నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 పేతురు 1:21వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి'' అని చెప్పబడిన ప్రకారము ఇది ఎంతటి అద్భుతమైన గొప్ప పిలుపు కదా! దేవుడు మీ జీవితానికి ఒక మహిమాన్వితమైన ప్రణాళికను కలిగియున్నాడు. మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవచించే ఆయన కుమారుడు లేదా కుమార్తె కావాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, మీరు ఆయన మాటలను పలుకుతూ ఆయన ప్రణాళికలను బయలుపరచునట్లుగా ప్రభువు మీపై తన ఆత్మను కుమ్మరించుచున్నాడు. ఆయన ఆత్మ మిమ్మల్ని నింపినప్పుడు, మీరు దేవుడు పలుకు మాటలను మీ హృదయాంతరంగములో నుండి మాట్లాడతారు. యేసు మాటలలోను, క్రియలలోను శక్తిమంతుడైన ప్రవక్తగా ఉన్నట్లుగానే, నా ప్రియులారా, నేడు మీరు కూడా మాటలలోను, క్రియలలోను శక్తివంతులుగా ఉంటారని చెప్పబడియున్నది. కనుకనే, ఇప్పుడే, ప్రభువుకు మొరపెట్టి ఇలాగున చెప్పండి, 'యేసు, నన్ను నీ ప్రవక్తగా, నీ ప్రవ్రక్తిగా చేసినందుకు నీకు వందనాలు ' అని చెప్పి మీరు ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఆత్మ మిమ్మును సమృద్ధిగా నింపుతుంది. అంతమాత్రమే కాదు, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన మీరు అనేక మందికి జీవమును మరియు మార్గమును చూపించడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు.

రెండవదిగా, దేవుని ప్రవక్తగా లేదా ప్రవ్రక్తిగా, మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలను మాత్రమే మాట్లాడతారు. అందుకే బైబిలు ఆమోసు 3:7వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు'' అని చెప్పబడిన ప్రకారము అవును, దేవుడు తన హృదయాంతరంగమునకు సమీపముగా ఉన్న తన పిల్లలకు తన మర్మములను బయలుపరచడానికి ఇష్టపడతాడు. కనుకనే, ఆయన మీతో మాట్లాడుచున్నప్పుడు, ఇతరులకు ఆదరణ, హెచ్చరిక, స్వస్థత మరియు నిరీక్షణను కలిగించే మాటలను ఆయన మీకు దయచేస్తాడు. మీరు మీ ఆలోచనలను చెప్పడానికి కాదు, దేవుని ప్రణాళికలను ప్రకటించడానికి పిలువబడియున్నారు. అంతమాత్రమే కాదు, ఆయన తన మాటలను మీ నోటిలో ఉంచుతాడు మరియు తన అగ్నిని మరియు ఆత్మను మీ హృదయంలో ఉంచుతాడు. మీరు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, మీ ఆత్మ ఆయన స్వరానికి తగినట్లుగా మృదువుగా మారుతుంది. అవును, నా ప్రియులారా, ఆయన ప్రవక్తలైన మోషే, సమూయేలు, ఏలీయా మరియు దానియేలులతో మాట్లాడినట్లుగానే, నేడు, ఆయన మీతో కూడా మాట్లాడతాడు. కనుకనే, మీరు దేవుని యొద్ద నుండి విని ఆయన సత్యాన్ని ప్రకటించగల వారి కొరకు ప్రపంచం ఎదురుచూచుచున్నది. ఆ గవిని యొద్ద నిలబడి పరలోక సందేశాన్ని భూమికి తీసుకురావడానికి మీరు వారిలో ఒకరిగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా!

