నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 26:12వ వచనమును నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవునికి ప్రజలై యున్నారు అని వాగ్దానము చేయబడుచున్నది. అవును, నా ప్రియులారా, ప్రభువు మన మధ్య నడవడము ఎంత గొప్ప భాగ్యమై యున్నది కదా. ఆయన మనలను, ' నా ప్రజలు' అని పిలువడము ఎంత గొప్ప ధన్యత. అందుకే బైబిల్ నుండి లేవీయకాండము 26:3వ వచనములో ఇవ్వబడిన వాటన్నిటిని మనము పాటించినప్పుడు, మనము ఇటువంటి గొప్ప ధన్యతను మనకు దయచేస్తాడు. అక్కడ ఏమి వ్రాయబడియున్నది, " మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల...'' అని చెప్పబడినట్లుగానే, మనము ఆయన కట్టడలను బట్టి మనము జాగ్రత్తగా నడుచుకొనినప్పుడు మనకు ఏమి జరుగుతుంది? అని చూచినట్లయితే, నేటి వాగ్దానమైన లేవీయకాండము 26:12వ వచనములో చెప్పబడినట్లుగానే, "నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై యుందును; మీరు నాకు ప్రజలై యుందురు'' అని చెప్పబడిన ప్రకారముగా అవును, మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి, మనము ఆయనకు విధేయులైనప్పుడు, మనము దేవునికి ప్రజలముగా పిలువబడుచున్నాము.
నా ప్రియులారా, తండ్రితోను లేక తల్లితోను నడుస్తున్న ఒక చిన్న బిడ్డను చూచినట్లయితే, ఆ చిన్న బిడ్డకు ఈ లోకములో దేని గురించిన చింత ఉండదు. ఎందుకనగా, ఆ బిడ్డతో కూడా తల్లిదండ్రులు నడుస్తూ ఉంటారు. ఇంకను రోడ్డు దాటుచున్నప్పుడు, లేక ఏదైన కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, లేక భయానకమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వారు భయపడరు. ఎందుకంటే, తల్లిదండ్రులు వారిని కాపాడుతారు అని ఆ బిడ్డకు తెలుసు. వారు సరైన మార్గములో నడిపిస్తారనియు, హాని నుండి కాపాడతారు అనియు వారికి తెలుసు. కనుకనే నా ప్రియులారా, ప్రభువు కూడా అదే జరిగిస్తాడు, తన బిడ్డల కొరకు మరియు ఆయన పిల్లల కొరకు ఆలాగుననే చేస్తాడు. కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు ఆయన ఆజ్ఞలను అనుసరించుచుండగా, ఇంకను ఆయనకు విధేయులై ఉంటుండగా, ఆయన చిత్తానుసారముగా నడుస్తుండగా, ప్రభువు మీకు దేవుడుగా ఉంటాడు. మీరు ఆయన ప్రజలై ఉంటారు. కనుకనే, చింతించకండి. ధైర్యంగా ఉండండి.
నా ప్రియులారా, తన బిడ్డలకు ఏ కొదువ ఉండకుండా ప్రభువు మిమ్మును జాగ్రత్తగా చూచుకుంటాడు. ఆయన మిమ్మును కాపాడుతాడు, మిమ్మును భద్రంగా ఉంచుతాడు. మీకు మంచి ఆరోగ్యమును ఇస్తాడు. మిమ్మును వర్థిల్లింపజేస్తాడు. మీకు ఏ కొదువ లేకుండా మిమ్మును భద్రంగా చూసుకుంటాడు. కాబట్టి, మీరు చేయవలసినదంతయు ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన మీకు తండ్రిగా ఉంటాడు, ఆయన మీకు దేవుడుగా ఉంటాడు. మీ ప్రతి అడుగును నిర్దేశిస్తాడు. మిమ్మును కాపాడుతాడు, నా ప్రియులారా, ఈ రోజు, 'ప్రభువును వెంబడించి, ఆయన ఆజ్ఞలను పాటించాలని' ఒక నిర్ణయమును తీసుకున్నట్లయితే, అప్పుడు ఆయన మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు నీ బలమును అనుగ్రహించుచున్నందుకై నీకు వందనములు. దేవా, మా యొక్క ప్రతి శోధనను అధిగమించుటకు కృపను ఇచ్చుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, సరైన మార్గములో మమ్మును నడిపించి, నీ మంచితనముతోను, ఆత్మతోను మమ్మును నింపుచున్ననందుకై నీకు వందనములు. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించడానికి, నీకు విధేయులముగా ఉండడానికి ఈ రోజు నీ బలమును మాకు అనుగ్రహించుము. దేవా, మా జీవితములో నీ వాగ్దానములను నెరవేర్చుము. ప్రభువా, నీవు మాకు తండ్రిగా ఉండి, మమ్మును సురక్షితముగా కాపాడి, మమ్మును నడిపించి, మమ్మును భద్రముగా ఉంచుము. దేవా, మా మీద నీ యొక్క ప్రేమను కుమ్మరించి, మాకు కావలసిన వాటన్నిటిని సమస్తమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించడానికి మరియు నీ కట్టడలను విశ్వాసంగా పాటించడానికి దయచేసి మాకు సహాయం చేయుము. యేసయ్య, మేము వేయుచున్న ప్రతి అడుగులో నీ సన్నిధి మాతో ఉండునట్లుగా చేయుము. దేవా, మా హృదయం నుండి భయాన్ని తొలగించి, నీ శాంతితో మమ్మును నింపుము. ప్రభువా, మాకు మార్గనిర్దేశం చేయుము, మమ్మును రక్షించుము మరియు సమస్త కీడుల నుండి మమ్మును సురక్షితంగా ఉంచుము. దేవా, ఎల్లప్పుడూ నీకు దగ్గరగా మేము ఉండునట్లుగా మాకు నేర్పించుము. ప్రభువా, మేము నిజంగా నీ బిడ్డగా ఉండునట్లుగా చేయుము మరియు నీవే మా దేవుడవై ఉంటూ, నీ స్వరాన్ని వినగలుగుతూ, నిన్ను వెంబడించుటకును మమ్మును నడిపించి, మా జీవితాన్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


