నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 45:2 నుండి తీసుకొనబడినది. ఆ వచనము, " నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీకు ముందుగా వెళ్ళి, మీ వంకర మార్గములన్నిటిని సరాళము చేస్తాడు. ఆయన బ్రద్ధలైన వాటిని బాగుచేస్తాడు, అసంపూర్తిగా ఉన్నవాటిని పరిపూర్ణమగునట్లుగా చేసి మరియు మీ మార్గమును వర్ధిల్లజేస్తాడు.

1. ప్రభువు మనకు ముందుగా పోవుచున్నప్పుడు ఏమి జరుగుతుంది? పర్వతములన్నిటిని జయించే విశ్వాసము మనలను నింపుతుంది. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 13:2వ వచనములో చూచినట్లయితే, "ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రవచన వరమును కలిగియున్నప్పటికిని, దేవునియందు విశ్వాసము మరియు ప్రేమ లేనట్లయితే, మనము వ్యర్థులముగా కనబడుదుము. అదే సమయములో, మన ముందు అడ్డుగా అనేక పర్వతములు నిలిచి ఉండవచ్చును. కానీ, బైబిల్ నుండి యెషయా 54:10వ వచనములో చూచినట్లయితే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, " పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు '' అని చెప్పబడినట్లుగానే, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, దేవుని ప్రేమ, కృప ఎల్లప్పుడు మిమ్మును విడిచిపోదు. అంతమాత్రమే కాదు, పరిస్థితులు మీకు అసాధ్యంగా అనిపించినప్పుడు మరియు అడ్డంకులు చాలా పెద్దవిగా నిలిచినప్పుడు కూడా, వాటిని అధిగమించడానికి ప్రభువు మీకు బలమును మరియు విశ్వాసమును అనుగ్రహిస్తాడు. ఎందుకంటే, యేసు విశ్వాసమునకు కర్తగాను మరియు పరిపూర్ణుడు అని ఎల్లప్పుడూ మనము గుర్తుంచుకోవాలి. ఈ విషయమును మనము బైబిల్ నుండి హెబ్రీయులకు 12:1-2వ వచనములలో మనము చదవగలము. ఆ వచనము, "మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము'' అని చెప్పబడినట్లుగానే, మన దృష్టిని ఆయనపై నిలిపి, మన యెదుట ఉంచబడిన పరుగు పందెములో పరుగెత్తుటకు మనకు బలమునిస్తాడు. అయితే, మన చుట్టూ అనేక భారములు, అడ్డంకులు ఏర్పడవచ్చును; కానీ విశ్వాసమును కలిగియుంటూ, మనము సమస్తము చేయగలిగిన ప్రభువు శక్తిని నమ్ముటయే. కనుకనే, ఆయనకు అసాధ్యమైనదేదియు లేదు. నా ప్రియులారా, ప్రభువు మీకు ముందుగా పోవుచూ, మీకు సహాయము చేసి, మీ యెదుట ఉన్న ఆటంకములన్నిటిని (పర్వతాలను) తొలగిస్తాడు. అందుకే ఆయన, 'మీ ఆటంకములన్నిటిని నేను తొలగిస్తానని నమ్ము' అని ఆయన మీ హృదయముతో మాట్లాడుచున్నాడు. కనుకనే, మీ యొక్క ప్రతి ఆటంకములను జయించే విశ్వాసమును ఆయన నేడు మీకు అనుగ్రహించుచున్నాడు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నియు ప్రతికూలంగా అనిపించినప్పటికిని, మిమ్మును ముందుకు నడిపించడానికి మరియు మీ మార్గంలో అడ్డుగా ఉన్న ప్రతి పర్వతాన్ని మరియు కొండలను బ్రద్దలుచేయడానికి ప్రభువుకు అధికారము కలదు. కనుకనే, ఆయన మీకు ముందుగా వెళ్లుచున్నాడని నమ్ముటకు ఆయన మీకు విశ్వాసమును అనుగ్రహించినప్పుడు, మీకు ఎదురుగా ఉన్న పర్వతములు తొలగిపోవును మరియు మీరు సరాళమైన మార్గములో నడవడానికి ద్వారము తెరవబడుతుంది.