మూడవదిగా, నా ప్రియులారా, నేడు మీరు దేవుని ఆత్మచేత మోయబడతారు. సువార్తను ప్రకటించడానికి ప్రభువు ఆత్మ ఫిలిప్పును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళిందని బైబిల్ చెబుతుంది. ఏలీయా మీద కూడా ఆ ఆత్మ దిగివచ్చి, అహాబు రాజు రథం ముందుగా పరుగెత్తడానికి అతనికి అతీంద్రియ శక్తినిచ్చింది. అదేవిధంగా, స్నేహితులారా, మీరు కూడా అటువంటి ఆత్మచేత మీరు ఎక్కడికి వెళ్లాలని కోరుకుంటారో అక్కడికి నడిపించబడతారు. దేవుని ఆత్మ మీలో చలించినప్పుడు, మీరు స్వస్థత, పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనాన్ని తీసుకొనివస్తారు. అందుకే బైబిల్ నుండి యెహెజ్కేలు 47వ అధ్యాయములో వివరించినట్లుగానే, దేవుని నది ఆయన సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తుంది మరియు అది ఎక్కడికి వెళ్ళినా జీవమును తీసుకొనివచ్చుచున్నది. ఆ నది మీ ద్వారా ప్రవహించే పరిశుద్ధాత్మ! మీరు ఈ దైవీకమైన నది ద్వారా మోసుకెళ్ళబడినప్పుడు, ప్రజలు స్వస్థత పొందుకుంటారు, మరణించిన ఆత్మలు మరల జీవమును పొందుకొని పునరుద్ధరించబడతాయి మరియు అనేకమంది యేసు వైపు ఆకర్షితులవుతారు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడు మీ హృదయం మీలో మండినప్పుడు, అది పరిశుద్ధాత్మ మీలో ప్రవచనాన్ని ప్రేరేపిస్తుంది అని మీరు గుర్తించాలి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 39:3వ వచనమును చూచినట్లయితే, "నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని'' అని చెప్పబడియున్నది. అప్పుడు, రోమీయులకు 8:26-27వ వచనములలో చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు '' అని చెప్పబడినట్లుగానే, నేడు నా ప్రియులారా, మీరు ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుట ద్వారా దేవుని చిత్తాన్ని మీ జీవితాలలో జరిగించబడాలని మీరు ప్రార్థిస్తారు. ఇది మీకు మరియు ప్రభువుకు మధ్య ఉన్న దైవీకమైన భాగస్వామ్యమును కలిగియున్నారు. కనుకనే, దేవుని ఆత్మ మిమ్మల్ని చలింపజేస్తుంది, మీరు మాట్లాడతారు మరియు ఆయన చిత్తం భూమిపై జరుగుతుంది. కనుకనే, నా ప్రియులారా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ బిడ్డగా మరియు నీ వర్తమానము పంపు దూతగా ఎన్నుకున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపి, మమ్మును ప్రవచించువారినిగా మార్చుము. దేవా, నీ మాటలు మా హృదయంలో అగ్నివలె మండునట్లుగాను మరియు మా నోటి ద్వారా శక్తితో ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు బయలుపరచిన దానిని మాత్రమే మాట్లాడుటకు మరియు ఇతరులకు ఆదరణ మరియు కనికరమును, సత్యాన్ని తీసుకురావడానికి మాకు నేర్పించుము. దేవా, నీ వాక్యం అవసరమైన ప్రదేశాలకు మమ్మును నీ ఆత్మ ద్వారా తీసుకువెళ్లుము. యేసయ్యా, నీ యొక్క జీవజలపు బుగ్గ మరియు నది మా ద్వారా ప్రవహించి విరిగినలిగిన వారికి స్వస్థత కలిగించునట్లుగా చేయుము. దేవా, నీవు నీ భక్తులైన ప్రవక్తలకు చేసినట్లుగానే, నీ యొక్క మర్మములను మాకు బయలుపరచుము. ప్రభువా, నీ పిలుపుకు పవిత్రతతోను మరియు విధేయతతోను నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మహిమ కొరకు మేము మాటలోను మరియు క్రియలోను శక్తిమంతులనుగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. దేవా, మా కుటుంబ జీవితములోను, సమాజములోను నీ యొక్క ప్రవచనమును తెలియపరచడానికి మాకు నీకృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో, నీ ప్రవచనాత్మక కృపతో నన్ను అభిషేకించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.