నా ప్రియ స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 10:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును'' ప్రకారం దేవుడు మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు. అవును, నా స్నేహితులారా, నేటి నుండి ఆయనను మీ కాపరిగా ఉంచుకొనండి. బైబిల్ నుండి 1 రాజులు 22:17వ వచనములో చూచినట్లయితే, ఒక ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, " అతడు ఇశ్రాయేలీయులందరును కాపరిలేని గొఱ్ఱెల వలెనే కొండల మీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను'' ప్రకారం అవును, ప్రియులారా, మీ జీవితము ఏ విధంగా ఉన్నది? మీరు కూడా కాపరి లేని గొఱ్ఱెల వలె ఉన్నారా? మీరు యేసయ్యను కాపరిగా కలిగి ఉంటున్నారా? ప్రభువు హస్తాలకు మిమ్మును సమర్పించుకున్నారా? ప్రభువు జీవితములో అనుదినము మిమ్మును నడిపించబోవుచున్నాడని మీరు నమ్ముచున్నారా? ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 23వ అధ్యాయమును మనము చదివినట్లయితే, దావీదు భక్తుడు ఆ అనుభవమును కలిగియున్నాడు. బైబిల్ నుండి కీర్తనలు 23:1వ వచనములో చూచినట్లయితే, " యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని అంటున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఎందరు మీలో ఆ విధంగా చెప్పగలరు? మీరు యేసయ్యను మీ కాపరిగా కలిగి యుంటున్నారా? ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు దావీదు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "నాకు లేమి కలుగదు.'' అవును, అటువంటి యేసయ్యను మీ హృదయాలలో కలిగియున్నప్పుడు మీకు ఏమియు కొదువ ఉండదు. కనుకనే, ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, మనము యేసయ్యను మన కాపరిగా కలిగియున్నప్పుడు, మనకు ఎటువంటి దీవెనలు కలుగుతాయో మనకు మిగితా 6 వచనములలో చెప్పబడియున్నది. కీర్తనలు 23వ అధ్యాయమును మరల మరల చదవండి. అవే అనుభవములను మీ జీవితములో కూడా కలిగియుండండి. ప్రభువైన యేసుక్రీస్తును మీ జీవితములోనికి రమ్మని ఆహ్వానించండి, మీరు సిలువ వైపు చూడండి. సౌలు ఒక చెడ్డ వ్యక్తిగా ఉండేవాడు. కానీ,ప్రభువు హస్తాలలో ఒక ఉపయోగకరమైన పాత్రగా అతనిని పౌలుగా దేవుడు మార్చివేశాడు. నిజమైన ఒక సేవకునిగా మార్చాడు. ఇది ఎలాగున జరిగింది? అని చూచినట్లయితే, సౌలు ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా తన జీవితములోనికి అంగీకరించాడు. కనుకనే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఇప్పుడే మీ హృదయాలను ప్రభువుకు సమర్పించుకొని, యేసు ప్రభువు వైపు చూడండి, 'ప్రభువా, నీవే మా కాపరిగా ఉండాలి మరియు మా జీవితములోనికి రండి, మమ్మును పరిశుద్ధపరచుము. నూతన వ్యక్తిగా మమ్మును మార్చుమని చెప్పండి.' అప్పుడు ప్రభువు మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు.

నా ప్రియ స్నేహితులారా, దయచేసి, కీర్తనలు 23వ అధ్యాయమునంతటిని ఎంతో జాగ్రత్తగా చదవండి, ఆ దీవెనలన్నిటిని మీ జీవితములోనికి నిశ్చయముగా వస్తాయి. కనుకనే, మీరు యేసయ్యను, మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి, మీ పాపములన్నిటిని మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయనతో సహవాసమును కలిగి ఉండండి. ఆయన ఆనందంగా మీలోనికి వచ్చి, మీ స్వంత రక్షకునిగా ఉంటాడు. మీ పాపాల కొరకు సిలువలో కార్చిన తన రక్తము ద్వారా మిమ్మును పరిశుద్ధపరుస్తాడు. ఆయన మీకు కాపరిగా ఉంటాడు. మీకు లేమి కలుగకుండా మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఈ ఆశీర్వాదమును నేటి వాగ్దానము ద్వారా పొందుకొనండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా కోసం నీ ప్రాణాన్ని అర్పించి, మాకు మంచి కాపరిగా ఉన్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసు ప్రభువా, మా బలహీనతలు, పాపాలు మరియు అవసరాలతో మేము ఈ రోజు నీ ముందుకు వచ్చుచున్నాము మరియు సిలువపై చిందిన నీ విలువైన రక్తంతో మమ్మును కడిగి పరిశుద్ధపరచుమని మేము నిన్ను కోరుచున్నాము. ప్రభువా, నీవు మాకు కాపరిగా ఉండు, ప్రతిరోజు మమ్మును నీ మార్గములో నడిపించుము మరియు నీవు సౌలును, పౌలుగా మార్చినట్లుగానే, మమ్మును నీ ప్రేమగల హస్తాలతో నూతన వ్యక్తిగా మార్చుము. దేవా, మమ్మును శాంతికరమైన జలముల యొద్ద నడిపించుము మరియు నీ వాక్యం ప్రకారం మా అవసరాలన్నింటిని తీర్చుము. ప్రభువా, మేము మా జీవితాన్ని పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాము మరియు నీవు మా మంచి కాపరివని విశ్వాసంతో ప్రకటించుచున్నాము మరియు మాకు ఏ మేలు కొదువై ఉండదని నమ్ముచున్నాము. దేవా, కీర్తనలు 23వ అధ్యాయము ప్రకారము మా జీవితాన్ని నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.