నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీతో మాట్లాడుచున్నాడు. మీరు దేవుని స్వరాన్ని వినడం ఎంతటి గొప్ప ఆనందం కదా! మరియు మనం బైబిల్‌లోని లేఖనముల ద్వారా ఆయన స్వరాన్ని వినవచ్చును. అందుకే నేటి వాగ్దానముగా విలాపవాక్యములు 3:24వ వచనములో ఇలా చెప్పబడింది, "యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయన యందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను'' ప్రకారము 'ప్రభువే నా భాగము' అని ఈ వాక్యమును వ్రాసిన గ్రంథకర్త యెహోవా యందు ఎలాగున నమ్మిక యుంచియున్నాడని మనము చూడగలము. అతనిలో ఉన్న ఆసక్తిని మనము చూడగలము. అందులో అతనిలో ఒక లోతైన తృష్ణను, ఒక గాఢమైన కోరికను కలిగియుండెను. ఆ తృష్ణ మరియు కోరిక మరి దేని కోసం కాదు, కేవలం ఆయన కోసమే. కనుకనే, ప్రభువు కొరకు మాత్రమే ఎదురుచూడాలనే కోరికను ఆ భక్తుడు కలిగియుండెను.

సోషల్ మీడియాలో నేను ఒక వీడియోను చూశాను. అందులో ఎదురు చూపులతో ఉన్న విషయాన్ని బట్టి తెలియజేసిన ఒక చక్కటి కథ. అది తన దేశం కొరకు పోరాడటానికి సైన్యంలో చేరిన ఒక సైన్యుకుని గురించిన కథ. అతడు సైనిక ధళమునకు వెళ్లక మునుపు, తన ఇంటిలో ఉన్నప్పుడు, తాను పెంచుకున్న ఒక కుక్క తన కొరకు ప్రతి రోజు అటుఇటు తిరుగుతూ ఉంటుంది. మరియు ఇంటి చుట్టూ స్వేచ్ఛగా తిరగడానికి అలవాటుపడింది. కానీ, ఆ వ్యక్తి తన యింటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ప్రతిరోజు ఉదయం ఆ కుక్క వచ్చి ఇంటి ముందు వరండాలో వేచి ఉండేది. అది అతని యింట వాకిట పడుకుని, అతను వస్తున్నాడేమో అని అక్కడ పడుకుని అతని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు ఇలాగే చేయుచుండెను. అయితే, ఒకరోజు, ఆ వ్యక్తి తన సైనికధళములో తన పనిని ముగించుకుని చివరకు తిరిగి యింటికి వస్తూ, కారులో నుండి దిగుచున్నప్పుడు, ఆ కుక్క తన తలను పైకెత్తి, అతని చూచి, అతని యొద్దకు పరుగెత్తుకొని వెళ్లి, అతని మీదికి దూకి, అతని శరీరమంతా నాకింది. అది ఏ మాత్రము అతనిని తన ఇంటి లోపలికి వెళ్లనివ్వలేదు. ఆ వ్యక్తి అందుకు బహుమతిగా ఆ కుక్కకు ఒక పెద్ద ఎముకను ఇచ్చాడు.

నా ప్రియమైన స్నేహితులారా, మనం కూడా అలాంటి ఆసక్తితో, అలాంటి నిరీక్షణతో ప్రభువు కొరకు ఎదురుచూడాలి. మన కొరకు ప్రభువు వస్తున్నాడు; ఆయనను ఎదురు చూడటం ఎంతటి ఆనందమో కదా! ఈ వచనం చెప్పినట్లుగానే, ప్రభువే మన భాగం. ఆయన మనకు ఏమి ఇస్తాడనే దానిని కాదు, ఆయనను మనం మన భాగంగా ఎంచుకొనియుండాలి. ఆయన మనకు ఈ బహుమతిని ఇస్తాడు, ఆయన మన కొరకు ఈ మంచి కార్యము చేస్తాడు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకువస్తాడు అని కాదు. మనం కేవలం అలాంటి ఆశీర్వాదాల కోసమే చూచినట్లయితే, అవి మనకు క్షణకాలం పాటు సంతృప్తిని ఇవ్వవచ్చును. కానీ, నా ప్రియులారా, అవి మనలో అత్యధికమైన వాటి కొరకు మనలో కోరికను లేవనెత్తుతాయి. అయితే, మనం ప్రభువును మన శ్రేష్ఠమైన భాగంగా భావించి, ఆయన కొరకు కనిపెట్టి, ఆయనను మనలోనికి అంగీకరించినప్పుడు, ఆయన ఆనందం యొక్క పరిపూర్ణత మన హృదయాలలో పొంగిపొర్లుతుంది. మనకు ఇంక మరేమీ అక్కర్లేదు. మనకు ఇంకేమి అవసరం లేదు. ఆయనే మన హృదయాలను నింపి, మనలను సంపూర్ణంగా సంతృప్తిపరుస్తాడు. ప్రభువే మన భాగంగా ఉండటం అనే ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం నేడు అనుభవించాలంటే, నేడు మీ జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించి, ఆయనను మీ భాగముగా చేసుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ ఎదురు చూపులకు నిశ్చయముగా ఒక బహుమతిని ప్రతిఫలముగా ఇచ్చి మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే, మా భాగం మరియు మా గొప్ప ఆనందమై యున్నందుకై నీకు వందనములు. ప్రభువా, మేము ఎంతో నిరీక్షణతో మరియు వాంఛతోను నీ కొరకు వేచి ఉండటానికి మాకు నేర్పించుము. దేవా, మా హృదయమును నింపడానికి ప్రయత్నించే ప్రతి చిన్న కోరికను మా నుండి తొలగించుము. ప్రభువా, నీ సన్నిధి మాకు చాలినంతగా ఉండునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, నీ ఆనందం మరియు సమాధానము యొక్క సంపూర్ణతతో మమ్మును నింపుము. దేవా, మేము పొందుకొను ప్రతి ఆశీర్వాదంకంటే మేము నిన్ను ఎన్నుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ లోకములో, మేము దేనిని కోరకుండా, నీవు మాత్రమే మాకు భాగమై ఉండునట్లుగా మాకు నీ కృపను చూపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.