరియు నీకు 'అవును' అని చెప్పడానికి దయచేసి మాకు బలమును అనుగ్రహించుము. ప్రభువా, మేము పాపము నుండి విడుదల పొందుకొని, పరిశుద్ధతతో నడవడానికి మరియు నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, మేము శరీర కార్యాలను చేయకుండా ఉండటానికి మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచుము. తండ్రీ, మేము విశ్వాసంతో నీ యొద్ద నుండి ఇటువంటి కృపను పొందుకొనునట్లుగా సహాయము చేయుమని యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