2. ప్రభువు మన పాదములను ఉన్నత స్థలములపై ఉంచుతాడు: రెండవదిగా, ప్రభువు మనలను ఉన్నత స్థానములకు హెచ్చించి, మన పరిస్థితులకు అతీతంగా నిలబడునట్లుగా చేస్తాడు. ఇందును గురించి మనము బైబిల్ నుండి యెషయా 58:14వ వచనములో చూచినట్లయితే, "నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ఉన్నత స్థలములలో మనలను హెచ్చిస్తాడు. ఆయన మనలను ఎందుకు హెచ్చిస్తాడు? అందుకే బైబిల్ నుండి యెషయా 52:7వ వచనములో చూచినట్లయితే,"సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు రాజుగా మనలను పరిపాలించుచున్నాడు. మనము సువార్తను ప్రకటించడానికి మరియు ఆయన వారికి కూడా సహాయం చేయుచున్నాడని ఇతరులకు తెలియజేయడానికి వీలుగా ఆయన మనలను ఉన్నత స్థలములకు ఎక్కించి, మనలను ఉన్నత స్థానములో ఉంచుతాడు. ఆయన మనకు ముందుగా పోవుచూ, ప్రతి ఆటంకములను తొలగించి, వాటిని అధిగమించేలా మనలను బలంగా మారుస్తాడు. ఆయన ఇలా ఎందుకు చేస్తాడు? యేసు రాజుగా పరిపాలిస్తున్నాడని మనము ఆయనను గూర్చి ప్రకటించడానికి, అలాగే ఆయన ప్రజలకు సహాయపడతారనియు మరియు వారిని రక్షిస్తారని, స్వస్థపరుస్తారని మరియు విడిపిస్తారని చూపిస్తూ ఆయన శక్తిని వారికి నిరూపించడానికి ప్రభువు మిమ్మును బలవంతులనుగా మార్చుచున్నాడు. కనుకనే, ప్రభువు మిమ్మును ఈ విధంగా వాడుకుంటాడు. ఆలాగుననే, యేసు ఏలుచున్నాడని, రక్షిస్తాడని, స్వస్థపరుస్తాడని మరియు ప్రజలకు విడుదలను కలిగిస్తాడని మీరు ఇతరులతో పలుకుచున్న మాటలను ఆయన స్థిరపరుస్తాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు మీ పాదములను సుందరంగా చేసి, ఉన్నత స్థలములలో నిలబడునట్లుగా మిమ్మును శక్తిమంతులను చేస్తాడు. ఆయన మీరు సమాధానమును గూర్చి మాట్లాడునట్లుగా చేస్తాడు. ఆయన సన్నిధిని మూయుచు, స్థిరంగా నిలబడి, మీ చుట్టూ ఉన్న ప్రజలకు మీరు వెలుగుగా ఉండునట్లుగా మిమ్మును ప్రకాశింపజేస్తాడు. ఈ ఆశీర్వాదం కొరకు మీరు ప్రభువును స్తుతించండి.

3. ప్రభువు ప్రేమ ప్రతి పర్వతాన్ని తొలగిస్తుంది: మూడవదిగా, ప్రభువు ప్రేమ పర్వతములన్నిటిని తొలగించును. అందుకే బైబిల్ నుండి మనము యెషయా 54:10వ వచనములో చూచినట్లయితే, " పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మిమ్మును విడిచిపోదు సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు '' అని ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అవును, ఆయన తన నిబంధనను మన పట్ల సమాధాన నిబంధనగా చేస్తాడు. కాబట్టి, మీ హృదయములను కలవరపడనీయ్యకండి. ఈ రోజు ప్రభువు మీకు ఈ ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక. ప్రభువు మిమ్మును ఉన్నతమైన పర్వతములపైకి ఎక్కించినప్పుడు, కొండలను తొలగించే శక్తిని మీకిచ్చి, మిమ్మును హెచ్చిస్తాడు. అందుకే బైబిల్ నుండి మీకా 4:1వ వచనములో చూచినట్లయితే, "అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు'' అని చెప్పబడినట్లుగానే, యెహోవా మందిరమున్న పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి, కొండలకంటె ఎత్తుగా మిమ్మును హెచ్చిస్తాడు. సమస్త జనులు ఆయన యొద్దకు వస్తారు, అక్కడి నుండి ప్రభువు వాక్యము లోకానికి ప్రకటింపబడుతుంది. ప్రభువు మిమ్మల్ని అటువంటి ఉన్నత స్థానములో ఉంచి, ఆయన ప్రవచన వాక్యమును ధైర్యంగా ప్రకటించువారినిగా మిమ్మల్ని తీర్చిదిద్దును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీ యందు విశ్వాసముతో మేము నడుచుకొనుటకును, నీతియుక్తమైన, నిష్కళంకమైన జీవితము జీవించుటకును మాకు సహాయము చేయుము. దేవా, నీ కృప మా మీదను, మా కుటుంబం మీదను నిలిచియుండునట్లుగా చేయుము. ప్రభువా, మా పిల్లలను ఆశీర్వదించి, నీ మార్గములలో వారు నడుచునట్లుగాను, వారిని నీ మార్గములో స్థిరపరచుము. దేవా, వారు జ్ఞానములోను, బలములోను, నీ కృపలోను వద్ధి పొందునట్లుగా చేయుము. ప్రభువా, అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా చేసి, మమ్మును నీ సేవలో బలంగా వాడుకొనుము. దేవా, నీవు మాకు ముందుగా పోవుచు, మేము వేయుచున్న ప్రతి అడుగులలోను నీవు మమ్మును నడిపించుము. ప్రభువా, మేము నీకు మొరపెట్టక ముందే మా ప్రార్థనలకు జవాబును దయచేయుము. దేవా, నీవు మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి, మా జీవితాలను నీ మహిమ కొరకు ఉపయోగించుకొనుము. ప్రభువా, కొండలను పెకలింపగలిగే శక్తిని మాకు దయచేసి, మా హృదయములో నీ ప్రేమను కలిగి జీవించు కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా విశ్వాసము మరియు నీతియుక్తమైన జీవితము మా భవిష్యత్తుకు బలమైన ఆధ్యాత్మిక పునాదిగా మారునట్లుగా మాకు సహాయము చేయుమని యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.